హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి

ABN , First Publish Date - 2023-04-03T00:33:41+05:30 IST

హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని భజరంగ్‌దళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివరాములు అన్నారు.

హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి
సిరిసిల్లలో వీర హనుమాన్‌ ఏక్తా యాత్ర

సిరిసిల్ల రూరల్‌, ఏప్రిల్‌ 2: హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని భజరంగ్‌దళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివరాములు అన్నారు. సిరిసిల్లలో ఆదివారం సాయంత్రం విశ్వహిందు పరిషత్‌, భజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో హనుమాన్‌ జయంతి సందర్భంగా వీరహనుమాన్‌ ఏక్తా విజయయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలకత్తాలో హిందూ సమాజం ఐక్యత లేకపోవడంతోనే అస్తులు, భూములు ఉన్నా పారిపోయే పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికైనా హిందువులంతా ఏకతాటిపైకి రావడానికి భజరంగ్‌దళ్‌ కృషి చేస్తోందని అన్నారు. హిందూ సమాజాన్ని కాపాడాడం కోసం 2004లో హైదరాబాద్‌లో గౌళిగూడ రామ మందిరం నుంచి 150 మందితో ప్రారంభమైన భజరంగ్‌దళ్‌ నేడు దేశంలోని 9 రాష్ట్రాల్లో హిందూ సమాజ స్థాపన కోసం పని చేస్తోందన్నారు. హనుమాన్‌ జయంతి సందర్భంగా భజరంగ్‌దళ్‌, విశ్వహిందు పరిషత్‌ ఆధ్వర్యలో రాష్ట్రంలోని 9600 గ్రామాల్లో హనుమాన్‌ ఏక్తా విజయయాత్రలు సాగుతున్నాయన్నారు. బంగ్లాదేశ్‌ నుంచి కలకత్తాకు వలసవచ్చిన ప్రజలు అక్కడ ఉన్న హిందువులను ఇబ్బందులకు గురి చేయడంతో వారి వేధింపులు భరించలేక భవనాలు, భూములను వదిలేసి పారిపోతున్నారని, అక్కడి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించి హిందువులను కాపాడాలన్నారు. మరోవైపు అయ్యప్ప కొలువై ఉన్న కేరళలో గోవధ జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు సంస్కారం నేర్పించాలని సూచించారు. అంతకుముందు విశ్వహిందు పరిషత్‌, భజరంగ్‌దళ్‌ సభ్యులు, హనుమాన్‌ దీక్షాదారులు, బీజేపీ నాయకులతో ప్రారంభమైన ర్యాలీ చేనేత చౌక్‌, పెద్దబజార్‌, వేంకటేశ్వర టెంపుల్‌, గాంధీ చౌక్‌, అంభేద్కర్‌ చౌరస్తా మీదుగా కొనసాగింది. కార్యక్రమంలో విశ్వహిందు పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు చేపూరి అశోక్‌, భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు బుర్ర లింగమూర్తి, బండారి సంతోష్‌, రాయిని హరికృష్ణ, నెల్లుట్ల రాహూల్‌, గౌతం, ఎంబేరి టింకు, మైలారంపు క్రాంతి, బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు లగిశెట్టి శ్రీనివాస్‌, బర్కం నవీన్‌యాదవ్‌, పత్తి పాక సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T00:33:41+05:30 IST