అధికారుల పనితీరుపై సభ్యుల ఆగ్రహం

ABN , First Publish Date - 2023-02-07T00:12:45+05:30 IST

అధికారుల పనితీరుపై ధర్మారం మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ అధ్యక్షతన సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం సోమవారం జరిగింది.

అధికారుల పనితీరుపై సభ్యుల ఆగ్రహం
మాట్లాడుతున్న ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ

- ఆర్‌ఆండ్‌బీ డీఈఈ, ఏఈలను సస్పెండ్‌ చేయాలని తీర్మానం

- ధర్మారం మండల సర్వసభ్య సమావేశం

ధర్మారం, ఫిబ్రవరి 6: అధికారుల పనితీరుపై ధర్మారం మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ అధ్యక్షతన సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం సోమవారం జరిగింది. మన ఊరు-మనబడి పథకం కింద పాఠశాలలో చేపట్టిన పనుల్లో నాణ్యత లోపించినా అధికారులు పర్యవేక్షించడం లేదని సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాఠశాలలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద చేపట్టిన ప్రహరీ, మరుగుదొడ్ల నిర్మాణ పనులు చేసిన బిల్లు చెల్లింపులతో పాటు, నూతనంగా అంచనాలను తయారు చేయడంలో ఆర్‌ఆండ్‌బీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తున్నారని మండిపడ్డారు. మన ఊరు-మనబడి పథకం ద్వారా సాగుతున్న పనులను ఎందుకు పర్యవేక్షించడం లేదని ఎంఈవోపై ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిసారీ జరిగే మండల సర్వసభ్య సమావేశాలకు ఆర్‌ఆండ్‌బీ అధికారులు ఎందుకు హాజరు కావడం లేదని సభ్యులు ప్రశ్నించారు. మండలంలో సాగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా విధుల్లో అలసత్వంగా వ్యవహరిస్తున్న ఆర్‌ఆండ్‌బీ డీఈఈ, ఏఈలను సస్పెండ్‌ చేయాలని కోరుతు నందిమేడారం సింగిల్‌విండో చైర్మన్‌ ముత్యాల బలరాంరెడ్డి ప్రతిపాదించగా మండల సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. తగు చర్యల నిమిత్తం కోసం కలెక్టర్‌కు నివేదిస్తానని ఎంపీడీవో జయశీల తెలిపారు. వ్యవసాయ రంగానికి కరెంట్‌ సరఫరాలో తీవ్ర అంతరాయం కలుగుతుందని సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. వేళల ప్రకారంగా కరెంట్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. సాంకేతిక కారణాలతో వేళల ప్రకారం కరెంట్‌ సరఫరాలో అంతరాయం కలుగుతుందని త్వరలో సమస్య తీరుతుందని ఏఈ ఖాసీం వివరణ ఇచ్చారు. నర్సింగాపూర్‌ గ్రామశివారులోని ప్రభుత్వ భూములను ఇతర ప్రాంతాలకు చెందిన వారు కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని ఎంపీటీసీ సభ్యుడు బద్దం అజయ్‌పాల్‌రెడ్డి ప్రశ్నించారు. అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ భూములను పంపిణీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనుల విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు ప్రగతి నివేదికలను అందజేయాలని ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే ఇంజనీరింగ్‌ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో మిషన్‌ భగీరథ పథకం ద్వారా చేపట్టిన పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపీపీ సూచించారు. సమావేశంలో జడ్పీటీసీ సభ్యురాలు పూస్కూరి పద్మజ, నందిమేడారం, పత్తిపాక సింగిల్‌విండో చైర్మన్‌లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, ఎంపీడీవో జయశీల వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:12:50+05:30 IST