జాతి సమగ్రతను కాపాడుకుందాం

ABN , First Publish Date - 2023-09-18T01:21:25+05:30 IST

జాతీయ సమైక్యత దినోత్సవ స్ఫూర్తితో జాతి సమగ్రతను నిలబెట్టుకుంటూ ప్రజల మధ్య ఐక్యతను చెదరనివ్వకుండా కాపాడుకుందామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరలాశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పిలుపునిచ్చారు.

జాతి సమగ్రతను కాపాడుకుందాం
పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌. . ఇన్‌సెట్లో మాట్లాడుతున్న మంత్రి

- అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దేశానికే ఆదర్శం

- జాతీయ సమైక్యతత దినోత్సవంలో మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 17 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): జాతీయ సమైక్యత దినోత్సవ స్ఫూర్తితో జాతి సమగ్రతను నిలబెట్టుకుంటూ ప్రజల మధ్య ఐక్యతను చెదరనివ్వకుండా కాపాడుకుందామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరలాశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్‌ పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన జాతీయ సమైక్యత దినోత్సవానికి మంత్రి గంగుల కమలాకర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసులచే గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్చను పొందేందుకు ఆనాటి యావత్‌ సమాజం ఉద్యమించిందన్నారు. తెలంగాణ అమరుల ఆశయసాధనయే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలుపుతోందని చెప్పారు. బీసీ చేయూత పథకం ద్వారా ఇప్పటి వరకు 1,700 మంది లబ్దిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించామన్నారు. మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా 174 మంది లబ్ధిదారులకు లక్ష రూపాయల చొప్పున కోటి 74 లక్షల విలువగల చెక్కులను అందించామన్నారు. వికలాంగులకు 4016 రూపాయలు, బీడీ టేకేదారులకు 2016 రూపాయల పింఛన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం యావత్‌ దేశంలోనే తెలంగాణ మాత్రమేనని అన్నారు.

జిల్లాకు పలు అవార్డులు

జిల్లాలోని 9 మండలాల్లోని 15 గ్రామాలకు స్వచ్ఛ సర్వేణ్‌ గ్రామీణ-2023 అవార్డులు, గన్నేరువరం మండలం ఖాసింపేట, రామడుగు మండలం వెలిచాల గ్రామానికి స్వచ్ఛ గ్రామీణ రాష్ట్రస్థాయి అవార్డులు వచ్చాయన్నారు. గృహలక్ష్మి పథకం ద్వారా పేదవారికి ఇంటి నిర్మాణానికి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల మంది చొప్పున మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. దళితబంధు పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించిన హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 18,021 కుటుంబాలకు 10 లక్షల చొప్పున 1784.79 కోట్లు వారి ఖాతాల్లో డబ్బు జమ చేశామన్నారు. పంట రుణాలను రుణమాఫీ పథకం ద్వారా జిల్లాలో 49544 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 261.19 కోట్లను జమ చేశామన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ప్రతి జిల్లాకు ఓ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏర్పాటు చేశారని అన్నారు. ఈ నెల 15న రాష్ట్ర ముఖ్యమంత్రిచే వర్చువల్‌గా వైద్య తరగతులను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మించిన 150 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో 24 గంటల వైద్య సేవలతోపాటు నెలకు 800 నుంచి 900 వరకు ప్రసవాలు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో 2023-24 సంవత్సరంలో 2 కోట్ల 55 లక్షల విలువగల చేపలను, 34 లక్షల రొయ్య పిల్లలను విడుదల చేశామన్నారు.

అధ్బుత నగరంగా కరీంనగర్‌

నగరంలో ఏ మూల చూసిన అద్భుతమైన రోడ్లు, రాత్రిపేట జిగేల్‌ మనే విద్యుత్‌ లైట్లు అద్భుత నగరంగా కరీంనగర్‌ విరాజిల్లుతోందన్నారు. ప్రపంచస్థాయి పర్యాటకులను ఆకట్టుకునేలా చేపడుతున్న మానేరు రివర్‌ఫ్రంట్‌లో చేపడుతున్న అతిపెద్ద వాటర్‌ ఫౌంటెన్‌ పనులను ఏడాదిలో పూర్తి చేసి బోటింగ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. కల్లోలిత జిల్లాగా పేరొందిన కరీంనగర్‌ ఇప్పుడు పూర్తిగా రూపురేఖలు మారిపోయి రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన నగరంగా మారిందన్నారు. ఈ సందర్భంగా పలువురు స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, కలెక్టర్‌ డాక్టర్‌ గోపి, పోలీసు కమిషనర్‌ సుబ్బరాయుడు, జిల్లా అదనపు కలెక్టర్లు ప్రఫుల్‌ దేశాయ్‌, లక్ష్మికిరణ్‌ పాల్గొన్నారు

Updated Date - 2023-09-18T01:21:25+05:30 IST