పొలిటికల్ విమర్శలు పొలైట్‌గా ఉండాలి
ABN , First Publish Date - 2023-10-04T00:44:04+05:30 IST
రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు తావివ్వకుం డా, పొలిటికల్ విమర్శలు హుందాగా, పోలైట్ గా ఉండాలని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ అన్నారు.
కల్వకుంట్ల కుటుంబం అంతా తెలంగాణద్రోహులే
కేటీఆర్ భాషను చూసి తెలంగాణ సమాజం ఛీ అంటోంది
కొడుకు బాధలు తట్టుకొని కేసీఆర్ వందేళ్లు బతకాలి
బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్
జగిత్యాల అర్బన్, అక్టోబర్ 3: రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు తావివ్వకుం డా, పొలిటికల్ విమర్శలు హుందాగా, పోలైట్ గా ఉండాలని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ అన్నారు. నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన మోదీ బహిరంగ సభకు హాజరైన ఆయన మార్గమధ్యలో జగిత్యాల వద్ద ఆగి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు, నిజామాబాద్ సభలతో పాటు, రెండు ప్రాంతాల ద్వారా రూ.20వేల కోట్ల అభివృద్ధి పనులు, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, పసుపు బోర్డు ఏర్పాటుకు బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయించడం పట్ల మోదీకి బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజలు దేశ ప్రధానిని మర్చిపోరన్నారు. ట్విట్టర్ టిల్లు టెన్షన్‌లో అందరికీ ఫోన్ చేసి తిడుతూ మోదీని తిట్టండని చెప్తున్నారని, దీంతో బీఆర్‌ఎస్‌లో ఉన్న కొందరు మొరుగుతున్నారన్నారు. కల్వకుంట్ల కుటుంబం అరుపులు చూసి, పిచ్చి కుక్కలు సైతం ఊరవతలికి పరుగెత్తే పరిస్థితి రావడానికి బీఆర్‌ఎస్ నేతల అరుపులే కారణం అన్నారు. ఏ పిచ్చికుక్క పిలిస్తే ఎన్‌డీఏ కూటమి ర్యాలీలో మీ అయ్యా పాల్గొన్నారని సంజయ్ ప్రశ్నించారు. ఎన్‌డీఏ., ఇండియా కూటమి రెండూ బీఆర్‌ఎస్‌ను నమ్మరని, అసలు బీఆర్‌ఎస్‌ది ఏ కూటమి?అనేది తేల్చాలని డిమాండ్ చేశారు. కల్వకుంట్ల కుటుంబమే మోసగారి కుటుంబం అని, దుబాయ్ చంద్రశేఖర్ నుంచి నేటి అజయ్ రావు వరకు అంత మోసమేనని అన్నారు. మంత్రి పదవి కోసం పరదా వెనుక ఏం జరిగింది అనేది మీ అయ్య కేసీఆర్‌ను అడిగి, అప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని సంజయ్ సవాల్ విసిరారు. మోదీని చీటర్ అనే ముందు దొంగదీక్ష చేసి, మందు తాగి, మీడియా వచ్చాక నటించిన ఛీటర్ మీ అయ్యా అని గుర్తుంచుకోవాలన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి ఇన్ని కోట్ల ఆస్తులు ఎక్కడినుంచి వచ్చాయని ప్రశ్నించిన ఆయన, కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీకి డబ్బులు అందించారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాను ఎవరి నాశనం కోరుకునే వ్యక్తిని కాదని, కేసీఆర్ నిండునూరేళ్లు జీవించాలని కోరుకునే మొదటి వ్యక్తి తానేనని, 15 రోజులుగా కొడుకు పెట్టే ఇబ్బందులు భరించలేకనే కేసీఆర్ బయటకు వెళ్లడం లేదనే అనుమానం కలుగుతోందన్నారు. మోదీ పర్యటనతో బీఆర్‌ఎస్ నేతలు ప్రస్టేషన్, డిప్రెషన్‌లోకి వెళ్లారని, అందుకే ఒకరు టీవీలు తన్నితే, మరికొందరు బీజేపీ కార్యకర్తలపై దాడులకు దిగారని ఇదీ మోదీ యాత్ర తర్వాత తెలంగాణ పొలిటికల్ సినారియో అని అన్నారు. ప్రధాని మోదీని కలిసి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మద్దతు అడగలేదా అని కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. కేటీఆర్‌ను సీఎం చేస్తా అన్నది వాస్తవం కాదా అని తడి బట్టలతో భాగ్యలక్ష్మి ఆలయంలోనికి వెళ్దామా అని కేసీఆర్‌కు సవాల్ విసిరారు.
ప్రధానిపై హద్దుమీరి మాట్లాడవద్దని, ఎవరు మాట్లాడిన అది తప్పని గమనించాలన్నారు. గాంధీని పూజించేది తామని, గాంధీ జయంతికి నీ అయ్య ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ముందు నీ అయ్య గాంధీనా, లేక గాడ్సే జయంతికి వెళ్తాడా అనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అన్ని మసీదులకు నిధులు ఇచ్చిన కేసీఆర్, దూప, దీప నైవేద్యంలేని పురాతన ఆలయాలను సైతం విస్మరించడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ , బీఆర్‌ఎస్ ఒక్కటేనని ఈ విషయాన్ని తెలంగాణ సమాజం గమనించాలని కోరారు. బీజేపీ శ్రేణుల నైరాశ్యంపై విలేఖరుల ప్రశ్నకు స్పందించిన ఆయన యావత్ తెలంగాణమే మోదీ రాకతో జోష్‌లో ఉంటే, బీజేపీ కార్యకర్తలు జోష్‌లో ఉండరా ఆలోచించుకోవాలన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారం కైవసం చేసుకోవడం తథ్యం అన్నారు.