ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుకు ప్రభుత్వం కృషి
ABN , First Publish Date - 2023-01-27T00:48:41+05:30 IST
ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
భగత్‌నగర్, జనవరి 26: ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కరీంనగర్ డిపో-2లో నూతనంగా కొనుగోలు చేసిన సూపర్ లగ్జరీ బస్సులను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల భద్రత కోసం ఆర్టీసీలో మార్పులకు శ్రీకారం చుడుతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 51 బస్సులను కొనుగోలు చేయగా కరీంనగర్‌కు మూడు బస్సులను కేటాయించారన్నారు. కరీంనగర్ నుంచి యాదాద్రికి నేరుగా బస్సును నడిపించేందుకు చర్యలు చేపట్టాలని ఆర్టీసీ అధికారులకు సూచించామన్నారు. ఫిబ్రవరి నుంచి యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి సన్నిధికి కరీంనగర్ నుంచి భక్తులు చేరుకునే విధంగా బస్సులను నడిపిస్తామన్నారు. సెల్ ఫోన్ చార్జింగ్ పాయింట్, అలారమ్ సిస్టం ఈ బస్సుల్లో ఉంటుందన్నారు. 36 పుష్‌ఫుల్ సీట్లతో ప్రయాణికులు సౌకర్యవంతమైన ప్రమాణం చేయవచ్చన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయబడిన తర్వాత ప్రజల అవసరాలకనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని చర్యలు చేపడుతున్నారన్నారు. కార్యక్రమంలో మేయర్ యాదగిరి సునీల్‌రావు, డిప్యూటి మేయర్ చల్లా స్వరూపారాణిహరిశంకర్, కార్పొరేటర్లు దిండిగాల మహేష్, ఐలేందర్‌యాదవ్, పిట్టల శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, ఆర్టీసీ ఆర్‌ఎం ఖుస్రోషాఖాన్ పాల్గొన్నారు.