Share News

ప్రభుత్వ ధాన్యంతో అక్రమ దందా

ABN , Publish Date - Dec 22 , 2023 | 12:06 AM

సీఎంఆర్‌ (కస్టమ్స్‌ మిల్లింగ్‌ రైస్‌) అప్పగించడానికి ప్రభుత్వం రైస్‌ మిల్లులకు అందించిన ధాన్యం మాయమవుతోంది.

ప్రభుత్వ ధాన్యంతో అక్రమ దందా

జగిత్యాల, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): సీఎంఆర్‌ (కస్టమ్స్‌ మిల్లింగ్‌ రైస్‌) అప్పగించడానికి ప్రభుత్వం రైస్‌ మిల్లులకు అందించిన ధాన్యం మాయమవుతోంది. జిల్లాలోని పలు రైస్‌ మిల్లుల్లో ధాన్యం మాయమైనట్లు సివిల్‌ సప్లయి అధికారులు నిర్వహించిన సోదాల్లో స్పష్టం అయింది. అయితే ఆ ధాన్యం ఎటుదారి మళ్లించారు అర్థకానీ పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా రైస్‌ మిల్లుల్లో ధాన్యం నిల్వలు అస్తవ్యస్తంగా ఉన్నాయని.. ఎటువంటి గ్యారెంటీలు లేకుండా అప్పనంగా రూ. కోట్ల విలువ చేసే ధాన్యాన్ని ప్రయివేటు మిల్లర్లకు అప్పగించారని, సదరు మిల్లర్లు ఇటు సీఎంఆర్‌ అప్పగించడకుండా.. మిల్లుల్లో ధాన్యం నిల్వలు లేకుండా ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఇటీవల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషాకు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు సివిల్‌ సప్లయి శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌కు బహిరంగ లేఖను పంపారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు రైస్‌ మిల్లుల్లో నాలుగైదు రోజులుగా సివిల్‌ సప్లయి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇందులో ఇప్పటికే 80,335 క్వింటాళ్ల ధాన్యం మిల్లుల్లో తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీని విలువ సుమారు 25 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

వెలుగు చూస్తున్న అక్రమాలు...

సీఎంఆర్‌ కోసం ఇచ్చిన ధాన్యాన్ని పక్కదారి పట్టించిన వ్యవహారంలో విచారణ సాగుతోంది. పెద్ద మొత్తంలో ప్రభుత్వ ధాన్యం మిల్లర్లు బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోందని అధికారులు చెబుతున్నారు. దీని విలువ సుమారు 25 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 30 మిల్లుల్లో ధాన్యం నిల్వలను అధికారులు పరిశీలించారు. ఇందులో అయిదు మిల్లుల్లో ప్రభుత్వం కేటాయించిన దాని కంటే ధాన్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. పొలాసా మిల్లులో 10,375 క్వింటాళ్లు, కల్లెడ మిల్లులో 12,999 క్వింటాళ్లు, కోరుట్ల మిల్లులో 33,397 క్వింటాళ్లు, కథలాపూర్‌ మండలంలోని ఓ మిల్లులో 18,480 క్వింటాళ్లు, ఇదే మండలంలో మరో మిల్లులో 5,184 క్వింటాళ్ల ధాన్యం తక్కువగా ఉన్నట్లు అధికారుల పరిశీనలో వెల్లడైంది. ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లులకు నోటీసులు ఇవ్వడానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు. అయితే పలు మిల్లుల్లో అధికారులు సోదాలు జరపడానికి పలు రాజకీయ కారణాలు సైతం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

జిల్లాలో పూర్తికాని సీఎంఆర్‌...

ప్రభుత్వానికి ఇవ్వాల్సిన కస్టమ్స్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) సకాలంలో ఇవ్వకుండా జిల్లాలోని మిల్లర్లు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. ధాన్యం తీసుకుని బయటి మార్కెట్‌లో అక్రమ వ్యాపారం సాగిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వానికి సీఎంఆర్‌ అప్పగించే విషయంలో జిల్లా ప్రతీ సీజన్‌లో వెనుక బడి ఉంటుందని అధికారులే అంటున్నారు. 2022-23 యాసంగి సీజన్‌కు సంబందించి ఇప్పటి వరకు 70 శాతం బియ్యం మాత్రమే ఇవ్వడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈనెలాఖరు వరకు బియ్యం అప్పగించడానికి గడువు ఉంది. జిల్లాలో 60 పారాబాయిల్డ్‌, 67 రా రైస్‌ మిల్లులకు సీఎంఆర్‌ కోసం ధాన్యం కేటాయించారు. జిల్లాలో 7,810 ఏసీకేల బియ్యం ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా ఈ నెల 12వ తేదీ వరకు 5,072 ఏసీకేల బియ్యం అప్పగించారు. ఇంకా 2,739 ఏసీకేల బియ్యం అప్పగించాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా కేవలం 65 శాతం లక్ష్యం పూర్తయింది. గడిచిన తొమ్మిది రోజుల్లో మరో 5 శాతం పూర్తయినట్లుగా అంచనా ఉంది. దీంతో జిల్లాలో 70 శాతం సీఎంఆర్‌ పూర్తియినట్లుయింది. మిగిలిన ముప్పయి శాతం సీఎంఆర్‌ను ఈ నెలాఖరు వరకు అప్పగించాల్సి ఉంది. జిల్లాలో పలు రైస్‌ మిల్లులు వంద శాతం పూర్తి చేయగా అధిక రైస్‌ మిల్లులు ఒక శాతం నుంచి పది శాతం లోపు ఉండడం విశేషం.

గత సర్కారు హయాంలో...

గత ప్రభుత్వ హయాంలో పలువురు మిల్లర్లు ప్రజాప్రతినిధుల అండతో అధికారులను బెదిరిస్తూ బియ్యం ఇవ్వకుండా కాలం గడుపుతూ వచ్చారు. కొందరు కీలక ప్రజాప్రతినిధులు సైతం బినామీల పేరిట రైస్‌ మిల్లులను నడిపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోపాటు ఇటీవల నిర్వహించిన ఆ శాఖ సమీక్షలో సీఎంఆర్‌ విషయంపై సీరియస్‌గా ముందుకు పోతామని సర్కారు ప్రకటించడంతో అధికారులు సతమతమవుతున్నారు. దీనికి తోడు జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ సీఎంఆర్‌లో చోటుచేసుకుంటున్న అక్రమాలపై ఫిర్యాదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

పైసా పెట్టుబడి లేకుండా రూ. కోట్ల వ్యాపారం...

రైతుల నుంచి ప్రభుత్వం ఐకేపీ, మెప్మా, సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం సీఎంఆర్‌ కోసం మిల్లర్లకు అప్పగించింది. పలు సీజన్‌లో సీఎంఆర్‌ ఇవ్వాల్సిన మిల్లర్లు వాటిని ఇవ్వకుండానే వానాకాలం ధాన్యం తీసుకున్నారు. బియ్యం ఇవ్వనప్పుడు దానికి సంబంధించిన ధాన్యం మిల్లుల వద్ద నిల్వ ఉండాలి. కానీ చాలా మిల్లుల వద్ద ధాన్యం నిల్వ లేవని అధికారులు చేస్తున్న తనిఖీలో వెల్లడవుతోంది. మిల్లర్లు తీసుకున్న ధాన్యం బహిరంగ మార్కెట్‌లో అమ్ముకున్నారని వారు అంటున్నారు. పైసా పెట్టుబడి లేకుండా కోట్ల రూపాయల ప్రభుత్వ ధాన్యం తీసుకొని వ్యాపారం చేసుకుంటున్న మిల్లర్ల జోలికి వెళ్లడానికి గతసర్కారు హయాంలో అధికారులే బయపడిపోయారని ప్రచారం జరుగుతోంది. రాజకీయ నేతల నుంచి జిల్లా స్థాయి అధికారులకు ఫోన్‌లు చేయడంతో కింది స్థాయిలో ఉన్న తాము ఏమి చేయలేని పరిస్థితి నెలకొందని వారు అంటున్నారు. ఇదిలా ఉండగా సీఎంఆర్‌ కోసం ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని అమ్ముకొని పలువురు మిల్లర్లు రియల్‌ ఎస్టేట్‌, షేర్‌ మార్కెట్‌ వంటి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం, ఇతర అవసరాలకు వినియోగించుకోవడం వంటివి చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

మిగిలింది తొమ్మిది రోజులే..

2022-23 యాసంగి సీజన్‌ సీఎంఆర్‌ను పూర్తిస్థాయిలో ఇవ్వని మిల్లర్లు అదే ఏడాది వానాకాలం సీజన్‌ కు సంబంధించిన బియ్యాన్ని కూడా ఇప్పటి వరకు పూర్తిగా ఇవ్వలేదు. ఈ నెల 31 వరకు మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాలి. కానీ దీనిలో 10 శాతం కూడా వారు ఇచ్చే సూచనలు కనిపించడం లేదని అధికారులు అంటున్నారు. అంటే సీఎంఆర్‌ పూర్తిగా ఇచ్చే గడువు తొమ్మిది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ కొద్ది సమయంలోనే మిగిలిన బియ్యం మిల్లర్లు ఎలా ఇస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

కఠిన చర్యలు తప్పవు

- వెంకటేశ్వర్‌ రావు, సివిల్‌ సప్లయి జిల్లా అధికారి

మిల్లర్ల నుంచి ప్రతి గింజ బియ్యాన్ని వెనక్కి తీసుకుంటాం. అన్ని రైస్‌ మిల్లుల నుంచి సమాచారం తీసుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకొని సీఎంఆర్‌ ఇవ్వని మిల్లులపై కఠిన చర్యలు తప్పవు.

Updated Date - Dec 22 , 2023 | 12:06 AM