Share News

బియ్యం టెండర్లలో వందల కోట్లు గోల్‌మాల్‌

ABN , First Publish Date - 2023-11-19T23:25:01+05:30 IST

బియ్యం టెండర్లలో గోల్‌మాల్‌ చేసి గంగుల 13 వందల కోట్ల రూపాయలు దండుకున్నాడని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ ఆరోపించారు.

బియ్యం టెండర్లలో వందల కోట్లు గోల్‌మాల్‌
బావుపేటలో బండి సంజయ్‌కుమార్‌ను గజమాలతో సత్కరిస్తున్న కార్యకర్తలు

- రూ. 1300 కోట్లు దండుకున్న గంగుల

- డిసెంబరు 4 నుంచి కేసీఆర్‌ మాజీ సీఎం

- బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌

భగత్‌నగర్‌, నవంబరు 19: బియ్యం టెండర్లలో గోల్‌మాల్‌ చేసి గంగుల 13 వందల కోట్ల రూపాయలు దండుకున్నాడని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ ఆరోపించారు. ఆదివారం కొత్తపల్లి మండలంలోని చింతకుంట గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూకబ్జాలు, కమిషన్లతో వేల కోట్లు దండుకున్నాడన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు భూకబ్జాలు తప్ప ప్రజల బాధలు ఏం తెలుసన్నారు. పేదల కోసం పోరాటం చేసి జైలుకెళ్లిన తనపై అవినీతి ఆరోపణలు చేయడానికి సిగ్గుచేటన్నారు. డిసెంబరు 3న కేసీఆర్‌ పవర్‌ కట్‌ కాబోతుందని, 4 నుంచి మాజీ ముఖ్యమంత్రి అవుతాడన్నారు. భూకబ్జాలు, గ్రానైట్‌ గుట్టలను మాయం చేసి కమిషన్లు దండుకున్న గంగుల తనపై అవినీతి ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. దేశంలోనే మహాచోర్‌ కేసీఆర్‌ అని, రాష్ట్రంలోనే బడా చోర్‌ గంగుల అన్నారు. గూగుల్లో వెతికినా, చాట్‌జీపీటిని అడిగినా కేసీఆర్‌, గంగుల పేర్లే ఉంటాయన్నారు. ప్రజల సొమ్మును, గ్రానైట్‌ గుట్టలు, ఇసుకను మెక్కిందెవరని ప్రశ్నించారు. రైతులు పండించిన ధాన్యం మీద కూడా కక్కుర్తి పడ్డారని విమర్శించారు. రైతులు పండించిన ధాన్యం అమ్మితే కోత పెట్టి కమిషన్లు తింటున్న రైతు రాబంధులెవరని ప్రశ్నించారు. కరీంనగర్‌లో రౌడీలు, గుండాల భయం లేదని, ఉన్నదొకటే అధికార పార్టీ మాఫియా భయం ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ అడిగినా ఛీకొట్టే పరిస్థితి ఉందన్నారు. కమిషన్లు, కరెప్షన్‌ కింగ్‌ ఇక్కడున్నాడని, అందుకే కరీంనగర్‌లో ఏ పని చేయాలన్నా సామాన్యుడు బతికి బట్టకట్టలేక పోతున్నాడన్నారు. ప్రతి పనికి రేటు కట్టి పైసలు ముట్టజెప్పందే.. పనులు కాని సంస్కృతిని తెచ్చారన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులిద్దరూ భూ కబ్జాదారులేనని, ఎవరు గెలిచినా మీ ఇళ్లను కబ్జాచేస్తారన్నారు. కొత్తపల్లి మండలం చింతకుంటలో బీజేపీ అభ్యర్థి బండిసంజయ్‌కుమార్‌కు ప్రజలు ఘనస్వాగతం పలికారు. మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతులు, నుదుట తిలకంతో ఆశీర్వదించారు. యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి బండితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. యువతులు బండికికరచాలనం చేసేందుకు పోటీలు పడ్డారు. గ్రామంలోని చిన్నా పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఫ ఆస్తులు రాసిద్దాం.. సిద్దమా..

‘ఇద్దరి ఆస్తిపాస్తుల డాక్యుమెంట్లతో వద్దాం.. ఆస్తులన్నీ ప్రజలకు రాసిద్దాం.. సిద్దమా’ అంటూ బీజేపీ కరీంనగర్‌ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ మంత్రి గంగుల కమలాకర్‌కు సవాల్‌ విసిరారు. ఆదివారం కొత్తపల్లి మండలంలోని బావుపేటలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఈ సారి గెలిస్తే రేషన్‌కార్డులు ఇస్తాడట, ఇన్ని రోజులు ఏమైందని ప్రశ్నించారు. పౌర సరఫరాల మంత్రిగా ఉన్నా గంగుల ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేదన్నారు. బీసీమంత్రిగా ఉండి ఎంతమందికి బీసీబంధు అందిచావని ప్రశ్నించారు. పదేళ్లుగా ఎంత మంది పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇల్లు అందించారని ప్రశ్నించారు. గొప్ప హిందువునని ప్రచారం చేస్తున్నావు.. నిజమైన హిందువైతే టోపి పెట్టుకుని ఓట్ల కోసం దారుస్సాలం పోయి ఎందుకు కాళ్లు మొక్కినావని ప్రశ్నించారు. గుట్టలు, కొండలు మాయం చేసి పేదల ఇళ్లను లాక్కుని భూకబ్జాలు చేసేవారు హిందూ ధర్మ రక్షకుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. తనను ఎంపీగా గెలిపిస్తే ఆర్వోబీ, స్మార్ట్‌సిటీ, రోడ్లు, వీధీ దీపాలు, గ్రామాలు, పట్టణాల్లో జరిగే అభివృద్ధి పనులకు కేంద్రంతో మాట్లాడి నిధులు తీసుకు వచ్చానన్నారు. గ్రామ పంచాయతీలకు డబ్బులు, పేదలకు ఉచిత బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. కరీంనగర్‌ అభివృద్ధి కోసం 196 కోట్లు, రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి 153 కోట్లు, రోడ్ల అభివృద్ధికి 573 కోట్లు, ఇతర పనులకు 800 కోట్లు తీసుకు వచ్చానన్నారు. తెలంగాణ యువకులకు కేసీఆర్‌ ఉద్యోగాలు ఇవ్వలేదు కాని కేసీఆర్‌ ఇంట్లో మాత్రం అందరికీ పదవులు ఇచ్చుకున్నారన్నారు. నిరుద్యోగుల కోసం పోరాడితే వంద మంది పోలీసులతో దాడి చేసి తనను గంగుల, కేసీఆర్‌ అరెస్టు చేయించారన్నారు. ఉద్యోగుల కోసం పోరాడితే తన కార్యలయాన్ని ధ్వంసం చేసి జైలు పాలుచేశారన్నారు. పండించిన వడ్లను కొనాలని రైతుల పక్షాన ధాన్యం కేంద్రాలకు పోతే తనపై, బీజేపీ కార్యకర్తలపై రాళ్ల దాడి చేశారన్నారు. ఎంపీగా గెలిచిన తర్వాత తొమ్మిది వేల కోట్ల రూపాయలు తీసుకు వచ్చినా.. నా దగ్గర లెక్కాపత్రం ఉంది. నువ్వు చేసిన అభివృద్ధి ఏందో చర్చిద్దాం రా అని సవాల్‌ చేశారు. నా భార్యా పిల్లలను పక్కన పెట్టి మీ కోసం కొట్లాడితే 74 కేసుల ఆస్తి సంపాదించానన్నారు. మరి కమలాకర్‌ ఎవరి కోసం కొట్లాడిండు.. ఎన్నిసార్లు జైలుకు పోయాడని ప్రశ్నించాడు. ఉద్యోగులకు మొదటి తేదీన జీతాలే ఇవ్వలేని కేసీఆర్‌, కమలాకర్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. పుట్టబోయే బిడ్డపై కూడా రెండు లక్షలకు పైగా అప్పు భారం మోపుతారన్నారు. కొండలు, గుట్టలు మాయం చేసి అడ్డగోలుగా సంపాదించి గ్రానైట్‌ కార్మికుల సంఘం ఎన్నికలు జరగకుండా చేస్తున్నాడన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే గ్రానైట్‌ యూనియన్‌ ఎన్నికలు జరిపించి తీరుతానన్నారు. ఒక్క అవకాశం బీజేపీకి కల్పించాలన్నారు. అవినీతికి అక్రమాలతో పాలిస్తున్న ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్నారు.

ఫ దొంగ వీడియోలు సృష్టించే కుట్ర

గంగుల, పురమళ్ల నయీం బ్రదర్స్‌ అని, భూకబ్జాలు, అవినీతి చేయడమే వాళ్లపని అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం రాత్రి కమాన్‌ చౌరస్తాలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఓటమి ఖాయమని తేలడంతో తనపై దొంగ వీడియోలు సృష్టించే కుట్రలు పన్నుతున్నారన్నారు. మార్ఫింగ్‌లు చేసి దొంగ వీడియోలు, ఆడియోలు సృష్టించి ప్రజలను గందరగోళంలో పడేసే పెద్దకుట్రలకు తెరతీశారన్నారు. ప్రజల తరపునకొట్లాడిందెవరో ఆలోచించాలన్నారు. ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాలన్నారు. పేపర్‌ లీకేజితో విద్యార్థులను రోడ్డున పడేశారన్నారు. డబ్బులు, సెల్‌ ఫోన్లు పంచినా గెలిచే అవకాశం లేదని సర్వేలు తేల్చడంతో తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు దొంగ వీడియోలు, ఆడియోలు సృష్టించే కుట్రలకు తెర లేపారన్నారు. ప్రజలు ఆలోచించి విజ్ఞత ప్రదర్శించాలన్నారు.

Updated Date - 2023-11-19T23:25:06+05:30 IST