ఇంకెన్నాళ్లీ ‘గుర్తింపు’
ABN , First Publish Date - 2023-06-26T01:15:10+05:30 IST
సింగరేణి సంస్థలో కార్మిక సంఘాల గుర్తింపు ప్రహసనంగా మారింది. సరైన చట్టబద్ధత లేని, పరస్పర అవగాహనతో ఏర్పర్చుకున్న కోడ్ ఆఫ్ డిసిప్లిన్‌పై రెండున్నర దశాబ్దాల పాటు జరిగిన కార్మిక సంఘాల గుర్తింపు మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకమైంది.
- ఆర్టీసీలోని పరిస్థితులే సింగరేణిలో..
- సంఘాలతో యాజమాన్యం, ప్రభుత్వం ఆటలు
- నైరాశ్యంలో కార్మిక సంఘాలు
గోదావరిఖని, జూన్ 25: సింగరేణి సంస్థలో కార్మిక సంఘాల గుర్తింపు ప్రహసనంగా మారింది. సరైన చట్టబద్ధత లేని, పరస్పర అవగాహనతో ఏర్పర్చుకున్న కోడ్ ఆఫ్ డిసిప్లిన్‌పై రెండున్నర దశాబ్దాల పాటు జరిగిన కార్మిక సంఘాల గుర్తింపు మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. క్రమంగా సింగరేణిలో కార్మిక సంఘాల ఉనికికే ప్రమాదం ముంచుకొచ్చింది. సింగరేణి సంస్థనే ఆదేశించే స్థాయిలో ఉండే కార్మిక సంఘాలు యాచించే పరిస్థితికి వచ్చాయి. యాజమాన్యం, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిద్దామంటే పోరాటాలు, సమ్మెలకు కార్మికులు సిద్ధంగా లేని వాతావరణం కార్మిక సంఘాలను బలహీనం చేశాయి. సింగరేణిలో ఎన్నికలు నిర్వహిస్తే గుర్తింపు కార్మిక సంఘం కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో చర్చలు జరిపే అవకాశం ఉంటుంది. కానీ గుర్తింపు సంఘం ఎన్నికలనే జరగకుండా చేసి గుర్తింపు సంఘానికే గుర్తింపు లేని పరిస్థితికి యాజమాన్యం తీసుకువచ్చింది. టీబీజీకేఎస్ ఇప్పుడు గుర్తింపు సంఘంగా ఉన్నప్పటికీ యాజమాన్యం టీబీజీకేఎస్‌ను గుర్తింపు సంఘంగా గుర్తించడం లేదు.
ఫ రెండేళ్లుగా చర్చలు లేవు..
రెండేళ్లుగా టీబీజీకేఎస్‌తో కూడా యాజమాన్యం ఎలాంటి చర్చలు, ఒప్పందాలు, త్రైపాక్షిక సమావేశాలు నిర్వహించడం లేదు. అలాగని టీబీజీకేఎస్ గుర్తింపు కార్మిక సంఘం కాదు అని కూడా చెప్పడం లేదు. సింగరేణిలో జరుగుతున్న అన్ని కార్యక్రమాలకు టీబీజీకేఎస్ నాయకులనే ఆహ్వానిస్తున్నది. మైన్స్ కమిటీలు, సేఫ్టీ కమిటీల స్థాయిలో టీబీజీకేఎస్ వారితోనే చర్చలు జరుపుతున్నది. కానీ జీఎం కమిటీలు, కార్పొరేటర్ కమిటీతో మాత్రం ఎలాంటి చర్చలు లేవు. ఈ విషయంపై టీబీజీకేఎస్ అంతగా స్పందించడం లేదు. కార్మిక సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వడం మినహా సమావేశాలకు ఆహ్వానించని సింగరేణి యాజమాన్యాన్ని నిలదీయడం లేదు. ఉన్న గుర్తింపు చాలు అన్నట్టు వ్యవహరిస్తున్నది. కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం 2017లో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికలు రెండేళ్లకు ముగిసిపోయి 2019లోనే ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ నానా రకాల కారణాలతో నాలుగేళ్ల పాటు గుర్తింపును టీబీజీకేఎస్ వెలగబెట్టింది. 2021కే ఆ నాలుగేళ్ల గుర్తింపు కూడా ముగిసిపోయింది. కానీ ఇప్పటికీ తగదునమ్మ అంటూ టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగానే బీరాలు పోతున్నది. మిగిలిన కార్మిక సంఘాలు ఎన్నికలు నిర్వహించండి ప్రభో అని ఇటు కార్మిక శాఖలు, అటు న్యాయ స్థానాల చుట్టూ తిరిగినా అనేక సాంకేతిక కారణాలతో ఆరేళ్లుగా ఎన్నికలను సాగదీస్తూ వస్తున్నారు. విసిగి, వేసారిన జాతీయ సంఘాలు సింగరేణిలో ఎన్నికలైనా నిర్వహించండి లేదా కోడ్ ఆఫ్ డిసిప్లిన్‌ను రద్దు చేయండి అని ఆర్‌ఎల్‌సీకి సంయుక్తంగా మొరపెట్టుకున్నాయి. కోల్ ఇండియాలో మాదిరిగా సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలతో యాజమాన్యం చర్చలు జరిగేలా నిర్ణయం తీసుకొమ్మని సంఘాలు కోరాయి. ఈ అంశంపై యాజమాన్యం కూడా పరోక్షంగా అంగీకారం తెలిపినట్టే వ్యవహరిస్తూ ఇతర కార్మిక సంఘాలను మాత్రం ఏ విషయంలో గుర్తించడం లేదు. ఎన్నికలు నిర్వహించడం లేదు, అన్నీ సంఘాలను సమానంగా చూడడం లేదు. ఈ పరిణామాలపై పోరాటాలకు వెళదామంటే కార్మికవర్గం నుంచి సంసిద్ధత కనిపించకపోవడంతో జాతీయ కార్మిక సంఘాలు ఏమి చేయకుండా నిశ్చేష్టంగా మిగిలిపోయాయి. పైగా సింగరేణి ప్రాంతాల్లోని ఎమ్మెల్యేలకు ప్రొటోకాల్ కల్పిస్తూ ఒక్కో ఎమ్మెల్యేకు సంవత్సరానికి రూ.2కోట్లు సింగరేణి నిధులను ఆ నియోజకవర్గ అవసరాలకు వినియోగించుకునేలా ప్రభుత్వం సింగరేణి హుకుం జారీచేసింది. దీంతో సింగరేణిలో ఎమ్మెల్యేల ప్రాపకం పెరిగి కార్మిక సంఘాలు నిర్వీర్యమయ్యాయి.
ఫ ప్రశ్నించలేని పరిస్థితి..
తెలంగాణ ఏర్పడిన తరువాత ఆర్టీసీ సంస్థలో ఒకేసారి ఎన్నికలు జరిగాయి. తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆర్టీసీలో విజయం సాధించింది. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెకు దిగడంతో ఆర్టీసీలో కార్మిక సంఘాలే లేకుండా ప్రభుత్వం కుట్రకు పాల్పడింది. ఆర్టీసీలో కూడా రెండేళ్లకోసారి జరగాల్సిన ఎన్నికలు లేకుండాపోయాయి. అసలు కార్మిక సంఘాల మనుగడే ఆర్టీసీలో ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికి మూడు పే కమిషన్స్ జరగాల్సి ఉండగా ఒక్కదానికి దిక్కు లేదు. ఏ కమిషన్‌పై డిమాండ్ చేసే పరిస్థితే ఆర్టీసీలో లేకుండా పోయింది. ఎవరైనా ప్రశ్నిస్తే బదిలీలు, సస్పెండ్ వేట్లు పడుతున్నాయి. ఇదే వాతావరణం సింగరేణిలో ఏర్పడింది. తెలంగాణలోని అతిపెద్ద రెండు ప్రభుత్వరంగ సంస్థలైన ఆర్టీసీ, సింగరేణిలో ఎన్నికల ఊసు లేకుండా సాంకేతిక కారణాలతో ప్రభుత్వం భారీ కుట్రకు తెరతీసింది. దీంతో కార్మిక సంఘాల నిర్మాణం, కార్యకలాపాలు లేకుండా పోతున్నాయి. క్రమంగా సంఘాలకు, కార్మికులకు సంబంధాలు తెగిపోతున్నాయి. సింగరేణిలో ఇప్పుడు అదే జరిగింది. ప్రభుత్వం కుట్ర ఫలించింది. 2022లో జరగాల్సిన ఎన్నికలు 2024దాకా జరిగే పరిస్థితి లేకుండా పోయింది. సాధారణ ఎన్నికల తరువాత ఏ ప్రభుత్వం ఏర్పడుతుందో కానీ బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే సింగరేణిలో ఎన్నికలు ఎందుకు అనే పరిస్థితి వస్తుంది. ఈ ఏడాదిలో కార్మిక సంఘాలు కూడా కార్మికులకు మరింత దూరం అయ్యే ప్రమాదం ఉంది. లాభాల వాటాను ప్రభుత్వమే ప్రకటిస్తున్నది. 11వ వేజ్‌బోర్డు ఇప్పటికే అమలైంది. కార్మికుల సంఖ్య సింగరేణిలో తగ్గిపోతున్నది. టీబీజీకేఎస్ బీఆర్‌ఎస్‌కు అనుబంధ సంఘమే. ఈ పరిణామాలన్నీ సింగరేణిలో ఇటు కార్మికుల నుంచి ఎలాంటి డిమాండ్ లేకుండా సంఘటితమయ్యే వాతావరణం లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నది.
ఫ కార్మిక సంఘాల్లో అనైక్యత..
జాతీయ కార్మిక సంఘాలు కూడా ఎన్నికలు జరిగితే ప్రాతినిధ్యం, గుర్తింపుపైనే వ్యామోహంతో వ్యవహరిస్తున్నాయి తప్ప అసలు ఎన్నికలే జరుగకుండా కొనసాగుతున్న కుట్రలను, ఎత్తుగలను భగ్నం చేయలేకపోతున్నాయి. ప్రపంచ కార్మికులను ఒకటికమ్మంటున్నాయి కానీ సంఘాలు మాత్రం ఎన్నికల విషయంలో ఐక్య పోరాటాలకు సిద్ధం కావడం లేదు. 2022 ఫిబ్రవరిలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోల్ ఇండియా స్థాయి పిలుపులో భాగంగా మూడు రోజులు సమ్మె చేశారు తప్ప ఆ తరువాత సింగరేణిలో కార్మిక సంఘాలు కార్మికల సమస్యలపై కానీ, ఎన్నికలపై కానీ తీవ్రమైన ఒత్తిడి రూపాల్లో తీసుకోలేదు. జాతీయ కార్మిక సంఘాలు కూడా సింగరేణిలో ప్రసుత్తం ఉన్న వాతావరణంలో మనగలగడం కష్టమేనని భావిస్తున్నాయి. టీబీజీకేఎస్ కూడా నాలుగేళ్ల కాలపరిమితి దాటింది కనుక తాము కార్మిక సంఘం కాదు అని ఎక్కడా ప్రస్తావించడం లేదు. పైగా తామే కార్మిక సంఘమని ఇప్పటికీ ప్రకటించుకుంటున్నది. ఇది ఏ నైతికతకు కొలమానమో అర్థం కావడం లేదు. ఎన్నికల నుంచి ఎన్నికల వరకు ఎన్నేళ్లు అయినా, ఏన్నాళ్లు అయినా గుర్తింపు సంఘం కొనసాగుతుందా అనేది ఇపుడు సింగరేణిలో అర్థంకాని ప్రశ్న. కోడ్ ఆఫ్ డిసిప్లిన్ కూడా ఈ అంశంపై స్పష్టంగా ఏం చెప్పడం లేదు. కార్మిక శాఖ సైతం కార్మిక సంఘాలు, కార్మికుల హక్కులు, చట్టాల విషయం మినహా సంఘాల ఎన్నికల విషయంలో తటస్థంగానే వ్యవహరిస్తున్నది. మొత్తంగా సింగరేణి గుర్తింపు ఎన్నాళ్లు అనేది ఒక జవాబు దొరకని ప్రశ్న. 2024 దాకా ఎన్నికలు జరుగకపోతే టీబీజీకేఎస్ ఏడేళ్ల పాటు గుర్తింపులో ఉంటుందా అనేది కూడా అర్థం కాని విషయం. అసలు టీబీజీకేఎస్ ఇప్పుడు గుర్తింపు సంఘం కాదా అనేది కూడా అనుమానమే. ఎందుకంటే సింగరేణి యాజమాన్యం బొగ్గు బాయిల మీద, కార్యక్రమాల వేదికల మీద తప్ప మరెక్కడా గుర్తించడం లేదు.