సాగుకు 12గంటలే!
ABN , First Publish Date - 2023-01-29T01:03:18+05:30 IST
ప్రభుత్వం వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని చెబుతున్నా అచరణలో మాత్రం 12 గంటలకు మించి త్రీఫేజ్ కరెంట్ సరఫరా కావడం లేదు. రాత్రి వేళల్లో కరెంట్ ఇవ్వడంతో రైతులు మళ్లీ బోరు బావుల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
- రాత్రి వేళల్లో బావుల వద్ద పడిగాపులు
- జిల్లాలో యాసంగి సాగు 1.73 లక్షల ఎకరాలు
- అత్యధికంగా వరి 1.66 లక్షల ఎకరాలు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
ప్రభుత్వం వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని చెబుతున్నా అచరణలో మాత్రం 12 గంటలకు మించి త్రీఫేజ్ కరెంట్ సరఫరా కావడం లేదు. రాత్రి వేళల్లో కరెంట్ ఇవ్వడంతో రైతులు మళ్లీ బోరు బావుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగి వరి నాట్లు పూర్తయ్యాయి. సిరిసిల్ల సహకార విద్యుత్ సంఘం పరిధిలో ప్రతిరోజు ఉదయం 9.10 నుంచి సాయంత్రం 5.25 నిముషాల వరకు, రాత్రి వేళల్లో 10.40 నుంచి తెల్లవారుజామున 5.40 వరకు విద్యుత్ సరఫరా జరుగుతుందని ప్రకటించారు. వాస్తవానికి 12 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతుండడంతో పొలాలకు చివరి మడి తడిసే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో భూగర్భ జలాలు పెరిగి బోరు బావుల్లో అశించినంత మేరకు సాగునీరు అందుబాటులో ఉన్నా కరెంట్ సరఫరా అంతరాయంతో రైతు లు అందోళన చెందుతున్నారు. చలికాలంలోనే ఈ పరిస్థితి ఉంటే ఎండలు ముదిరితే పరిస్థితి ఎలా ఉంటుందనే భయం రైతులను వెంటాడుతోంది.
బోరుబావులే దిక్కు
జిల్లాలో యాసంగి వరిసాగు బోరుబావుల అధారంగానే సాగుతుంది. రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో బోరుబావుల కనెక్షన్లు ఉన్నాయి. సిరిసిల్ల సెస్ పరిధిలో 73,735 కనెక్షన్లు ఉన్నాయి. వ్యవసాయానికి ప్రభుత్వం 15.15 గంటల పాటు ప్రతిరోజు విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయిం చారు. వాస్తవ పరిస్థితుల్లో విద్యుత్ సరఫరా జరగడం లేదు. ప్రధానంగా రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా ఉండడంతో రైతులు మళ్లీ పొలాల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి వచ్చింది. మళ్లీ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోననే అందోళన చెందుతున్నారు.
వరి వైపే మొగ్గు
యాసంగిలో ప్రధానంగా వరివైపే రైతులు మొగ్గు చూపారు. 24 గంటల విద్యుత్ సరఫరా ఉంటుందనే అశతో సమృద్ధిగా భూగర్భ జలాలు ఉండడంతో యాసంగి సాగుకు ఢోకాలేదని రైతులు భావించారు. జిల్లాలో 1.79 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్ణయించింది. ఇప్పటి వరకు లక్షా 73 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో ప్రధానంగా వరి 1.66 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇప్పటికే నాట్లు పూర్తి కాగా నీటి వినియోగం కూడా పెరిగింది. వేసవిలో కరెంట్ కోత పెరిగితే పంట దిగుబడిపై ప్రభావం చూపుతుందని రైతులు అందోళన చెందుతున్నారు.
జిల్లాలో వ్యవసాయ బోరుబావులు
మండలం బోరుబావులు
సిరిసిల్ల 2243
కోనరావుపేట 7688
తంగళ్లపల్లి 8369
ఇల్లంతకుంట 9255
వేములవాడ 1058
వేములవాడ రూరల్ 5701
బోయినపల్లి 6558
చందుర్తి 7793
ఎల్లారెడ్డిపేట 10854
ముస్తాబాద్ 7766
గంభీరావుపేట 6350
--------------------------------------------
మొత్తం 73735
-------------------------------------------
జిల్లాలో ప్రస్థుతం యాసంగి సాగు వివరాలు
మండలం వరి మొత్తం
గంభీరావుపేట 16630 16632.42
ఇల్లంతకుంట 24550 25235.43
ముస్తాబాద్ 19827 19877.65
సిరిసిల్ల 3681 3709.47
తంగళ్లపల్లి 17990 18038.38
వీర్నపల్లి 5808 5816.58
ఎల్లారెడ్డిపేట 16491 16516.45
బోయినపల్లి 13028 13457.47
చందుర్తి 14132 14156.30
కోనరావుపేట 16790 16854.73
రుద్రంగి 3000 3425.00
వేములవాడ 4700 4773.39
వేములవాడ రూరల్ 10034 10094.40
--------------------------------------------------------------------------------
మొత్తం 166661 168587.67
--------------------------------------------------------------------------------