Share News

మీ వాడిని.. ఒక్కసారి అవకాశం ఇవ్వండి

ABN , First Publish Date - 2023-11-19T23:54:23+05:30 IST

మీ వాడిని, దయతో ఒక్కసారి ఓటు వేసి అవకాశం ఇవ్వండి, మీ కష్టసుఖాల్లో వెంటే ఉంటా.. వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకెళ్తానని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌ అన్నారు.

మీ వాడిని.. ఒక్కసారి అవకాశం ఇవ్వండి
ఓటు అభ్యర్థిస్తున్న ఆది శ్రీనివాస్‌

వేములవాడ /చందుర్తి, నవంబరు 19: మీ వాడిని, దయతో ఒక్కసారి ఓటు వేసి అవకాశం ఇవ్వండి, మీ కష్టసుఖాల్లో వెంటే ఉంటా.. వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకెళ్తానని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌ అన్నారు. చందుర్తి మండలంలోని మూడపల్లి, గోస్కులపల్ల్లి, అనంతపల్లి, మర్రిగడ్డ, దేవునితండా, జలపతి తండా, కట్టలింగంపేట గ్రామాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ గ్రామాన మహిళలు మంగళహారతులు, బతుకమ్మలు, బోనాలు, డప్పుచప్పుళ్లతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కరెంటు ఉండదని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌ను ప్రవేశపెట్టింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనన్నారు. ఇక్కడి రైతాంగం కోసం ఆనాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డిని మాల్యాల గ్రామానికి తీసుకొచ్చి సాగు జలాల కోసం రూ.1737 కోట్లు మంజూరు చేయించినట్లు గుర్తు చేశారు. మన ప్రాంతంలోని పత్తి రైతుల కోసం ప్రైవేటు కంపెనీలతో మాట్లాడి సబ్సిడీ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనన్నారు. గిరిజనులను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని, పోడుపట్టాలు కూడా ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. మహిళలను లక్షాధికారులను చేయడానికి పావలా వడ్డీకి రుణాలు ఇచ్చారన్నారు. అధికార బీఆర్‌ఎస్‌ తిమ్మిది సంవత్సరాల పాలనలో మహిళలకు చేసింది ఏమీ లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండని, వచ్చే ఐదు సంవత్సరాలు మీ కోసం సేవ చేస్తాని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు మహాలక్ష్మీ పథకం ద్వారా ప్రతీ నెల రూ.2,500, రూ.500 గ్యాస్‌ సిలిండర్‌, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, గృహజ్యోతి పథకం ద్వారా ప్రతీ కుటుంబానికి 2500 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తామన్నారు. రైతు భరోసా పథకం ద్వారా ఏటా రైతులు, కౌలు రైతులకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేలు, వరికి రూ.500 బోనస్‌ ఇస్తామన్నారు. ఇల్లు లేని ప్రతీ ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆయా గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నాగం కుమార్‌, పార్టీ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి, నాయకులు ధర్మపురి శ్రీనివాస్‌, భీమరాజు కనకరాజు, మ్యాకల గణేష్‌, బాణాల రవీందర్‌ రెడ్డి, ఐతం దేవేంద్ర-వెంకటేశం, పొద్దుపొడుపు లింగారెడ్డి, ముస్కు ముకుంద రెడ్డి, అంచ రాంరెడ్డి, ముస్కు పద్మ, దూది శ్రీనివాసరెడ్డి, వేల్పుల దేవస్వామి, పులి సత్తయ్య, బాలకృష్ణ, ప్రభాకర్‌, శ్రీహరి రెడ్డి, శ్రీనివాస్‌, శ్రావణ్‌, ఏసుదాసు, హనుమంత రెడ్డి, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫ్లకార్డులకే పరిమితమైన నీళ్లు, నిధులు, నియామకాలు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించి దాదాపు పదేళ్లు గడుస్తున్నా నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదం ఫ్లకార్డులకు మాత్రమే పరిమితమైందని వేములవాడ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం వేములవాడలోని పార్టీ ఎన్నికల కార్యాలయంలో నిర్వహించిన ప్రైవేటు టీచర్స్‌ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో నిరుద్యోగం రోజురోజుకు పెరిగిపోతుండగా ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు దక్కాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పోరాటం చేసిన విద్యార్థులు, నిరుద్యోగులు నోటిఫికేషన్లు రాక చనిపోతుంటే సీఎం కేసీఆర్‌ రాక్షసానందం పొందుతున్నారని, ఉద్యమంలో ఎక్కడా కనిపించని కేటీఆర్‌, కవిత, హరీష్‌ రావు, సంతోష్‌ రావుకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయే తప్ప సామాన్యులకు దక్కలేదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత తల్లిదండ్రులకు భారం కాలేక, సమాజంలో తలెత్తుకొని తిరగలేక ప్రాణాలు తీసుకుంటున్నా తెలంగాణ పాలకులు దున్నపోతుపై వానపడినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2008లో జంబో డీఎస్సీతో 54వేల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని ఆది శ్రీనివాస్‌ గుర్తు చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం ఉద్యోగ నియమాకాలను చేపడతామన్నారు. నాలుగు సార్లు ఓడిన బీసీ బిడ్డగా తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని, హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఆది శ్రీనివాస్‌ అభ్యర్థించారు. ప్రైవేటు పాఠశాలల నిర్వా హకులు, ప్రైవేటు ఉపాధ్యాయులు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

చందుర్తి: మండలంలోని బండపల్లిలో కాంగ్రెస్‌ నాయకులు ఆదివారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వేములవాడ నియోజ కవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌ చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలంటూ ఇంటింటి ప్రచారం చేపట్టారు. మాజీ ఎంపీటీసీ ముస్కు పద్మ మల్లారెడ్డి, మాజీ సర్పంచ్‌ కటకం మల్లేశం, నాయకులు ఏనుగుల లచ్చిరెడ్డి, న్యాత దాసు, ఎండీ అజీమ్‌, కటకం చంద్రయ్య, కటకం సంజీవ్‌, తీపిరెడ్డి కరుణాకర్‌, గోపి, కరుణాకర్‌, కటకం కనకరాజు, కటకం రాజేష్‌, మహిళలు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-19T23:54:25+05:30 IST