Share News

బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే ధాన్యంలో కోతలే..

ABN , First Publish Date - 2023-10-20T00:08:28+05:30 IST

బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే రైతులు పండించిన వరి ధాన్యానికి కోతలు తప్పవని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి అన్నారు.

బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే ధాన్యంలో కోతలే..

కాల్వశ్రీరాంపూర్‌, అక్టోబరు 19: బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే రైతులు పండించిన వరి ధాన్యానికి కోతలు తప్పవని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తలతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతుల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తుందని, రైతులు పండించిన వరి ధాన్యానికి కేంద్రమే మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందన్నారు. ఈ రాష్ట్రంలో ఆరుగాలం శ్రమించి రైతులు వరి పండిస్తే క్వింటాల్‌కు 10కిలోల ధాన్యం కోతలు విధిస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వరి ధాన్యానికి మద్దతు ధర పెంచిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 23పంటలకు మద్దతు ధర ఇస్తుందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే కుటుంబ పరిపాలన పోయి ప్రజల పరిపాలన వస్తుందన్నారు. తెలంగాణ అభివృద్ధి కావాలంటే ప్రజలంతా బీజేపీకే ఓటు వేయాలన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ వచ్చాక గ్రామ గ్రామాల బెల్టు షాపులు ఏర్పాటు చేసి నిరుపేదలను, నిరుద్యోగులను మద్యానికి బానిస చేస్తుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ 55ఏళ్లు పరిపాలించి ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటికి తిరిగి మోదీ ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని కార్యకర్తలను కోరారు. రాబోయే ఎన్నికల్లో పెద్దపల్లిని బీజేపీ కైవసం చేసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పిన్నింటి రాజు, జంగ శ్రీనివాస్‌రెడ్డి, కాల్వ రాధాకృష్ణారెడ్డి, చంద్రమౌళి, ములుకోజు వెంకటేశ్వర్లు, జంగ రాజయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-10-20T00:08:28+05:30 IST