వెలవెలబోతున్నాయి..!

ABN , First Publish Date - 2023-07-07T00:38:04+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘తెలంగాణ క్రీడా ప్రాంగణాల’ వెలవెలబోతున్నాయి.

వెలవెలబోతున్నాయి..!

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘తెలంగాణ క్రీడా ప్రాంగణాల’ వెలవెలబోతున్నాయి. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న బొంపెల్లిలో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణంలో ఒక గుట్ట స్థలాన్ని చదును చేసి, దాని ముందు ఒక బోర్డు ఏర్పాటు చేశారు. కానీ ఆ ప్రాంగణంలో ఒక్క క్రీడా పరికరం కూడా ఏర్పాటు చేయలేదు. అసలు ఆ స్థలం ఏ ఆట ఆడుకోడానికి కూడా పనికి రాదు. అలాగే కొన్ని గ్రామాల్లో సగంసగం మాత్రమే పరికరాలను ఏర్పాటు చేశారు. మరికొన్ని గ్రామాల్లోని పాఠశాలల క్రీడామైదానాలకే బోర్డులు తగిలించారు. అన్ని వసతులున్న ప్రాంగణాల్లో ఆటలు ఆడేందుకు వెళ్లే వాళ్లు కరువయ్యారు. ప్రభుత్వం ఏ లక్ష్యంతో ఏర్పాటు చేసిందో ఆ లక్ష్యం నెరవేరడం లేదు. వాటిని ఆదరా, బాదరాగా నిర్మించారే తప్ప అవి ఎంతవరకు ఉపయోగంలో ఉన్నాయో అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయకపోవడంతో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు వెలవెలబోతున్నాయి. వాటి నిర్వహణ గాలికి వదిలేయడంతో చాలా ప్రాంగణాల్లో గడ్డి, పిచ్చి మొక్కలు మొలవగా, క్రీడా పరికరాలు తుప్పు పట్టి పోతున్నాయి. ఈ ప్రాంగణాల పేరిట లక్షలాధి రూపాయల నిధులు వృథా అయ్యాయి. గ్రామాల్లో వివిధ రకాల మౌలిక వసతులను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధిహామీ పథకం నిధులను సద్వినియోగం చేసుకుంటున్నది. లేబర్‌ కంపోనెంట్‌తో పాటు మెటీరియల్‌ కంపోనెంట్‌ నిధులను కూడా వాడుకుంటున్నారు. ప్రతి గ్రామంలో ఒక శ్మశానవాటిక, వైకుంఠ ధామం, సెగ్రిగేషన్‌ షెడ్లను నిర్మించారు. రైతులకు సేవలు అందించేందుకు ప్రతి క్లస్టర్‌లో ఒక రైతు వేదికను నిర్మించారు. ప్రజలు సేద దీరేందుకు పల్లె ప్రకృతి వనాలు, బృహత్‌ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి గ్రామానికి, పల్లెకు ఒక ‘తెలంగాణ క్రీడా ప్రాంగణం’ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గత ఏడాది క్రితం తెలంగాణ క్రీడా ప్రాంగణాలను నిర్మించారు.

నెరవేరని ప్రభుత్వ లక్ష్యం

జిల్లాలోగల 267 గ్రామపంచాయతీల్లో మొత్తం 353 ప్రాంగణాలను నిర్మించాలని నిర్ణయించారు. ఆ మేరకు కొన్ని మినహా అన్నింటిని నిర్మించారు. ఒక్కో క్రీడా ప్రాంగణానికి 4 లక్షల 30 వేల వరకు ప్రభుత్వం కేటాయించింది. కనీసం రెండు ఎకరాల స్థలంకు తక్కువ గాకుండా ప్రభుత్వ స్థలాలను గుర్తించి ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ధేశించింది. ఈ ప్రాంగణాల్లో ముఖద్వారంలో ఒక పెద్ద బోర్డు, వాలీబాల్‌ కోర్టు, కబడ్డీ కోర్టు, ఖోఖో కోర్టు, ఎక్సర్‌సైజ్‌లు చేసేందుకు మినీబార్‌, లాంగ్‌బార్‌లను ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఖోఖో కోర్టు కోసం రెండు కర్రపోల్స్‌, వాలీబాల్‌ కోసం రెండు ఐరన్‌ పోల్స్‌, బిగ్‌, మినీ బార్‌లను ఐరన్‌తో చేసిన వాటిని సమకూర్చాల్సి ఉంటుంది. కానీ వీటిని మెటీరియల్‌ కంపోనెంట్‌ కింద తీసుకోవాల్సి ఉంటుంది. దీని కింద 1,40,922 రూపాయలు కేటాయించారు. జంగల్‌ క్లియరెన్స్‌, మైదానం చదును చేసి, చుట్టూ మొక్కలు నాటేందుకు ఉపాధిహామీ పథకం 2,89,583 రూపాయల విలువైన పని దినాలను కేటాయించారు. పూర్తయిన క్రీడా ప్రాంగణాల్లో చాలావరకు ఉపయోగంలో లేకపోవడం గమనార్హం. వివిధ స్థాయిలో చదువుకునే విద్యార్థులు, గ్రామాల్లో ఉండే యువకులు ఉదయం, సాయంత్రం వేళల్లో ఆటలు ఆడుకునేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేస్తే ఎవరు పట్టించుకోవడం లేదు. చాలా ప్రాంగణాల్లోని మైదానాల్లో గడ్డి పిచ్చిమొక్కలు పెరిగాయి. బార్‌లను వినియోగించుకోకపోవడంతో అవి తుప్పు పడుతున్నాయి. కొన్ని ప్రాంగణాల్లో వాలీబాల్‌ పోల్స్‌కు నెట్‌లు శాశ్వతంగా కట్టి ఉంచడంతో అవి పాడైపోతున్నాయి. కొన్ని ప్రాంగణాల్లో రైతులు వరి ధాన్యాన్ని ఆరబోసుకుంటున్నారు. 70 శాతానికి పైగా ఈ క్రీడాప్రాంగణాలను సద్వినియోగం చేసుకోకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. ఇప్పటికైనా సంబంధిత శాఖాధికారులు స్పందించి తెలంగాణ క్రీడా ప్రాంగణాలను సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2023-07-07T00:38:04+05:30 IST