Share News

ఆర్థిక మద్దతు పథకాలకు రుణాలు అందించాలి

ABN , Publish Date - Dec 14 , 2023 | 12:23 AM

జిల్లాలో వివిధ ఆర్థిక మద్దతు పథకాలకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి బ్యాంకర్లను కోరారు.

ఆర్థిక మద్దతు పథకాలకు రుణాలు అందించాలి
నాబార్డు 2024-25 జిల్లా ప్రొటెన్షియల్‌ లింక్డ్‌ ప్లాన్‌ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న జిల్లా కలెక్టర్‌

- కలెక్టర్‌ పమేలా సత్పతి

కరీంనగర్‌, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో వివిధ ఆర్థిక మద్దతు పథకాలకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి బ్యాంకర్లను కోరారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, జిల్లా అధికారులతో పలు అంశాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బ్యాంకర్లు, ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. రైతులకు రుణాల రెన్యూవల్‌పై అవగాహన కల్పించాలని, జిల్లాలో వ్యవసాయశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ బ్యాంకర్లు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని తెలిపారు. రైతుబంధు, రైతు బీమా, ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధులను పంట రుణాలకు జమ చేసుకోవడానికి వీలు లేదని, సదరు నియమాలను బ్యాంకర్లు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు 5,648.12 కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకుగాను 2,233.69 కోట్లు, ఎంఎస్‌ఎంఈ రంగంలో 1,212.49 కోట్లు, విద్యా రుణాలకు 8.78 కోట్లు, హౌసింగ్‌ లోన్స్‌ 145.96 కోట్లు, స్వయం సహాయ సంఘాలకు 386.69 కోట్లు, ఇతర రంగాలకు సంబంధించి 1,660.51 కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లక్ష్యంలో 75.49 శాతం పూర్తయిందని, పెండింగ్‌లో ఉన్న రుణాల ప్రతిపాదనలు బ్యాంకర్లకు అందించి త్వరగా మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు రుణాల రికవరీపై శ్రద్ధ వహించాలన్నారు. యువతకు ఉపాధి అందించే విషయంలో అధికారులు చొరవ చూపాలని, జిల్లాలో ప్రధానమంత్రి స్వానిధి పెండింగ్‌ దరఖాస్తులను పరిష్కరించాలని సూచించారు. విశ్వభారత్‌ సంకల్ప యాత్ర (వీబీఎస్‌వై)లో భాగంగా జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో అన్ని బ్యాంకు శాఖలు ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రామ్‌ (పీఎంఈజీపీ), ప్రధానమంత్రి జీవన జ్యోతి (పీఎంజీజీబీవై), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై), అటల్‌ పెన్షన్‌ యోజన(ఏపీవై), పీఎం స్వానిధి, ప్రధానమంత్రి మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ స్కీం (పీఎంఎఫ్‌ఎంఈ), విశ్వకర్మ యోజనపై అవగాహన సమావేశాలను నిర్వహించాలన్నారు. అనంతరం నాబార్డుకు సంబంధించిన 2024-25 జిల్లా ప్రొటెన్షియల్‌ లింక్డ్‌ ప్లాన్‌ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీధర్‌, జీఎం ఇండస్ర్టీ నవీన్‌, డీఆర్డీవో శ్రీలత, ఎల్‌డీఎం ఆంజనేయులు, ఆర్‌బీఐ అధికారి సాయితేజ, ఏజీఎం నాబార్డు ప్రకాశ్‌, ఎస్‌బీఐ ఏజీఎం రవిశంకర్‌, యూబీవో సీఎం కలీం, టీజీబీ ఏజీఎం ప్రభుదాస్‌, కేడీసీసీ సీఈవో సత్యనారాయణ పాల్గొన్నారు.

ఫ దివ్యాంగులు స్ఫూర్తి ప్రదాతలు

కరీంనగర్‌ స్పోర్ట్స్‌: సమాజంలో దివ్యాంగులు సాధారణ పౌరులతో సమానంగా అన్ని రంగాల్లో బాగా రాణిస్తూ స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తున్నారని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. నగరంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన జిల్లాస్థాయి దివ్యాంగుల ఆటల పోటీలను ఆమె బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దివ్యాంగులకు తోడుగా నిలిచి, ప్రోత్సాహాన్ని అందిస్తున్న ఉపాధ్యాయులు, గార్డియన్ల సేవలు అభినందనీయమన్నారు. అనంతరం అంధులు ఆడే చెస్‌ పోటీలను పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, జిల్లా సంక్షేమాధికారి ఎం సరస్వతి, క్రీడా అభివృద్ధి అధికారి రాజవీర్‌, డీఆర్డీవో శ్రీలత, దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపాల్‌ నర్మద, కమల, ఏసీడీపీవోలు సౌందర్య, అరవింద, దివ్యాంగుల సంఘాల బాధ్యులు జక్కం సంపత్‌, వెన్నం శ్రీనివాస్‌, కొత్తూరు స్వామి, ఐలి లింగమూర్తి, శ్రీవాణి, మంచాల రాజేందర్‌, కైరి అంజయ్యగౌడ్‌, జాపాల భిక్షపతి పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2023 | 12:23 AM