గంజాయి రవాణా ముఠా గుట్టురట్టు

ABN , First Publish Date - 2023-02-07T00:45:28+05:30 IST

కరీంనగర్‌లో కొంత కాలంగా గంజాయిని అమ్ముతున్న ముఠాకు చెందిన ఏడుగురిని కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌, సివిల్‌ పోలీసులు అరెస్టు చేశారు.

గంజాయి రవాణా ముఠా గుట్టురట్టు
సమావేశంలో మాట్లాడుతున్న సీపీ సుబ్బారాయుడు

కరీంనగర్‌ క్రైం, ఫిబ్రవరి 6: కరీంనగర్‌లో కొంత కాలంగా గంజాయిని అమ్ముతున్న ముఠాకు చెందిన ఏడుగురిని కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌, సివిల్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్‌ కమిషనర్‌ ఎల్‌ సుబ్బారాయుడు సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఏడుగురు సభ్యుల ముఠా కరీంనగర్‌లో నివాసం ఉంటూ గంజాయికి అలవాటుపడ్డారు. జల్సాలు చేస్తూ డబ్బుల కోసం గంజాయిని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుబ్బారావు వద్ద నుంచి తీసుకువచ్చి కరీంనగర్‌లో అమ్ముతున్నారు. 20 కిలోల గంజాయిని తీసుకువచ్చిన ఈ ముఠా రెండు బృందాలుగా విడిపోయి కరీంనగర్‌, పరిసర ప్రాంతాల్లోని యువత, విద్యార్థులకు 17 కిలోలు విక్రయించారు. మిగతా మూడు కిలోల గంజాయిని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా సోమవారం కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌, సివిల్‌ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలం రేగులపల్లి(ప్రస్తుతం కరీంనగర్‌ ఆదర్శనగర్‌)కి చెందిన నిశాని హరికృష్ణ(27), నేపాల్‌ నుంచి వచ్చి కిసాన్‌నగర్‌లో నివాసం ఉంటున్న బహదూర్‌ లక్ష్మణ్‌ (19), ఎలగందులకు చెందిన నిషాని సాయికృష్ణ (22), బావుపేటకు చెందిన దూలం అభిరాం (19), సుభాష్‌నగర్‌కు చెందిన ఎండీ అలీ అలియాస్‌ సోను (26), సరస్వతినగర్‌లో ఉంటున్న మంచిర్యాలకు చెందిన గంప గోవర్ధన్‌(24) కిసాన్‌నగర్‌కు చెందిన చెల్పూరి విలాస్‌(22)ను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి మూడు కిలోల గంజాయిని, రెండు ద్విచక్రవాహనాలు, ఏడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు ముఠాలకు చెందిన నిందితులపై కరీంనగర్‌ మూడో ఠాణా, కొత్తపల్లి పోలీసు ఠాణాలలో కేసులు నమోదు చేశారు. ఏడాది కాలంగా కమిషనరేట్‌ పరిధిలో 33.91 కిలోల నిషేధిత గంజయిని పట్టుకుని జైలుకు తరలించామని సీపీ తెలిపారు. 22 కేసుల్లో 52 మందిని అరెస్టు చేశామన్నారు. సమావేశంలో టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ జే విజయసారధి, ఎస్‌బీఐ జి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. గంజాయి ముఠాను పట్టుకోవటంలో కీలకంగా పనిచేసిన పోలీసు అధికారులను సీపీ అభినందించారు.

గంజాయి రహిత కరీంనగర్‌గా తీర్చిదిద్దుతాం..

గంజాయి రహిత కరీంనగర్‌ లక్ష్యంగా ముందుకుసాగుతూ, విక్రయదారులపై ఉక్కుపాదం మోపుతామని పోలీస్‌కమిషనర్‌ ఎల్‌ సుబ్బారాయుడు అన్నారు. ఆయన సోమవారం కమిషనరేట్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గంజాయి రహిత కరీంనగర్‌ ఏర్పాటులో మీడియా, ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలు, అన్నివర్గాలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గంజాయి, మాదకద్రవ్యాల వినియోగంతో యువత నిర్వీర్యమై భవిష్యత్‌ను తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కరీంనగర్‌లో గంజాయి విక్రయదారులు, సేవించేవారు పోలీసు ఠాణాలవారిగా 53 మంది వివరాలతో కూడిన జాబితాను ఇప్పటికే తయారు చేశామన్నారు. త్వరలో వారికి కుటుంబ సభ్యుల సమక్షంలో సైకాలజిస్ట్‌, సామాజిక వేత్త, డాక్టర్లతో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు. ఆ తరువాత కూడా ఎవరైనా గంజాయిని సేవించినా, విక్రయించినా పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు. ఇప్పటి వరకు గంజాయి కేసులో నిందితులైన ఎనిమిది మందిపై పీడీ యాక్ట్‌ అమలు చేశామన్నారు. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి కరీంనగర్‌కు గంజాయిని సరఫరా చేస్తున్న వ్యక్తుల వివరాలు కూడా సేకరించి, వారిపై నిఘా పెట్టామన్నారు. గంజాయి, ఇతర మత్తుపదార్థాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందించాలని ప్రజలను కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలు, చిన్నారుల హక్కులకు భంగం కలుగకుండా అన్ని రకాల రక్షణ కల్పిస్తామన్నారు. కరీంనగర్‌లో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు విస్తృతంగా అవగాన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. సైబర్‌ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఓటీపీ చెప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్మార్ట్‌ సిటీ పనులు పూర్తి అయితే సీసీ కెమెరాలు, సిగ్నల్స్‌ను పూర్తిస్థాయిలో వినియోగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అర్ధరాత్రి బైక్‌ రేస్‌లు, మైనర్లు వాహనాలు నడపడాన్ని నియంత్రిస్తామన్నారు.

Updated Date - 2023-02-07T00:46:12+05:30 IST