సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం తప్పదు
ABN , First Publish Date - 2023-05-23T00:18:24+05:30 IST
కాంట్రాక్టు కార్మికుల సమస్యలు తక్షణం పరిష్కరించకుంటే ఎన్టీపీసీపై పోరాటం తప్పదని కార్మిక సంఘాల యునైటెడ్ ఫోరం నాయకులు స్పష్టం చేశారు
- ఎస్టీపీసీ గేట్ మీటింగ్‌లో యునైటెడ్ ఫోరం నేతలు
జ్యోతినగర్, మే 22: కాంట్రాక్టు కార్మికుల సమస్యలు తక్షణం పరిష్కరించకుంటే ఎన్టీపీసీపై పోరాటం తప్పదని కార్మిక సంఘాల యునైటెడ్ ఫోరం నాయకులు స్పష్టం చేశారు. సోమవారం ఎన్టీపీసీ ప్రాజెక్టు రెండో గేట్ వద్ద జరిగిన సభలో ఫోరం నాయకులు ప్రసంగిస్తూ ఆరునెలల క్రితం కార్మికుల డిమాండ్లను యాజమాన్యానికి అందజేసినప్పటికీ అధికారులు సరైన రీతిలో స్పందించలేదన్నారు. ఇప్పటి వరకు పదిసార్లకుపైగా చర్చలు జరిపినప్పటికీ యాజమాన్యం చిత్తశుద్ధితో వ్యవహరించ లేదని, దీంతో సమస్యల పరిష్కారం జరగ లేదన్నారు. మహారత్న హోదాతో దేశంలోనే అత్యుత్తమ సంస్థగా ఎన్టీపీసీకి గుర్తింపు రావడంలో కాంట్రాక్టు కార్మికుల పాత్ర ఉందనే విషయాన్ని అధికారులు మర్చిపోతున్నారని వారు విమర్శించారు. తమ హక్కులు, డిమాండ్ల సాధనకు ఉద్యమమే శరణ్యమన్నారు. తప్పని పరిస్థితుల్లో తాము సమ్మె చేయక తప్పని పరిస్థితి నెలకొందని, పరిస్థితి చేయిజారక ముందే యాజమాన్యం చొరవ చూపి సమస్యలు పరిష్కరించాలని పేర్కొన్నారు. సమ్మె, దాని వల్ల ఎదురయ్యే పారిశ్రామిక అశాంతికి యాజమాన్యమే బాధ్యత వహించాలని నాయకులు స్పష్టం చేశారు. గేట్ మీటింగ్‌లో యునైటెడ్ ఫోరం నాయకులు నాంసాని శంకర్, గీట్ల లక్ష్మారెడ్డి, రాయమల్లయ్య(గోదావరి యూనియన్), చిలుక శంకర్, బుచ్చన్న(ఐఎఫ్‌టీయూ), భూమయ్య, సిహెచ్ సత్యం(బీఆర్‌ఎస్), ఎం కొమరయ్య(టీఎన్‌టీయూసీ), రాజిరెడ్డి, కార్మికులు పల్గొన్నారు