ప్రజాభిప్రాయం లేకుండా పరిశ్రమ నిర్మించడం సరికాదు

ABN , First Publish Date - 2023-05-02T00:39:15+05:30 IST

ప్రజాభిప్రాయం లేకుండా ప్రభుత్వం ఇథనాల్‌ పరిశ్రమ నిర్మించడం సరికాదని తెలంగాణ జనసమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం మండిపడ్డారు.

ప్రజాభిప్రాయం లేకుండా పరిశ్రమ నిర్మించడం సరికాదు
పాషిగామలో మాట్లాడుతున్న ప్రొఫెసర్‌ కోదండరాం

టీజెఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం

వెల్గటూర్‌, మే 1: ప్రజాభిప్రాయం లేకుండా ప్రభుత్వం ఇథనాల్‌ పరిశ్రమ నిర్మించడం సరికాదని తెలంగాణ జనసమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం మండిపడ్డారు. సోమవారం ఇథనాల్‌ పరిశ్రమ బాధిత గ్రామాల ప్రజలకు మద్దతు తెలుపుతూ పరిశ్రమ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇథనాల్‌ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినపుడు కనీసం ప్రజా భిప్రాయ సేకరణ చేయకపోవడం శోచనీయమన్నారు. బలవంతంగా ప్రజలను అణిచివేసి ఇథనాల్‌ పరిశ్రమ నిర్మిస్తారా? అని మండిపడ్డారు. పరిశ్రమ నిర్మాణం వలన జల, వాయు కాలుష్యం ఏర్పడి జీవ మనుగడకు ఇబ్బంది కలుగుతుందన్నారు. సమీపాన శాతవాహనుల తొలి రాజధానిగా ప్రసిద్ధికెక్కిన కోటిలింగాల, బుద్దుడు నడయాడిన ప్రదేశంగా పాషిగామ, చారిత్రక ఆనవాళ్లు కలిగిన ఈ ప్రదేశాన్ని నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటు వలన గోదావరి నీళ్లు కూడా కలుషితం అవుతాయ న్నారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంతం గతంలో కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం వలన బౌద్ద స్థూపాన్ని తొలగించారన్నారు. ప్రసిద్ధి గాంచిన బౌద్ధ క్షేత్రాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇథనాల్‌. ఫ్యాక్టరీ నిర్మాణం పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. బోనాలు తీయడానికి వెళ్తే కూడా అడ్డుకోవడం శోచనీయమన్నారు. ప్రజలను అణిచైనా ప్రభుత్వం ఫ్యాక్టరీ కట్టాలని చూడడాన్ని ఖండించారు. ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరిగే వరకు ప్రజల పక్షాన పోరాడతామన్నారు. చారిత్రక ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అనంతరం కొనుగోలు కేంద్రంలో వర్షానికి తడిచిన ధాన్యాన్ని పరిశీలించారు. తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్‌ జిల్లా అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి, మోహన్‌రెడ్డి, మార్వాడి సుదర్శన్‌, సర్పంచ్‌లు బొప్ప తిరుపతి, మేరుగు మురళి, కొమ్ము రాంబాబు, ఎంపీటీసీ సత్తయ్య, బుచ్చయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-02T00:39:15+05:30 IST