Share News

పార్లమెంట్‌ ఎన్నికలవైపు ‘బండి’ చూపు

ABN , First Publish Date - 2023-12-11T00:20:15+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గెలుపు తీరం వరకు తీసుకవెళ్లి నిరాశమిగిల్చినా వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో తన స్థానాన్ని పదిలపరుచుకునేందుకు కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి

పార్లమెంట్‌ ఎన్నికలవైపు ‘బండి’ చూపు

- త్వరలో కార్యాచరణ కోసం సమాలోచనలు

- అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు

- బలం, బలహీనతలను గుర్తించి దిద్దుబాటు చర్యలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గెలుపు తీరం వరకు తీసుకవెళ్లి నిరాశమిగిల్చినా వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో తన స్థానాన్ని పదిలపరుచుకునేందుకు కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్‌ అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం ఆయన ఒకవైపు తన పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సమీక్షించుకుంటూ వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇప్పుడు కోల్పోయిన ఓట్లను రాబట్టుకునేందుకు వ్యూహాలు రూపొందిం చుకుంచుకుంటున్నారు. ఇందుకోసం ఆయన అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. నియోజకవర్గాల వారీగా విస్తృతస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీతో పాటు వివిధ పార్టీలు సాధించిన ఓట్లు, ఆ ఓట్లు పొందడానికి ఆయా పార్టీలు అనుసరించిన పద్ధతులు, సహకరించిన పరిస్థితులు, ఇతరత్రా కారణాలను అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఆయా అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఏ మండలాలు, గ్రామాల్లో బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి, ఏ గ్రామంలో తక్కువ ఓట్లు వచ్చాయి. ఆయా గ్రామాల్లో సంస్థాగత నిర్మాణం బలంగా ఉందా... లేదా అన్న విషయాలను సమీక్షించి లోపాలను సరిదిద్దుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

ఫ గ్రామాల్లో ఓట్ల సరళిపై విశ్లేషణ

కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్న 671 గ్రామాల్లో ఓట్ల సరళిని విశ్లేషించి, పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ పార్లమెంట్‌ సమావేశాలు ముగియగానే ఈ సమీక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 45 రోజుల్లో కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో పర్యటించి పార్టీ నాయకులను, కార్యకర్తలను కలిసి చర్చించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షా సమావేశాలను నిర్వహించి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల సరళిని విశ్లేషించడంతో పాటు వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను పార్టీలోని వివిధస్థాయిల నాయకులతో చర్చించాలని, జనవరి 15 తర్వాత నేరుగా అన్ని గ్రామాల్లో పర్యటించేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో సుమారు 90వేల ఆధిక్యతతో గెలుపొందిన ఆయన ఈసారి అంతకంటే ఎక్కువ మెజార్టీ సాధించాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి కేవలం లక్ష ఓట్లు మాత్రమే రాగా, పార్లమెంట్‌ ఎన్నికల్లో 4వేల ఓట్లు అదనంగా సాధించి విజయం పొందామని, ఇప్పుడు అంతకంటే రెట్టింపు మెరుగైన పరిస్థితులు ఉండడంతో పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం సాధించడం కష్టమేమీ కాదనే భావనతో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని చెబుతున్నారు.

Updated Date - 2023-12-11T00:20:19+05:30 IST