ముఖ ఆధారిత హాజరుకు సన్నాహాలు
ABN , First Publish Date - 2023-09-22T00:37:50+05:30 IST
సర్కారు బడుల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడంతో పాటు అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు గాను ముఖ ఆధారిత హాజరును నమోదు చేసేందుకు జిల్లా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పలు పాఠశాలల్లో వారం రోజుల నుంచి చేపడుతున్న ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది.
- ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెంచేందుకే
- ప్రతీ పాఠశాలలో నమోదు చేయాలని ఆదేశాలు
- ఆయా పాఠశాలల్లో కొనసాగుతున్న ట్రయల్ రన్
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
సర్కారు బడుల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడంతో పాటు అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు గాను ముఖ ఆధారిత హాజరును నమోదు చేసేందుకు జిల్లా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పలు పాఠశాలల్లో వారం రోజుల నుంచి చేపడుతున్న ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది. ట్రయల్ రన్‌లో ఏమైనా సాంకేతిక లోపాలు బయటపడితే వాటిని సవరించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ఆరంభించనున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉండే అధికారులు తమ పరిధిలోని ఏ ప్రభుత్వ పాఠశాల హాజరు శాతాన్ని అయినా యాప్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. ముఖ ఆధారిత హాజరు ద్వారా పాఠశాలకు రాకుండా ఉన్న విద్యార్థులు, బోగస్ విద్యార్థులను తొలగించడంతో పాటు, మధ్యాహ్న భోజన పథకం కింద ఎక్కువ హాజరు వేయకుండా ఉండేందుకు అడ్డుకట్ట వేయనున్నారు. ఈ విధానాన్ని జిల్లాలో గల 361 ప్రాథమిక పాఠశాలలు, 83 ప్రాథమికోన్నత, 101 ఉన్నత పాఠశాలు, 10 కస్తూర్భాగాంధీ గురుకులాలు, ఏడు మోడల్ స్కూళ్లలో అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ పాఠశాలల్లో సుమారు 38 వేల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. సంబంధిత యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరును కంప్యూటర్లలో నమోదు చేసి, ఎటువంటి అవకతవకలకు వీలు లేకుండా ఇందుకోసం ముఖ గుర్తింపు ఆధారిత డీఎస్‌ఈ- ఎఫ్‌ఆర్‌ఎస్ (ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం) యాప్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ సాయంతో విద్యార్థుల రోజు వారీ హాజరు నమోదు కానున్నది. ఇప్పటికే ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు యాప్ డౌన్ లోడ్ చేసి హాజరు నమోదు ప్రక్రియను ఆరంభిస్తున్నారు. పలు పాఠశాలల్లో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. దీనిపై ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు అవగాహన కూడా కల్పించారు. విద్యార్థుల చిత్రాలను యాప్‌లో భద్ర పరచాల్సి ఉండగా సాంకేతిక, ఇతర కారణాలతో ఆలస్యం అవుతోంది. సమగ్ర శిక్ష ఉద్యోగులు తమకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు క్రమబద్ధీకరణ చేయాలని సమ్మె చేస్తుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ గుర్తింపు ఆధారిత హాజరు నమోదుపై డీఈవో కార్యాలయ అధికారులు కూడా పరిశీలన చేస్తున్నారు.
- యాప్ రిజిస్ట్రేషన్ ఇలా..
జిల్లాలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతాన్ని నమోదు చేసేందుకు గతంలో బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. కొవిడ్ కారణంగా బయోమెట్రిక్ నిలిచిపోవడంతో నూతనంగా డీఎస్‌ఈ- ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్ లోడ్ చేసుకొని పాఠశాల యూడైస్ కోడ్‌ను యూజర్ ఐడీగా పాస్వర్డ్‌తో లాగిన్ కావడంతో యాప్ అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత విద్యార్థుల ముఖ చిత్రాలను యాప్ ద్వారా తీసి భద్రపరచాల్సి ఉంటుంది. ఉదయం వేళలో ప్రార్థన పూర్తయిన తర్వాత తరగతి గదిలోనే యాప్ ద్వారా హాజరు నమోదు చేయనున్నారు. అయితే కొన్ని మారుమూల ప్రాంతాల్లో సరైన సిగ్నల్ లేకపోవడంతో పాటు కొన్ని పాఠశాలల్లో ఒకరు, ఇద్దరు మాత్రమే విద్యార్థులున్నారు. ఇలాంటి చోట యాప్ రిజిస్ట్రేషన్ మార్గదర్శకాలు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి. అన్ని తరగతులకు యాప్ ద్వారా హాజరు నమోదు నూరుశాతం చేయాల్సిందేనని సంబంధిత అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో విద్యార్థుల మధ్యాహ్న భోజనం, ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు పంపిణీ, ఇతర కార్యక్రమాలకు యాప్ ఉపయోగపడనున్నది. మరికొన్ని రోజుల్లో ఉపాధ్యాయుల హాజరును కూడా ఈ యాప్ ద్వారానే నమోదు చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతున్నది. వచ్చే నెల మొదటి వారంలో ఈ ప్రక్రియ పూర్తి కానున్నది. ఆ తర్వాత డీఎస్‌ఈ-ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్ అమల్లోకి రానున్నదని అధికారులు చెబుతున్నారు.
హాజరు శాతాన్ని పెంచేందుకే..
- మాధవి, జిల్లా విద్యాశాఖాధికారి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడంతో పాటు అవకతవకలను అరికట్టేందుకే ముఖ ఆధారిత హాజరు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్నది. దీని ద్వారా పాఠశాలల్లో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు.. ఎంత మంది పాఠశాలకు వస్తున్నారు.. తక్కువ హాజరు గల విద్యార్థులు పూర్తి స్థాయిలో పాఠశాలకు వచ్చే విధంగా చర్యలు చేపట్టి హాజరు శాతాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. యాప్ సేవలు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్కులు, యూనిఫామ్స్, మధ్యాహ్నా భోజన పథకం అమలుకు ఉపయోగపడనున్నది.