మెనూ ప్రకారం భోజనం అందించాలి
ABN , First Publish Date - 2023-07-21T00:36:33+05:30 IST
రెసిడెన్షియల్ పాఠశాలలోని విద్యార్థినులకు క్రమం తప్పకుండా మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. గంభీరావుపేట మండలం నర్మాల సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
- కలెక్టర్ అనురాగ్ జయంతి
గంభీరావుపేట, జులై 20: రెసిడెన్షియల్ పాఠశాలలోని విద్యార్థినులకు క్రమం తప్పకుండా మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. గంభీరావుపేట మండలం నర్మాల సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థినుల ఎన్‌రోల్ మెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. వారికి అందిస్తున్న సౌకర్యాలు, వసతుల తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ టాయిలెట్లు, ఇతర పునరుద్ధరణ పనుల కోసం తొమ్మిది లక్షల 70 వేల రూపాయల మంజూరు అయ్యాయన్నారు. పనులను ఇంకా ఎందుకు ప్రారంభించలేదని సంబంధిత ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించారు. ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకుని పనులను శుక్రవారం ప్రారంభించాలని ఆదేశించారు. కిచెన్, డైనింగ్ హాల్, డార్మెట్రీలను కలెక్టర్ పరిశీలించారు. సోలార్ వాటర్ హీటర్‌లను మంజూరు చేస్తామని, నీటి సరపరా కోసం ఏమైన ఇబ్బందులు ఉన్నా యా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, అదనపు డీఆర్‌డీవో మధన్‌మోహన్, ఎంపీడీవో శ్రీనివాస్, ఈవోపీఆర్‌డీ రాజశేఖర్, సర్పంచ్ రాజు తదితరులు ఉన్నారు.
ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలను పెంచాలి
గంభీరావుపేట: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచే విధంగా ఏఎన్‌ఎంలు కృషి చేయాలని, ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న అత్యాధునిక సేవలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. మండలంలోని లింగన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్‌ఎంలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రసవాల సంఖ్య 71 శాతం ఉందని, మిషన్ 80లో భాగంగా లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. సాధారణ ప్రసవాలతో కలిగే దీర్ఘకాలిక లాభాలపై అవగాహన కల్పిస్తూ సీజేరియన్‌లను కట్టడి చేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వ్యాపించకుండా ప్రతీ మంగళవారం, శుక్రవారం డ్రై డేలో కార్యక్రమం క్షేత్రస్థాయిలో క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు ఈ కార్యక్రౄమంలో బాగస్వామ్యం చేయాలన్నారు. ప్రాథమిక కేంద్రం ఎన్క్వాస్ గుర్తింపు పొందటానికి అవసరమైన మరమ్మతులను చేపట్టాలని పంచాయితీరాజ్, ఏఈకి సూచించారు. ఆగస్టు 15 లోగా పనులన్నీ పూర్తి చేయాలన్నారు. లింగన్నపేట, ముస్తాఫనగర్ గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు మంజూరు అయ్యాయని, ఒక్కో ఆరోగ్య ఉప కేంద్రాలను 20 లక్షల రూపాయలతో నిర్మిస్తామని తెలిపారు. వెంటనే పనులను ప్రారంభించటానికి టెండర్లు పిలవాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులకు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా వైధ్యాధికారి సుమన్ మోహన్‌రావు, ఉప వైద్యాధికారి రాములు, మెడికల్ ఆపీసర్, వేణుగోపాల్, పంచాయితీరాజ్ ఏఈ సాయికుమార్ తదితరులు ఉన్నారు.