ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌లో చేరిన ‘కటకం’

ABN , First Publish Date - 2023-09-11T00:23:01+05:30 IST

మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీలో చేరారు. రెండు రోజుల క్రితం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రాజీనామా చేసిన మృత్యుంజయం ఆదివారం ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ రాష్ట్ర కార్యదర్శి బండ సురేందర్‌రెడ్డితో కలిసి కోల్‌కతాకు వెళ్లారు.

ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌లో చేరిన ‘కటకం’

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 10 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీలో చేరారు. రెండు రోజుల క్రితం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రాజీనామా చేసిన మృత్యుంజయం ఆదివారం ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ రాష్ట్ర కార్యదర్శి బండ సురేందర్‌రెడ్డితో కలిసి కోల్‌కతాకు వెళ్లారు. అక్కడ ఏఐఎఫ్‌బీ జాతీయ కార్యదర్శి దేవరాజ్‌ను కలిసి తాజా రాజకీయాలపై చర్చించి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. దీంతో బండ సురేందర్‌రెడ్డి నేతృత్వంలో జాతీయ కార్యదర్శి దేవ రాజన్‌ కటకం మృత్యుంజయంకు పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దేవరాజన్‌ తెలంగాణ రాష్ట్రంలో ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో సత్తాచాటేందుకు కృషిచేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్‌ కమిటీ చైర్మన్‌ బాధ్యతలను మృత్యుంజయంకు అప్పగించారు. ఎన్టీఆర్‌ హయాంలో టీడీపీ, సంజయ్‌ విచార్‌ మంచ్‌ కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలో సంజయ్‌ విచార్‌ మంచ్‌ అభ్యర్థిగా మృత్యుంజయం కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఆయన ఉమ్మడి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుఇగా, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా సేవలందించారు. కాంగ్రెస్‌ పార్టీలో కొంత మంది నేతలతో ఆయనకు పొసగక రాజీనామా చేశారు. 2019 సంవత్సరంలో బండి సంజయ్‌ ప్రోద్భలంతో బీజేపీలో చేరారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల సంబంధాలను చూసిన తర్వాత బీజేపీలో కొనసాగలేకపోతున్నానని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి రాజీనామా పత్రాన్ని పంపించారు. రెండురోజుల్లో రాజకీయ భవిష్యత్‌ ప్రణాళికను ప్రకటిస్తానని చెప్పిన మృత్యుంజయం ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీలో చేరడమే కాకుండా ఆయనకు కీలకమైన రాష్ట్ర ఎన్నికల చైర్మన్‌ పదవిని అప్పగించడంతో ఎన్నికల్లో క్రియాశీలపాత్రను పోషించే అవకాశం కల్పించారంటూ ఆయన సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తానని ప్రకటించిన మృత్యుంజయం కరీంనగర్‌లో పోటీ చేస్తారా లేక సిరిసిల్ల నుంచి పోటీచేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2023-09-11T00:23:01+05:30 IST