పూర్తికావస్తున్న కొనుగోళ్లు

ABN , First Publish Date - 2023-05-27T01:01:18+05:30 IST

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు వచ్చాయి. అకాల వర్షాల వల్ల కలిగిన నష్టం, చీడపీడల కారణంగా దిగుబడి తగ్గడంతో కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం కూడా తగ్గిపోయింది

పూర్తికావస్తున్న కొనుగోళ్లు

- కేంద్రాలకు తగ్గిన ధాన్యం

- ఇప్పటి వరకు కొన్నది 2,19,584 మెట్రిక్‌ టన్నులు

- కొన్న ధాన్యం విలువ రూ. 452.34 కోట్లు

- రైతులకు చెల్లించింది రూ. 132.65 కోట్లు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు వచ్చాయి. అకాల వర్షాల వల్ల కలిగిన నష్టం, చీడపీడల కారణంగా దిగుబడి తగ్గడంతో కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం కూడా తగ్గిపోయింది. అధికారుల అంచనాల మేరకు సగం ధాన్యం కూడా కొనుగోలు కేంద్రాలకు రాలేదు. ఈసారి 4,52,885 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేసి వాటిని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేయగా ఇప్పటి వరకు కేవలం 2,19,584 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే కేంద్రాలకు వచ్చింది. గత రబీలో సుమారు 2.40 లక్షల ఎకరాలు సాగు చేయగా 3,02,668 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కేంద్రాలలో కొనుగోలు చేశారు. ఈసారి కూడా ఇంచుమించుగా అంతకు మించిన ధాన్యం రాకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రారంభంలో అధికారులు వేసిన అంచనాలకంటే 1,50,000 మెట్రిక్‌ టన్నుల ధాన్యం తగ్గిపోతున్నది. దిగుబడి తగ్గడం, అకాల వర్షాలకు కొంత నష్టపోవడం కారణంగానే కాకుండా కొనుగోలు కేంద్రాలలో తరుగు పేరిట క్వింటాలుకు 10 కిలోల మేరకు కోత విధించడం, కొనుగోలు కేంద్రాలకే కాకుండా అక్కడ నుంచి రైస్‌ మిల్లులకు కూడా రైతులే పోయి తమ ధాన్యాన్ని అప్పగించాల్సి రావడం కూడా కారణమని చెప్పవచ్చు. కొనుగోలు కేంద్రాలలో వారం పది రోజులపాటు వేచి చూడాల్సి రావడం, ధాన్యం కాంటా వేసినా క్వింటాలుకు 10 కిలోల తరుగు తీయడం, రైతులే కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువెళ్లి, మళ్లీ ఆ ధాన్యంతో మిల్లులకు కూడా వెళ్లి అక్కడ అదనపు తరుగుకు అంగీకరించాల్సిన పరిస్థితులు ఏర్పడడం రైతులను నష్టాలకు, కష్టాలకు గురి చేసింది. ఈ పరిస్థితులన్నింటిని గమనించి చాలామంది కల్లాలలోనే క్వింటాలుకు 1700 నుంచి 1800 రూపాయలకు ధాన్యం అమ్ముకున్నారు. తేమ ఎక్కువగా ఉన్నా వ్యాపారులు అంగీకరించడంతో మద్దతు ధరకు కొంచెం అటుగా ఇటుగా ధర చెల్లించినా వారికే రైతులు అమ్ముకున్నారని అంటున్నారు. ప్రైవేట్‌లో డబ్బు వెంటనే చెల్లించడం కూడా రైతులు వారికి అమ్ముకోవడానికి ఒక కారణంగా భావిస్తున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తక్కువగా వచ్చిందని భావిస్తున్నారు.

56 కొనుగోలు కేంద్రాలు మూసివేత

ఏప్రిల్‌ 16వ తేదీన జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభయ్యాయి. జిల్లావ్యాప్తంగా 336 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అధికారుల అంచనాలో సగం ధాన్యం కూడా కొనుగోలు కేంద్రాలకు రాలేదు. 40 రోజులలో జిల్లా వ్యాప్తంగా ఈ కేంద్రాలలో 34,906 మంది రైతులకు చెందిన 2,19,584 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ ధాన్యం విలువ 452.34 కోట్లు ఉండగా ఇప్పటి వరకు 12 వేల మంది రైతులకు 132.65 కోట్లు చెల్లించారు. ధాన్యం కొనుగోలు తర్వాత వెంట వెంటనే ఆ వివరాలను కంప్యూటర్లలో నమోదు చేయడంలో ఆలస్యం జరుగుతుండడంతో డబ్బు చెల్లింపులలో కూడా జాప్యమవుతున్నది. 34,906 మంది రైతుల ధాన్యం కొనుగోలు చేసినా ఇప్పటి వరకు 30,049 మంది రైతులకు చెందిన 1,61,751 మెట్రిక్‌ టన్నుల ధాన్యం వివరాలను మాత్రమే కంప్యూటర్లలో నమోదు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యంలో 26 శాతం ధాన్యం వివరాలు ఇంకా కంప్యూటర్లకు ఎక్కలేదు. కంప్యూటర్లలో నమోదైన ధాన్యం విలువ 333 కోట్లు కాగా రైతులకు చెల్లించింది 132 కోట్లు. ఇంకా రైతులకు 320 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉన్నది. కొన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావడం ఆగిపోయినందున 56 కొనుగోలు కేంద్రాలను ఎత్తేశారు. మరో 10, 15 రోజుల్లో అక్కడక్కడ మిగిలిపోయిన ధాన్యం కొనుగోళ్లు కూడా పూర్తవుతాయి. 90 శాతం కొనుగోళ్లు ఈ నెలాఖరు వరకే పూర్తికావచ్చని, ఆ తర్వాత నామమాత్రపు ధాన్యం వస్తుందని అధికారులు భావి స్తున్నారు. మొత్తానికి సాగు పెరిగినా కొనుగోలు కేంద్రాలకు ఈసారి గత రబీలో వచ్చిన ధాన్యానికి మించి వచ్చే అవకాశాలు లేవు.

Updated Date - 2023-05-27T01:01:18+05:30 IST