ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు గ్రీన్‌సిగ్నల్‌

ABN , First Publish Date - 2023-01-18T00:31:19+05:30 IST

ఉపాధ్యాయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదోన్నతులు, బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు గ్రీన్‌సిగ్నల్‌

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఉపాధ్యాయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదోన్నతులు, బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇటీవల రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి హరీష్‌రావు కలిసి ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నాయకులతో సమావేశం నిర్వహించి అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి, మార్గదర్శకాలను అనుసరించి బదిలీలు చేపడతామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు ఉపాధ్యాయుల బదిలీలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ రెండు, మూడు రోజుల్లో జీవో జారీకానున్నది. బదిలీలు, పదోన్నతులకు సంబంధించి విధివిధానాలతో కూడిన వేర్వేరు జీవోలను కూడా ప్రభుత్వం విడుదల చేయనున్నది. దీంతో జిల్లాలో ఖాళీగా ఉన్న 240 పోస్టుల్లో పదోన్నతుల ద్వారా 148 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు వచ్చే అవకాశాలున్నాయి. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుఉ 41 వరకు, మిగతా పోస్టులు 102 వరకు ఖాళీ ఏర్పడవచ్చని విద్యా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నాలుగున్న సంవత్సరాల తర్వాత బదిలీలు, ఏడున్నర సంవత్సరాల తర్వాత పదోన్నతుల ప్రక్రియను చేపట్టేందుకు ప్రభుత్వం ముందుకు వస్తుండడంతో ఉపాధ్యాయ వర్గాల్లో హర్షం వ్యక్తం చేస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల పదవీ విరమణలను బట్టి ప్రతి ఏటా జీహెచ్‌ఎం, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను పదోన్నతుల తర్వాత భర్తీ చేస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత చివరిసారిగా 2015లో మాత్రమే పదోన్నతులు కల్పించగా, ఖాళీల భర్తీ కోసం 2017లో టీఎస్‌పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్‌ జారీ చేసి కొన్ని పోస్టులను భర్తీచేసింది. 2018లో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన బదిలీలు నిర్వహించింది. కొత్త జిల్లాల ప్రాతిపదికన ప్రభుత్వం కొత్త జోన్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ మేరకు 317 జీవో ఆధారంగా స్థానికత ఆధారంగా ఉద్యోగ, ఉపాధ్యాయులను వివిధ జిల్లాలకు కేటాయించారు. ఆ తర్వాత శాఖల వారీగా ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేస్తున్నది.

ఫ ఉపాధ్యాయ సంఘాల అసంతృప్తి..

ఉపాధ్యాయుల బదిలీల, పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని ఎప్పటి నుంచో ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నాయి. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేస్తుండగా, విద్యా శాఖలో ఖాళీ ఏర్పడే ఉపాధ్యాయుల పోస్టులను కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది. దానికంటే ముందు పదోన్నతులు కల్పించి, బదిలీలు చేపడితేనే స్కూల్‌ అసిస్టెంట్లు సబ్జెక్టుల వారీగా, ఎస్జీటీలు, వ్యాయామ ఉపాధ్యాయులు, పండిట్‌ పోస్టులు సబ్జెక్టుల వారీగా ఎన్ని ఖాళీగా ఉంటాయో తేలనున్నది. వాటి ఆధారంగా ఖాళీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ తీరుపై అసంతృప్తితో ఉన్న ఉపాధ్యాయ వర్గాలను సంతృప్తిపరిచేందుకు, వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సుదీర్ఘ కాలం తర్వాత పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని నిర్ణయించింది. జిల్లాలో 361 ప్రాథమిక, 83 ప్రాథమికోన్నత, 101 ఉన్నత, మొత్తం 543 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 30,201 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ పాఠశాలల్లో విద్యాబోధన చేసేందుకు ప్రభుత్వం 2511 పోస్టులను మంజూరు చేయగా, 2271 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. 240 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జీహెచ్‌ఎం గ్రేడ్‌ 2 పోస్టులను వంద శాతం అర్హులైన స్కూల్‌ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించడం ద్వారా, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం పోస్టులను కూడా వంద శాతం అర్హులైన ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయనున్నారు. అలాగే ప్రస్తుతం స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 102 ఖాళీగా ఉండగా, వీటిలో 70 శాతం 72 పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయనున్నారు. 148మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు రావచ్చని అంచనా. పదోన్నతులు కల్పించిన తర్వాత 41 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 199 వరకు ఎస్జీటీ, పండిట్‌, పీఈటీ, ఇతర పోస్టులు ఖాళీ ఏర్పడనున్నాయి. వీటి సంఖ్య పదోన్నతులు, బదిలీలను బట్టి ఉంటాయి. జీహెచ్‌ఎం గ్రేడ్‌ 2 పోస్టులు మల్ట్టీ జోనల్‌ పరిధిలో ఉంటాయి. ఒకవేళ ముందుగా బదిలీలు చేపట్టినట్లయితే ఖాళీలు ప్రస్తుతం ఉన్న దానికంటే తగ్గడం గానీ, పెరగడం గానీ జరగవచ్చు. ముందుగానే పదోన్నతులు చేపట్టినట్లయితే పదోన్నతులు పెరగడం గానీ, తగ్గడం గానీ జరగవచ్చు. జీహెచ్‌ఎం గ్రేడ్‌ 2 బదిలీలు పూర్తయిన తర్వాతనే పదోన్నతులు కల్పించినట్లయితే హెచ్‌ఎం పోస్టులు పూర్తిగా, తద్వారా ఖాళీ ఏర్పడే స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో 70 శాతం భర్తీ కానున్నాయి. ఈ విధానాన్నే అనుసరించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.

జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల వివరాలు..

పోస్టు సాంక్షన్‌ వర్కింగ్‌ వెకెన్సీ ప్రమోషన్లు

జీహెచ్‌ఎం-2 103 67 36 36

ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం 79 39 40 40

ఎస్‌ఏ గణితం 198 187 11 8

ఎస్‌ఏ భౌతిక శాస్త్రం 154 151 3 2

ఎస్‌ఏ బయాలజీ 155 140 15 11

ఎస్‌ఏ సాంఘికశాస్త్రం 175 133 42 29

ఎస్‌ఏ ఇంగ్లీష్‌ 149 149 0 0

ఎస్‌ఏ తెలుగు 73 59 14 10

ఎస్‌ఏ హిందీ 53 42 11 8

ఎస్‌ఏ ఉర్దూ 3 1 2 1

ఎస్‌ఏ పీడీ 11 7 4 3

ఎల్‌పీ తెలుగు 127 124 3 0

ఎల్‌పీ హిందీ 99 97 2 0

ఎల్‌పీ ఉర్దూ 0 0 0 0

పీఈటీ 43 42 1 0

ఎస్‌జీటీ 1058 1030 28 0

సీఐ 20 0 20 0

డీఎం 4 1 3 0

వీఐ 7 2 5 0

---------------------------------------------------------------------

మొత్తం 2511 2271 240 0

---------------------------------------------------------------------

Updated Date - 2023-01-18T00:31:20+05:30 IST