జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం
ABN , First Publish Date - 2023-09-04T01:08:06+05:30 IST
బంగాళఖాతంలో ఏర్పడ్డ ఆవర్తన ఉపరితల ప్రభావంతో జిల్లాలో భారీ వర్షం కురిసింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది.
- పలుచోట్ల రోడ్లపై నిలిచిన వరదనీరు
- ఇబ్బందులు పడుతున్న జనం
- మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం
కరీంనగర్, సెప్టెంబర్ 3 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): బంగాళఖాతంలో ఏర్పడ్డ ఆవర్తన ఉపరితల ప్రభావంతో జిల్లాలో భారీ వర్షం కురిసింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. వారం రోజులుగా భరించలేని వేడిమి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన జనం ఊపిరిపీల్చుకున్నారు. 15 రోజులుగా వర్షాలు పడక పోవడంతో పంటలను కాపాడుకునేందుకు ఇబ్బందులుపడుతున్న రైతులకు ఊరట కలిగింది. వరి, పత్తి, మొక్కజొన్నతోపాటు కూరగాయలు సాగు చేసిన రైతులు పంటలు ఎండిపోతాయానే ఆందోళన చెందుతుండగా, ఈ వర్షాలు ఎంతో మేలు చేస్తాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొత్తపల్లి మండలంలోని ఆసీఫ్‌నగర్‌లో అత్యథికంగా 119.3 మిల్లీమీటర్లు, అత్యల్పంగా జమ్మికుంట మండలం తనుగులలో 4.5 మిల్లీమీటరు వర్షం కురిసింది. చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి, ఆర్నకొండతోపాటు కొన్ని గ్రామాల్లో మాత్రమే వర్షం పడలేదు. కరీంనగర్‌లో ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని చీకటిగా మారి భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లడంతో ఓవైపు మురుగునీరు, మరోవైపు వర్షపు నీరు నిలిచి ప్రజలు కొద్దిసేపు ఇబ్బందులు పడ్డారు. కలెక్టరేట్ ముందు, రాంనగర్, మంకమ్మతోట, ముకరంపుర, జగిత్యాలరోడ్‌లోని ఆర్టీసీ వర్క్‌షాపు తదితర ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై మొకాలు లోతులో నీరు నిలువడంతో వాహనదారులు ఇక్కట్లకు గురయ్యారు. మంకమ్మతోటలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లను ఆనుకొని ఉన్న ఇళ్ల ముందు భారీగా వరద నీరు చేరడంతో ఆ ప్రాంత వాసులు ఇబ్బందిపడ్డారు. ఆదివారం సెలవు రోజు కావడం, శనివారం రాత్రి నుంచే ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో జనం ఇళ్ల నుంచి బయటకు అవసరమైతే తప్ప రాక పోవడంతో రోడ్లపై రద్దీ తగ్గింది. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు కొంత ఆటంకం కలిగింది. మేయర్ యాదగిరి సునీల్‌రావు, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ కరీంనగర్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించి రోడ్లపై నిలిచిన వరద నీటిని వెంటనే మళ్లించాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణశాఖ హెచ్చరిక నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను సూచించారు.
ఫ ఆసీఫ్‌నగర్‌లో అత్యధికంగా 119.3 మి.మి. వర్షపాతం నమోదు
కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌లో 119.3 మిల్లీమీటర్లు, మానకొండూర్ మండలం పోచంపల్లిలో 85.5, కరీంనగర్‌లో 80.8, కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్‌లో 70.5, చొప్పదండి మండలం వెదురుగట్టలో 53, రామడుగు మండలం గుండిలో 52.5, ఈదులగట్టెపల్లిలో 50.5, గన్నేరువరం మండలం కాసింపేటలో 42.3, గంగాధర మండలం బూర్గుపల్లిలో 40.5, గంగాధర మండల కేంద్రంలో 37.8, గట్టుదుద్దెనపల్లిలో 34.3, గంగిపల్లిలో 33.3, శంకరపట్నం మండలం తాడికల్‌లో 30, జమ్మికుంటలో 23.5, తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లో 21.3, వీణవంకలో 20.5, కొత్తపల్లి-ధర్మారంలో 19.5, కొత్తగట్టులో 18.5, ఇల్లందకుంట మండలంలోని మల్యాలలో 16.8, రేణికుంటలో 16.5, హుజురాబాద్ మండలం బోర్నపల్లిలో 16.3, చిగురుమామిడి మండలంలో 14.8, సైదాపూర్ మండలం వెంకపల్లిలో 9, జమ్మికుంట మండలం తనుగులలో 4.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
ఫ దుర్శేడ్ గ్రామంలో ఇళ్లలోకి చేరిన వర్షం నీరు
కరీంనగర్ రూరల్: మండలంలోని దుర్శేడ్ గ్రామంలో భారీ వర్షానికి ఇళ్లలోకి నీరు చేరింది. కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు ఆదివారం గ్రామంలోని వర్షం నీరుచేరిన ఇళ్లను పరిశీలించి సహాయకచర్యలు చేపట్టారు. కార్యక్రమంలో ఆర్‌ఐ రజనీకాంత్, ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్‌రావు, సింగిల్ విండో డైరెక్టర్ గాజుల అంజయ్య పాల్గొన్నారు.
ఫ తిమ్మాపూర్: మండలంలో శనివారం రాత్రి నుండి ఎడతెరపి లేకుండా ఎరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నుస్తులాపూర్ గ్రామంలో కొడముంజ కిష్టయ్య ఇంటిపైన పిడుగు పడింది. దీంతో ఇంట్లో ఉన్న టీవీ, ప్యాన్లతో పాటు విద్యుత్ పరికారలు, వైరింగ్ కాలిపోయింది. ఎలివేషన్ ధ్వంసం అయ్యింది. మొగిళిపాలెంలో పాకాల శ్రీనివాస్ ఇంటిపై పిడుగు పడటంతో ఇంటికి పగుళ్లు రావడంతోపాటు విద్యుత్ పరికరాలు దెబ్బతిన్నాయి.