100 కోట్లు ఇవ్వకుండా రాజన్న నిధులే మళ్లిస్తారా?
ABN , First Publish Date - 2023-09-22T00:24:36+05:30 IST
వేములవాడ రాజ రాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి ఏటా 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇస్తామన్న సీఎం కేసీఆర్ ఆ మాట మర్చిపోవడంతోపాటు కొత్తగా రాజన్న ఆలయం నిధుల నుంచి కామారెడ్డి నియోజక వర్గంలో ఆలయాల అభివృద్ధికి ఐదు కోట్ల రూపాయలు కేటాయించాలని ఆదేశించడం దుర్మార్గమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ మండిపడ్డారు.
వేములవాడ, సెప్టెంబరు 21: వేములవాడ రాజ రాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి ఏటా 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇస్తామన్న సీఎం కేసీఆర్ ఆ మాట మర్చిపోవడంతోపాటు కొత్తగా రాజన్న ఆలయం నిధుల నుంచి కామారెడ్డి నియోజక వర్గంలో ఆలయాల అభివృద్ధికి ఐదు కోట్ల రూపాయలు కేటాయించాలని ఆదేశించడం దుర్మార్గమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ మండిపడ్డారు. నిధుల మళ్లింపు అంశంపై గురువారం ప్రతాప రామకృష్ణ విలే కరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండడానికి ముందే దేవాలయాల నిధులను మళ్లించడం ద్వారా ఆలయాలను రాజకీయాల కోసం వాడుకోవడానికి ప్రయత్నించడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని దేవాలయాలకు వేములవాడ రాజన్న ఆలయం నుంచి రూ.5 కోట్లు, యాదాద్రి ఆలయం నుంచి రూ.5 కోట్లు విడుదల చేయాలని సీఎం ఆదేశాల మేరకే ఎండో మెంట్ కమిషనర్ అనిల్ కుమార్ ఆదేశాలు జారీ చేశార న్నారు. ఆలయ అభివృద్ధిని విస్మరించి ఏకంగా రాజన్న ఆలయ నిధులనే కొల్లగొట్టే విధానాన్ని అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. పేదల దేవుడైన రాజరాజేశ్వరస్వామివారి దర్శనం కోసం వేములవాడకు వచ్చే భక్తులు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, 2015లో సీఎం హోదాలో వేములవాడకి వచ్చిన కేసీఆర్ ఆలయ అభివృద్ధికి ఏటా 100 కోట్ల చొప్పున రూ.400 కోట్లు ఇస్తామని మాట తప్పారన్నారు. నిధుల మళ్లింపుకు సంబంధించిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వేములవాడ ఆలయం నుంచి కామారెడ్డి నియోజకవర్గానికి ఐదు కోట్ల రూపాయల నిధులు కేటాయించాలన్న ఉత్తర్వులు నిరసిస్తూ శనివారం వేముల వాడలో బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. స్థానికులు, భక్తులు బంద్‌కు సహకరించి రాజన్న ఆలయాన్ని రాజకీయాల నుండి కాపాడాలని ప్రతాప రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, నాయకులు సంటి మహేష్, అన్నారం శ్రీనివాస్, జక్కుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.