గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ

ABN , First Publish Date - 2023-08-10T00:12:45+05:30 IST

సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారికి గృహలక్ష్మి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు రాష్ట్రబీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి గంగుల కమలాకర్‌

- దరఖాస్తుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

- 15 లోపు బీసీ కులవృత్తుల చేయూత చెక్కుల పంపిణీ

- రెండో విడత దళితబంధు, గొర్రెల పంపిణీ పథకాల ప్రక్రియ వేగవంతం చేయాలి

- మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారికి గృహలక్ష్మి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు రాష్ట్రబీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. గృహలక్ష్మి, దళితబంధు, బీసీ కులవృత్తులకు చేయూత, సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకాలపై కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, అధికారులతో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని, దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ పథకాన్ని అమలు చేస్తామన్నారు. స్లాబ్‌ ఇల్లు ఉన్న వారు, జీవో 59 కింద లబ్ధి పొందినవారు ఈ పథకానికి అనర్హులన్నారు. గృహలక్ష్మి కోసం ప్రత్యేక దరఖాస్తు ఫారం అంటూ ఏది లేదని, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫారంతో ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. తెల్లకాగితంపై రాతపూర్వకంగా దరఖాస్తు రాసి ఆహార భద్రత కార్డు, ఆధార్‌ కార్డు, ఓటర్‌ ఐడీ కార్డుతో కలిపి తహసిల్దార్‌కు అందిస్తే వారు కలెక్టర్‌కు పంపిస్తారని చెప్పారు. గ్రామంలో ఉన్న పాత ఇల్లుకాని, స్థలాలకుకానీ దస్తావేజులు ఉండవు కాబట్టి ఇంటి నంబర్‌ ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. లబ్ధిదారుల జాబితాను జిల్లా మంత్రి, కలెక్టర్‌ రూపొందిస్తారన్నారు. పట్టణ ప్రాంతాలకు చెందిన దరఖాస్తుదారులు మున్సిపల్‌ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక నోడల్‌ ఆఫీసర్‌, ప్రతి మండలానికి ఒక స్పెషల్‌ వెరిఫికేషన్‌ అధికారిని నియమించామని చెప్పారు.

ఫ మూడు విడుతలుగా ఆర్థిక సాయం అందజేత

మూడు లక్షల రూపాయలను మూడు విడతలుగా అందిస్తామని, అందులో బేస్‌మెంట్‌ పూర్తికాగానే మొదటి విడతగా లక్ష రూపాయలు, రూఫ్‌ పూర్తికాగానే రెండో విడతలో మరో లక్ష రూపాయలు, నిర్మాణం పూర్తయిన తర్వాత మూడో విడతలో చివరి లక్ష రూపాయలు అందిస్తామన్నారు. గృహలక్ష్మి లబ్ధిదారులు ఇలాగే ఇల్లు నిర్మించుకోవాలని ప్రభుత్వం ఎలాంటి నిబంధన పెట్టలేదని, ఎవరికి నచ్చిన విధంగా వారు ఇల్లు నిర్మించుకోవచ్చన్నారు. ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించి 20వ తేదీలోగా లబ్ధిదారుల వెరిఫికేషన్‌ పూర్తి చేస్తామన్నారు. 25వ తేదీన మొదటి విడత లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. లబ్ధిదారుల్లో ఎస్సీలు 20 శాతం, ఎస్టీలు 10 శాతం, బీసీలు 50 శాతం, వికలాంగులు ఐదు శాతం మించకుండా ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు.

ఫ మొదటి విడతలో 10,500 మందికి..

గృహలక్ష్మి పథకం కింద మొదటి విడతగా జిల్లావ్యాప్తంగా 10,500 మందికి ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. ఇందులో కరీంనగర్‌ నియోజకవర్గంలో మూడు వేలు, చొప్పదండిలో 1,650, మానకొండూర్‌లో రెండు వేలు, హుజూరాబాద్‌కు 2,600, హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని జిల్లా పరిధిలోని మండలాలకు చెందిన 1250 మంది లబ్ధిదారులకు అందించనున్నామని తెలిపారు. కేబుల్‌ బ్రిడ్జి వద్ద ఆగస్టు 15న సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నామన్నారు. ఇకపై ప్రతి శని, ఆదివారాల్లో సండే ఫండే పేరుతో కేబుల్‌ బ్రిడ్జి వద్ద వాహనాల రాకపోకలను రద్దుచేసి ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే కార్యక్రమాలను చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. బీసీ కులవృత్తుల చేయూత పథకం ఈ నెల 15వ తేదీలోగానే పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మైనార్టీ బంధు విధి విధానాలను మరో రెండు రోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు. రెండో విడత దళితబంధు కింద నియోజకవర్గానికి 11 వందల యూనిట్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. మొదటి విడతలో పెండింగ్‌లో ఉన్న యూనిట్లను పూర్తిస్థాయి గ్రౌండింగ్‌ చేసేందుకు అధికారులు యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకోవాలన్నారు. గొర్రెల పథకం మొదటి విడతలో మంజూరైన వారికి యూనిట్లు త్వరగా అందించాలని సూచించారు. రెండో విడతగా జిల్లాకు 10,236 యూనిట్లను కేటాయించారని, దీనికి సంబంధించిన లబ్దిదారుల జాబితాను త్వరగా పూర్తి చేయాలన్నారు. జిల్లాకు 540 మంది వీఆర్‌ఏలను కేటాయించారని, వీరిని ఆయాశాఖల్లో నియమిస్తూ గురువారం నుంచి ఆర్డర్లు జారీ చేస్తామన్నారు. వీఆర్‌ఏల్లో 60 ఏళ్లలోపు 439 మంది ఉంటే, 60 ఏళ్లు దాటినవారు 107 మంది ఉన్నారని, 61 ఏళ్లు ఉన్నవారి కుటుంబ సభ్యుల విద్యార్హతను బట్టి ఉద్యోగ నియామకాలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో మేయర్‌ వై సునీల్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌, ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, సతీష్‌కుమార్‌, కలెక్టర్‌ డాక్టర్‌ బి గోపి, అదనపు కలెక్టర్‌ లక్ష్మికిరణ్‌, డీసీసీబీ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పొన్నం అనిల్‌గౌడ్‌, వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ చైర్మన్‌ రెడ్డవేణి మధు, కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ రుద్ర రాజు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-10T00:12:45+05:30 IST