పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి
ABN , First Publish Date - 2023-09-22T23:54:06+05:30 IST
పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక కార్యాచరణ అమలుచేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు.
పెద్దపల్లిటౌన్, సెప్టెంబరు 22: పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక కార్యాచరణ అమలుచేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ముజమ్మిల్‌ఖాన్ కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫ్‌రెన్స్ హాలులో అదనపు కలెక్టర్లు జే.అరుణశ్రీ, శ్యాంప్రసాద్‌లాల్‌తో కలిసి ప్రజావాణి దరఖాస్తులు, ధరణి, గృహలక్ష్మి, ఓటరుజాబితా సవరణ దరఖాస్తులు, మీ సేవా తదితర అంశాల పై తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణలో భాగంగా వచ్చిన అభ్యంతరాలు,నూతన ఓటరు నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈనెల 25లోగా పరిష్కరించాలని అధికారులను సూచించారు. జిల్లాలోని ప్రతిపోలింగ్ కేంద్రంలో అవసరమైన వస తులు తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని, ర్యాంపులు, టాయిలెట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. దివ్యాంగులకు అవసరమైన ఏర్పాట్లు ఉండాలన్నారు. ఈనెల చివరి నాటికి ప్రభుత్వ ఉత్తర్వు 58కి సంబంధించి అర్హులందరికీ పట్టాల పంపిణీ పూర్తి చేయాలన్నారు. గృహలక్ష్మి పథకానికి సంబంధించి జిల్లాకు కేటాయించిన ఇళ్లకు లబ్ధిదారులను స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో త్వరగా ఎంపిక చేసి, రెండు వారాల్లో ఇళ్ల మంజూరుపత్రాల పంపిణీ పూర్తిచేయాలన్నారు. సమావేశంలో ఆర్డీవోలు మధుమోహన్, హనుమానాయక్, కలెక్టరెట్ పరిపాలన అధికారి శ్రీనివాస్, కలెక్టరేట్ ఈ విభాగం సూపరిండెంట్ పుష్పలత పాల్గొన్నారు.