Share News

ఒక మండలం.. ఇద్దరు ఎమ్మెల్యేలు

ABN , First Publish Date - 2023-11-10T00:10:59+05:30 IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండలం రెండు నియోజక వర్గాల పరిధిలో విస్తరించింది.

ఒక మండలం.. ఇద్దరు ఎమ్మెల్యేలు

రుద్రంగి, నవంబరు 9: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండలం రెండు నియోజక వర్గాల పరిధిలో విస్తరించింది. జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రెండు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉండడం మండలం ప్రత్యేకత. ఓవైపు రుద్రంగి మండల కేంద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలో ఉండగా, ఉమ్మడి మానాల గ్రామంలోని ఎనిమిది తండాల పంచాయతీలు నిజామబాద్‌ జిల్లా బాంల్కొడ అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో ఉన్నాయి. ఒకే మండలంలోని 10 గ్రామపంచాయతీల పరిధిలోని ఓటర్లు రెండు నియోజకవర్గాల మధ్య ఉన్నారు. ఎన్నికల సమయంలో అభ్యర్థులు మండలానికి వచ్చినప్పుడు ఏ నియోజక వర్గం ఓటర్లు ఎవరన్న విషయంపై గందరగోళం ఏర్పడుతుంటుంది. బాల్కొండ, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలు ఈ నెల 30న నిర్వహించనుండడంతో ఇక్కడి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వేములవాడ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ నుంచి చల్మెడ లక్ష్మీనరసింహారావు, కాంగ్రెస్‌ నుంచి ఆది శ్రీనివాస్‌, బీజేపీ నుంచి తుల ఉమ పోటీలో ఉన్నారు. అలాగే బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి ముత్యాల సునీల్‌రెడ్డి, బీజేపీ ఆభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మ బరిలో ఉన్నారు.

మండలంలో జనాభా, ఓటర్లు

రుద్రంగి మండలంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 10,009, మానాలలో 6086 జనాభా ఉంది. ప్రస్తుత అంచనా ప్రకారం రుద్రంగిలో పురుషులు 5322, స్త్రీలు 5580 మంది మొత్తం జనాభా 10,902 ఉన్నారు. మానాలలో పురుషులు 3237, స్ర్తీలు 3392 మంది. మొత్తం జనాభా 6629 ఉన్నారు. ఓటర్ల విషయానికి వచ్చే సరికి రుద్రంగిలో పురుషులు 3797 మంది, స్త్రీలు 4337 మంది, మొత్తం 8134 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే ఉమ్మడి మానాలలో పురుషులు 2174, స్త్రీలు 2379 మంది, మొత్తం 4550 మంది ఓటర్లు ఉన్నారు.

ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే

రుద్రంగి మండలంలో బాల్కొండ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఉమ్మడి మానాల గ్రామంతోపాటు గిరిజన పంచాయతీలు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ఉన్నారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలో ఉన్న రుద్రంగి మండల కేంద్రం వేములవాడ ఎమ్మెల్యేగా చెన్నమనేని రమేష్‌బాబు కొనసాగుతున్నారు.

అభివృద్ధి బాటలో గ్రామాలు

రుద్రంగి మండల కేంద్రంతోపాటు ఉమ్మడి మానాల గ్రామం నక్సలైట్లకు కంచుకోటగా ఉండేది. సరైన రోడ్డు సౌకర్యం లేక మానాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రస్తుతం రెండు గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయి.

మనాలకు సాగునీరు కావాలి

రుద్రంగి మండలం మనాలలోని రైతులు పంటలకు సాగునీరు అందడం లేదని పేర్కొంటున్నారు. ఎత్తిపోతల పథకం కోసం గతంలో సర్వే చేసి వదిలేశారని తెలిపారు. కలికోట సూరమ్మ చెరువు నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో పైపులైన్‌ పనులు నిలిచిపోయాయన్నారు. మానాల చుట్టు పక్కల రెండు చెరువులు, ఎనిమిది కుంటల్లోకి నీరు చేరకపోవడంతో పంటలు సాగు చేయకలేక పోతున్నామని పేర్కొంటున్నారు. సాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

హామీలకే పరిమితమైన 30 పడకల ఆస్పత్రి

ఎన్నికల సమయంలో మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపడతామని హామీలు ఇస్తున్నారే తప్ప ఆచరణలో సాధ్యం కావడం లేదని మండల కేంద్ర వాసులు వాపోతున్నారు. నిధులు మంజూరయ్యాని గతంలో పాలకుల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కానీ పనుల ప్రారంభానికి మోక్షం లభించడం లేదు.

Updated Date - 2023-11-10T00:11:05+05:30 IST