మా సమస్యలు పరిష్కరించినోళ్లకే మా మద్దతు
ABN , First Publish Date - 2023-11-21T23:59:32+05:30 IST
తాత్కాలిక హామీలు ఇచ్చే నాయకుల వైపు మొగ్గు చూపకుండా తమ జీవితాల్లో మార్పు తీసుకొచ్చే వారికే మద్దతు పలుకుతామని బీడీ కార్మికుల మూకుమ్మడిగా చెబుతున్నారు.

అర్హులందరికీపెన్షన్లు, పీఎఫ్‌ను అందించాలని డిమాండ్...
వేతనాల పెంపు... కార్మికులకు చేతి నిండా పని కల్పించాలి...
కోరుట్ల బీడీ కార్మికుల మనోగతం
‘‘ఎన్నికలు వస్తున్నాయి.. పోతున్నాయి. కానీ మా సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. ఊకదంపుడు ఉపన్యాసాలు విచ్చలవిడి హామీలు తప్ప మా గోస మాత్రం ఎవరికీ పట్టడం లేదు. నెలలో దొరికే కొద్ది రోజుల పని వల్ల సరైన వేతనాలు లేక ఆర్థికంగా ఇక్కట్లు ఎదుర్కొంటున్నాం. అర్హులకు పీఎఫ్ సౌకర్యం లేదు. ఈ సమస్య గురించి చెప్పినా పట్టించుకునే నాథుడే లేడు. అందుకే మా బాధలు పట్టించుకుని సమస్యలు పరిష్కరించినోళ్లకే ఈ ఎన్నికల్లో మా మద్దతు తెలుపుతాం’’ ఇదీ ప్రస్థుతం బీడీ కార్మికుల మనసులోని మాట. తాత్కాలిక హామీలు ఇచ్చే నాయకుల వైపు మొగ్గు చూపకుండా తమ జీవితాల్లో మార్పు తీసుకొచ్చే వారికే మద్దతు పలుకుతామని మూకుమ్మడిగా చెబుతున్నారు.
కోరుట్ల, నవంబరు 21 : బీడీ కార్మికులకు సరైన పని దొరకడం లేదు. నెలలో కేవలం 15 నుంచి 20 రోజులు మాత్రమే పనిదొరకడం వల్ల సరైన వేతనాలు రావడం లేదు. పలు కంపెనీలు బీడీలకు సరిపడే ఆకు సరఫరా చేయడంలేదు. దీంతో బ్లాక్ మార్కెట్‌లో ఆకును కొని ఆర్థికంగా నష్టపోతున్నారు. జగిత్యాల జిల్లాలోని పలు మండలాల్లో పలు కంపెనీల యాజమాన్యాలు వర్ధిబీడీని అధికంగా ప్రోత్సహిస్తున్నాయి. అర్హులైన కార్మికులందరికీ ఫీఎఫ్‌లు సరిగారావడం లేదు. నెల రోజులకు సరిపడే పనిని కల్పించాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బీడీ పరిశ్రమలో సగం రోజులకు మాత్రమే పని దొరకడం వల్ల కార్మికులు అర్ధాకలితో నెట్టుకు రావాల్సిన దుస్థితి నెలకొంటోంది. ఎన్నికల్లో తమ సమస్యల పరిష్కారానికి పాటుపడే నేతలకే కార్మికులు మద్దతు పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీడీ కార్మికులు తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు.
నెలకు సరిపడా పని కల్పించాలి
తోట వర్ధిణి, బీడీ కార్మికురాలు
బీడీ కార్మికులకు యాజమాన్యాలు నెలకు సరిపడే పనిని కల్పించాలి. ప్రస్తుతం నెలలో కేవలం 15 నుంచి 20 రోజులు మాత్రమే పని దొరకడం వలన అర్థకాలితో బతుకులను వెల్లదీయాల్సి వస్తోంది. కార్మికులకు చేతి నిండా పని కల్పించాలి.
అర్హులందరికీ పీఎఫ్ సౌకర్యం కల్పించాలి
దాసరి మాధవి, బీడీ కార్మికురాలు
అర్హులైన బీడీ కార్మికులందరికీ ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించాలి. పీఎఫ్‌లు అందక రిటైర్డ్ కార్మికులు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాజమాన్యాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్నాయి. పీఎఫ్ మంజూరుపై అధికారులు దృష్టి సారించాలి.
వర్థిబీడీని నిషేధించాలి.
బోల్లంపల్లి కళావతి, బీడి కార్మికురాలు
వర్థిబీడీని ప్రభుత్వం నిషేధించాలి. తక్కువ వేతనంతో పలు యాజమాన్యాలు తయారు చేస్తున్న వర్థి బీడీ వ్యవహారాన్ని నిషేధించాల్సిన అవసరముంది. 25 లక్షల లోపు బీడీ తయారీకి ప్రభుత్వం పన్నుల్లో సడలింపులు ఇవ్వడంతో యాజమాన్యాలు వర్ధిబీడీని ప్రోత్సహిస్తున్నాయి.
సరైన వేతనాలు కల్పించాలి
వంగరి నాగమణి, బీడి కార్మికురాలు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం యాజమాన్యాలు కార్మికులకు సరైన వేతనాలను కల్పించాలి. సరైన పనికి సరైన వేతనం అమలు చేయకపోవడం వల్ల కార్మికులు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. ప్రభుత్వం స్పందించాల్సిన అవసరముంది.
బీడీ కార్మికులందరికీ పెన్షన్ ఇవ్వాలి
గుడ్ల లయ, బీడి కార్మికురాలు
బీడీ కార్మికులందరికీ నెలకు పెన్షన్ అమలుకావడం లేదు. దీన్ని వెంటనే అమలు చేయాల్సిన అవసరముంది. పెరిగిన పెన్షన్ అమలుపై కార్మికులు ఎదురుచూపులతో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలి. ప్రధాన రాజకీయ పక్షాల నాయకులు కార్మికుల సంక్షేమానికి పాటుపడాలి.
కార్మికులకు నివాస స్థలాలను కేటాయించాలి
చలిగంటి పావనీ, బీడి కార్మికురాలు
బీడీ కార్మికులకు ప్రతీ ఒక్కరికి ప్రభుత్వం నివాస స్థలాలను కేటాయించాలి. కార్మికులందరికీ మూడు గుంట స్థలాన్ని కేటాయించాల్సిన అవసరముంది. గృహాలను నిర్మించుకునేందుకు కావాల్సిన రుణాలను సైతం ప్రభుత్వమే అందించాలి. ప్రభుత్వం బీడీ కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలి.
బీడీ ఆకును ఉచితంగా అందించాలి
అంకం కళ్యాణీ, బీడి కార్మికురాలు
బీడీలు తయారు చేయడానికి అవసరమయ్యే సరిపడ ఆకును యాజమాన్యాలు ఉచితంగా అందించాలి. అదే విధంగా 1000 బీడీలకు అందిస్తున్న వేతనాన్ని పెంచాలి. కార్మికులకు అవసరమయ్యే వసతులను యాజమాన్యాలను అందించాల్సిన అవసరముంది. ఇందుకు యాజమాన్యాలు ముందుకు రావాలి.
సమస్యలను పరిష్కరించే వారికే మా ఓటు
గుర్రాల మమత, బీడి కార్మికురాలు
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించే నాయకులకే మద్దతిస్తాం. ఎన్నికలకు ముందు హామీలను ఇవ్వడం ఆ తరువాత మర్చిపోవడం నేతలకు అలవాటైపోయింది. బీడీ కార్మికుల సంక్షేమానికి కృషి చేసే నేతలకే మా సంపూర్ణ మద్దతు.
పట్టించుకోకుంటే నేతల తలరాతలు మారుస్తాం
కొంక శాంత
కార్మికుల సమస్యలను పట్టించుకోకుంటే నేతల తలరాలను మార్చే శక్తి కార్మికులకు ఉంది. కార్మికుల సమస్యలను ప్రధాన రాజకీయ పక్షాల నాయకులు పరిష్కరించడానికి ముందుకు రావాలి. అందుకు అనుగుణంగా మెనిఫెస్టోలను రూపొందించి హామీలను ఇస్తేనే మద్దతు పలుకుతాం. ఇందుకు రాజకీయ నాయకులు ముందుకు రావాల్సిన అవసరముంది.