నులిమేద్దాం
ABN , First Publish Date - 2023-07-20T00:51:18+05:30 IST
అపరిశుభ్రతే అన్నింటికీ కారణం. అపరిశుభ్రతతో ప్రధానంగా పిల్లల కడుపులో నులిపురుగులు పెరుగుతాయి. వ్యక్తిగత పరిశుభ్రత లేకపోతే నులిపురుగులు వృద్ధి చెంది హాని కలిగిస్తాయి.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
అపరిశుభ్రతే అన్నింటికీ కారణం. అపరిశుభ్రతతో ప్రధానంగా పిల్లల కడుపులో నులిపురుగులు పెరుగుతాయి. వ్యక్తిగత పరిశుభ్రత లేకపోతే నులిపురుగులు వృద్ధి చెంది హాని కలిగిస్తాయి. పరిశుభ్రత, అవగాహనతో నులిపురుగులను నివారించవచ్చు. వాటి నివారణ కోసం గురువారం జిల్లా వ్యాప్తంగా నేషనల్ డీ వార్మింగ్ డే(జాతీయ నులిపురుగుల నివారణ దినం) నిర్వహణకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 20న మాత్రలు వేసుకోని వారికి 27న మాత్రలు వేస్తారు. మాత్రల పంపిణీకి ఏఎన్‌ఎంలు, ఆశాలు, అంగన్‌వాడీ టీచర్లతోపాటు జిల్లా అధికారులు 1276 మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు.
నులి పురుగులతో పిల్లల్లో రక్త హీనత
పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే తల్లిదండ్రులకు సంతోషం. వారి ఆరోగ్యంపై నిరంతరం అప్రమత్తతతో ఉండాలి. పిల్లల్లో పోషకాహార లోపం రక్త హీనత, శారీరక మానసిక అభివృద్ధి వంటి వాటిపై ప్రభుత్వం కూడా దృష్టిసారిస్తోంది. ఆరోగ్య సమాజం కోసం ఎన్ని చర్యలు చేపడుతున్నా ఇంకా ఆనారోగ్య సమస్యలతో సతమతమవుతూనే ఉన్నారు. ముఖ్యంగా సంవత్సరం పిల్లవాడి నుంచి 19 సంవత్సరాల యువకుడి వరకు పొట్టలో పెరిగే పురుగులతో బాధపడుతూ ఉంటారు. నులి పురుగులు, కొంకి పురుగులు, కొరడా పురుగులు, బద్దె పరుగులు, ఏలిక పాములు, దారపు పురుగులు వంటివి పొట్టలో చేరి అనేక రోగాలకు కారణమవుతుంటాయి. వాటి నివారణ కోసం వైద్య ఆరోగ్య శాఖ ఏటా జాతీయ నులిపురుగుల నివారణ దినాన్ని నిర్వహిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 19 సంవత్సరాలలోపు వారు లక్షా 43 వేల 132 మంది ఉన్నారు. జిల్లాలో 1 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లల్లో 24,740 మంది ఉండగా బాలురు 12,846 మంది, బాలికలు 11,894 మంది, 6 నుంచి 10 సంవత్సరాల వయస్సు వారు 44,463 మంది ఉండగా బాలురు 21,622, బాలికలు 22,841 మంది, 11 నుంచి 19 వయస్సు గల వారు 73,929 మంది ఉండగా బాలురు 37,536 మంది బాలికలు 36,393 మంది ఉన్నారు.
వయస్సును బట్టి మాత్రలు
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పంపిణీ చేసే అల్‌బెండాజోల్ మాత్రలను వయస్సును బట్టి వేసుకోవాలి. ఒకటి - రెండు సంవత్సరాల పిల్లలకు సగం మాత్రను, 2-3 సంవత్సరాల లోపు పిల్లలకు ఒక మాత్రను పొడిచేసి నీళ్లలో కలిపి మింగించాలి. ఆపైబడిన వారితో 400 ఎంజీ అల్‌బెండాజోల్ మాత్రను చప్పరించి లేదా నమిలి మింగించాలి.
అపరిశుభ్రతతో శరీరంలోకి
అపరిశభ్రతతో అనేక పురుగులు పిల్లల పొట్టలోకి చేరిపోతాయి. పిల్లలు తినే ఆహారాన్ని లోపల దర్జాగా తింటూ ఉంటాయి. అపరిశుభ్రతతో ఈ పురుగులు పొట్టలోకి చేరుతాయి. నులిపరుగులు, ఇతర పురుగులు మన పొట్టల్లో వృద్ధి చెందుతాయి. పిల్లలు మట్టిలో ఆడుకొనివచ్చి ఆదే చేతితో తినుబంఢారాలు తింటారు. పిల్లలే కాదు పెద్దవాళ్లు కూడా అదే పని చేస్తారు. కొందరు మహిళలకు బియ్యం ఏరుతూ మట్టిగడ్డలు తినే అలవాటు ఉంటుంది. చేలల్లో గరకలు, మట్టిని కూడా చప్పరిస్తుంటారు. దీంతో మట్టిలోని పురుగుల గుడ్లు మన పొట్టలోకి వెళ్లిపోతుంటాయి. అంతేకాకుండా మలం మీద వాలిన ఈగలు తిరిగి మనం తినే ఆహారపదార్థాల మీద వాలడంతో పురుగుల గుడ్లు ఆహారం మీద ఉండిపోతాయి. మంచినీటి పైపులైన్లలో డ్రైనేజీ నీళ్లు కలవడంతో తాగునీరు కలుషితమై శరీరంలోకి చేరుతాయి. పెరిగిన గోళ్లు వాటిలో ఇరుక్కుపోయిన మట్టి వళ్ల కూడా పురుగుల గుడ్లు మన పొట్టలోని వెళ్లి నులిపురుగులు, కొంకి పురుగులు, కొరడా పాములు, బద్దె పురుగులు, ఏలిక పాములు, దారపు పురుగులు తయారవుతాయి.
వివిధ పురుగుల లక్షణాలు.. నివారణ
నులి పురుగులను ‘ఎంటరోబియాసిస్’ అంటారు. ఈ పురుగులు సన్నగా తెల్లగా దారంపోగుల్లా ఉండి మనిషి శరీరంలో ఆరు రోజుల పాటు బతుకుతాయి. ఈ పురుగుల లక్షణాలు చూస్తే పురుగులు మల ద్వారం చివరలోకి వచ్చి అక్కడ గుడ్లు పెడతాయి. అక్కడ దురదను కలిగిస్తాయి. మహిళలల్లో యోని మార్గం వద్ద ప్రవేశించి తెల్లబట్టను దురదను కలిగిస్తాయి. మూత్ర నాళం వద్ద మంట వస్తుంది. మలంలో చూసినా నులిపురుగులు కనిపిస్తాయి. నులిపురుగులు ఉన్న పిల్లలకు డ్రాయర్లు తప్పనిసరిగా వేయాలి. ఇతరులకు అంటించే అవకాశం తగ్గుతుంది. మల విసర్జన తర్వాతా చేతులను శుభ్రంగా కడగాలి. గోళ్లను పొట్టిగా కత్తిరించుకోవాలి.
ఫ కొంకి పురుగులు : ఇవి ఒక సెంటీమీటరు పొడవు ఉండి ఎర్రగా ఉంటాయి. మాములుగా విరేచనాల్లో ఇవి బయటికి కనబడవు. పరీక్ష ద్వారానే నిర్ధారించుకోవాలి. మల విసర్జన ద్వారా బయటకు వచ్చిన కొంకి పురుగుల లార్వాలు దుమ్ములో అభివృద్ధి చెందుతాయి. పాదాల దగ్గర చర్మంలోకి ప్రవేశించి రక్తంలో కలిసి పేగుల్లోకి చేరుతాయి. దీంతో శరీరంలో దురద వస్తుంది. అవి రక్తం ద్వారా ఊపిరితిత్తుల్లోని శ్వాస నాళాలకు చేరుతాయి. దీంతో పొడి దగ్గు వస్తుంది. దగ్గు ద్వారా గొంతులోకి వచ్చిన పురుగులు, ఉమ్మిని మింగడంతో కడుపులోకి చేరి నొప్పి విరేచనాలు వస్తాయి. కొంకి పురుగులు రక్తం తాగి బతుకుతాయి. మనిషికి నీరసాన్ని రక్తహీనతను కలిగిస్తాయి. గుండె దడ ఆయాసం నరాల బలహీనత వస్తుంది.
ఫ కొరడా పాములు : ఇవి కొరడా ఆకారంలో మూడు నుంచి 5 సెంటీమీటర్లు ఉండి ఎర్రగా లేదా బూడిద రంగులో ఉంటాయి. సామాన్యంగా ఈ పాములు హానిని కలిగించవు. ఒక్కోసారి విరేచనాలు, కడుపులో నొప్పి, వికారం రక్తహీనత వంటి లక్షణాలు ఉంటాయి.
ఫ బద్దెపురుగులు : వీటినే నట్టలు అంటారు. సరిగ్గా ఉడికి ఉడకని ఎద్దు, ఆవు, పంది, మాంసం తింటే బద్దెపురుగుల లార్వాలు ఆ మాంసంతోపాటు పొట్టలోకి చేరి బద్దెపురుగులుగా మారుతాయి. ఒక్కో పురుగు కొన్ని మీటర్ల పొడవు పెరుగుతుంది. సెంటీమీటరు వరకు దోస గింజల్లా మలం నుంచి బయటకు వస్తుంది. ఈ బద్దె పురుగులతో తల పోటు, ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కడుపునొప్పి, ఆకలి లేకపోవడం. బరువు కోల్పోవడం, దురదలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పేగులకు రంద్రాలు పడడం, కుళ్లిపోవడం వంటివి చోటు చేసుకుంటాయి. కుళ్లిన పేగులను ఆపరేషన్ ద్వారా తొలగించాల్సి ఉంటుంది. ఉడకని మాంసం తినవద్దు.
ఫ ఏలిక పాములు : ఇవి 20 నుంచి 30 సెంటీమీటర్ల పొడవు ఉండి గులాబీ రంగులో లేదా తెల్లగా ఉంటుంది. మిగతా పురుగులు లాగానే పొట్టలోకి చేరుతుంది. ఒక ఏలిక పాము రెండు లక్షల గుడ్డు పెడుతుంది. అవి చిన్న పాములుగా బయటకు వచ్చి రక్తంలో చేరుతాయి. దీంతో శరీరం అంతా దురద వస్తుంది. ఊపిరితిత్తులో చేరడంతో దగ్గు, ఒక్కోసారి జ్వరం తెమడ వస్తాయి. అజీర్ణం, నీరసం, వికారం వాంతులు వస్తాయి. పిల్లలకు పెద్ద బానా పొట్ట కనిపిస్తుంది.
ఫ దారపు పురుగులు : ఇవి రెండు మిల్లీ మీటర్ల పొడవు ఉంటుంది. చిన్న పేగుల్లో ఉండడంతో ఆహార లోపాలు కనిపిస్తాయి. ఒళ్లంతా దురద, పొట్టలో నొప్పి గొంతులో శబ్దాలు వస్తాయి. వీటి నివారణకు ఒకే వైద్యం అల్బెండాజోల్ మాత్రాలు వాడితే సరిపోతుంది. ఇతర వ్యాధులకు మందులు వాడతున్నవారు అల్బెండా జోల్ మాత్రలు వేసుకోకూడదు.
మాత్రల పంపిణీకి ఏర్పాట్లు
- డాక్టర్ సుమన్‌మోహన్‌రావు, డీఎంఅండ్‌హెచ్‌వో
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అల్బెండాజోల్ మాత్రల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశారు. ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. వైద్య సిబ్బంది. అంగన్‌వాడీ కార్యకర్తలు వారికి కేటాయించిన ప్రాంతాల్లో జూలై 20న ఏడాది నిండిన పిల్లల నుంచి 19 ఏళ్ల వయస్సు వారికి మాత్రలు అందిస్తారు. ఎవరైనా వేసుకోని వారు ఉంటే వారికి ఈ నె 27వ తేదీన మాత్రలు వేస్తాం.