హుజూరాబాద్‌ను సిద్దిపేటలా అభివృద్ధి చేస్తాం
ABN , First Publish Date - 2023-11-10T23:30:47+05:30 IST
హుజూరాబాద్‌ను సిద్దిపేటలా అభివృద్ది చేస్తామని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శుక్రవారం జమ్మికుంట పట్టణంలో మంత్రి హరీష్‌రావు రోడ్‌షో నిర్వహించారు.
- రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు
జమ్మికుంట/జమ్మికుంట రూరల్, నవంబరు 10: హుజూరాబాద్‌ను సిద్దిపేటలా అభివృద్ది చేస్తామని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శుక్రవారం జమ్మికుంట పట్టణంలో మంత్రి హరీష్‌రావు రోడ్‌షో నిర్వహించారు. అంతకు ముందు మధ్యాహ్నం 3.30గంటలకు మంత్రి హెలికాప్టర్‌లో నాయిని చెరువు వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, తెలంగాణ పర్యాటక అభివృద్ది సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్, నియోజక వర్గ ఇన్‌ఛార్జ్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డిలతో కలిసి వీణవంక రోడ్డు మీదుగా గాంధీ చౌరస్తా వరకు రోడ్‌షో చేపట్టారు. వేలాది మంది ప్రజలు తరలి రావడంతో ఆ ప్రాంతం జనసందోహంగా మారింది. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే హుజూరాబాద్ అభివృద్ది చెందింది అన్నారు. ఉప ఎన్నికలో గట్టెక్కేందుకు ఈటల రాజేందర్ ఎన్నో అబద్ధాలు ఆడారని, గెలిచిన తర్వాత నియోజక వర్గాన్ని పట్టించుకోలేదన్నారు. అన్ని సర్వేలు హుజూరాబాద్‌లో కౌశిక్‌రెడ్డి గెలుస్తున్నాడని చెబుతున్నాయని, ఇకపై జీహుజూర్ రాజకీయాలు నడవయన్నారు. ఇంకా ఈటల మాటలు వింటే పదేళ్లు వెనక్కి పోతామన్నారు. హుజూరాబాద్‌లో గెలిచి ఏం చేయనోడు.. గజ్వేల్‌ను ఉద్దరిస్తాడా అని ప్రశ్నించారు. రెండు చోట్ల నిలుచున్న ఈటల రెంటికి చెడ్డ రేవడిలా అవుతాడన్నారు. తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వను అన్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపి ఇప్పుడు ఈటలకు సలహాదారుడు అన్నారు. తెలంగాణ వస్తే అన్నం తినలేదు అన్న పవన్ కళ్యాణ్‌తో పొత్తు పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నించారు. బీజేపికి ఓటు వేస్తే గ్యాస్ ధర రెండు వేలు అవుతుందన్నారు. బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే అసైన్డ్ భూములను పట్టా భూములుగా మారుస్తాం అన్నారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్లకు దిక్కు లేదు కాని, ఆరు గ్యారంటీలకు గ్యారంటీ ఎట్లా అని విమరికశంచారు. హుజూరాబాద్ సర్వే రిపోర్ట్‌లో బీజేపీ మూడో స్థానంలో ఉందన్నారు. కౌశిక్‌రెడ్డి క్రికెట్‌లోనే కాదు ప్రజా జీవితంలో కూడా ఆల్ రౌండరే అన్నారు.
ఫ ఈటల ప్రజలను మోసం చేసి గజ్వేల్ పోయాడు..
హుజూరాబాద్ ప్రజలు ఓటు వేసి ఈటలను గెలిపిస్తే మోసం చేసి గజ్వేల్ పోయాడని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. తనను, తన భార్య, పిల్లలను అవహేళన చేసే విధంగా నిన్న హుజూరాబాద్‌లో ఈటల మాట్లాడారని చెప్పారు. మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడని, హుజూరాబాద్‌లో తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే మరో సిద్దిపేటలా అభివృద్ది చేసుకుందామన్నారు. ఏడు సార్లు ఈటలను గెలిపించారని, ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని అభ్యర్ధించారు. తనపై తప్పుడు ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, వైస్ చైర్‌పర్సన్ దేశీని స్వప్న-కోటి, కేడీసీసీ వైస్ చైర్మన్ పింగిలి రమేష్, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.