ధాన్యం కొనుగోళ్లకు సన్నాహాలు

ABN , First Publish Date - 2023-03-26T01:01:05+05:30 IST

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధిత అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ యాసంగి సీజన్‌లో 4 లక్షల 25 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

ధాన్యం కొనుగోళ్లకు సన్నాహాలు

- జిల్లా వ్యాప్తంగా 300 కేంద్రాలు

- 4.25 మెట్రిక్‌ టన్నుల కొనుగోలు లక్ష్యం

- నెలాఖరులో కేంద్రాల నిర్వాహకులకు శిక్షణ

- వచ్చే నెలలో ప్రారంభం కానున్న కేంద్రాలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధిత అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ యాసంగి సీజన్‌లో 4 లక్షల 25 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు గాను ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లావ్యాప్తంగా 300 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సీజన్‌లో జిల్లాలో 2,10,678 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయగా, ఇందులో 1,99,451 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. తద్వారా సుమారు 4 లక్షల 75 వేల మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యం దిగుబడులు వస్తాయని వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖాధికారులు అంచనా వేశారు. ఇందులో 50 వేల టన్నుల వరకు విత్తనోత్పత్తి కోసం పోగా, మిగతా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించారు.

ఫ దిగుబడులు తగ్గే అవకాశం

ఇటీవల జిల్లాలో కురిసిన అకాల, వడగళ్ల వర్షాలకు సుమారు 4,869 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నది. దీంతో దిగుబడులు తగ్గవచ్చని, పంట ప్రారంభంలో వచ్చిన మొగి పురుగు వల్ల కూడా కొంత మేరకు దిగుబడులు తగ్గే అవకాశాలున్నాయి. ఎంత ధాన్యం వచ్చినా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తున్నది. ధాన్యం కొనుగోలు చేసేందుకు గ్రామానికి ఒక కొనుగోలు కేంద్రం చొప్పున మొత్తం 300 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 222, మహిళా సంఘాల ద్వారా 59, డీసీఎంఎస్‌ల ద్వారా 14, వ్యవసాయ మార్కెట్ల ద్వారా 5 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. కరోనాకు ముందు 200 లోపు కేంద్రాలను మాత్రమే ఏర్పాటుచేయగా, కరోనా సమయంలో వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రతి గ్రామానికి ఒక కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఆ తర్వాత నుంచి ఆయా కేంద్రాలను గ్రామాల్లో అలాగే కొనసాగిస్తున్నారు. కేంద్రాలను నిర్వహించే వారికి కొనుగోళ్లపై ఈనెలాఖరులో ఒకేరోజు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏ గ్రేడ్‌ రకం ధాన్యం క్వింటాలుకు 2,060 రూపాయలు కాగా, కామన్‌ రకం ధాన్యం క్వింటాలుకు 2,040 రూపాయలు ఇవ్వనున్నారు. లక్ష్యం మేరకు ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు లక్షా 10 వేల వరకు గన్నీ బ్యాగులు అవసరం అవుతాయని పౌరసరఫరాల శాఖాధికారులు అంచనా వేశారు. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న బ్యాగులు పోనూ, మరిన్ని బ్యాగుల కోసం సంబంధిత శాఖాధికారులు ఆర్డర్‌ ఇచ్చారు. జిల్లాలో వరి నాట్లు ఆలస్యంగా వేయడం వల్ల కోతలు ఆలస్యం కానున్నాయి. ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌ మండలాల్లో వ్యవసాయ బావుల కింద సాగు చేసిన వరి కోతకు వస్తున్నది. కోతలను బట్టి కేంద్రాలను ప్రారంభించాలని చూస్తున్నారు.

ఫ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

- తోట వెంకటేశ్‌, డీఎస్‌వో, పెద్దపల్లి

ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. ఈ కేంద్రాల ద్వారానే రైతులకు మద్దతు ధర లభిస్తుంది. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూస్తాం. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. వరి కోతలను బట్టి ఆయా గ్రామాల్లో కేంద్రాలను ఆరంభిస్తాం.

Updated Date - 2023-03-26T01:01:05+05:30 IST