రోగులు ఫుల్‌.. వైద్యులు నిల్‌

ABN , First Publish Date - 2023-03-31T00:59:12+05:30 IST

గోదావరిఖ నిలోని వంద పడకల ఆసుపత్రి నుంచి జనరల్‌ ఆసుపత్రిగా మారినా రోగులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు.

రోగులు ఫుల్‌.. వైద్యులు నిల్‌

కళ్యాణ్‌నగర్‌, మార్చి 30: గోదావరిఖ నిలోని వంద పడకల ఆసుపత్రి నుంచి జనరల్‌ ఆసుపత్రిగా మారినా రోగులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. నిత్యం వైద్యం కోసం 1000నుంచి 1500 మంది గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి వస్తున్నా సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రిలో పర్యవేక్షణలోపం రోగులకు శాపంగా మారింది. కేవలం ప్రసూతి కోసమే ముద్రపడ్డ ఆసుపత్రి ఇతర ఆపరేషన్లు చేయడంలో ముందుకు వెళ్లడం లేదు. రామగుండం మెడికల్‌ కళాశాల ప్రారంభమైన తరువాత గోదావరిఖని వంద పడకల ఆసుపత్రి 345పకడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ అయినా పరిస్థితి మారడం లేదు. ఆసుపత్రిలో సరైన మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం లేకపోవడంతో రోగులు, వారి అటెండర్లు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. వార్డుల్లో సరైన విద్యుత్‌ లైటింగ్‌, ఫ్యాన్లు తిరగకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని సూపరింటెండెంట్‌ దృష్టికి తీసు కెళ్లినా మరమ్మతులు జరుగడం లేదు. ఇటీవల లక్ష్మి అనే మహిళకు గర్భసంచిలో గడ్డలు కాగా తీవ్ర రక్తస్రావంతో ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. ఆపరేషన్‌ చే స్తామని ఆ మహిళను నెలరోజుల పాటు ఆసుపత్రి చుట్టూ తిప్పించుకుని చివరికి వైద్యులు చేతులెత్తేశారు. దీంతో ఆమె గోదావరిఖనిలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఆపరేషన్‌ చేయించుకుంది. ఆదివారం కేసీ ఆర్‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా, మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచేందుకు వస్తే అక్కడ సిబ్బంది లేకపోవడం, బంధువులే మృతదేహాన్ని ఆరుబయట పెట్టి గంట పాటు మార్చురీ తాళం కోసం తిరిగిన దుస్థితి నెలకొన్నది. చివరికి బంధువులే తాళం తీసువచ్చి మార్చురీలో మృతదేహాన్ని భధ్రపరుచుకున్నారు. ఉదయం 9 గం టల నుంచి 12గంటల వరకు మాత్రమే ఓపీని చూస్తూ వైద్యులు వెళ్లిపోతున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి వేళలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఎమర్జెన్సీ కేసులు చూసే వారు లేకుం డాపోయారు. దీంతో వైద్యం లభించకప ప్రథమ చికిత్స చేసి కరీంనగర్‌ ఆసుపత్రికి రెఫర్‌ చేస్తున్నారు. మెడికల్‌ కళాశాల ప్రారంభమై దాదాపు ఏడాది కావస్తున్నా రోగులకు మాత్రం ఎలాంటి వైద్య సేవలు అందడం లేదు.

పర్యవేక్షణ లోపం..

ఆసుపత్రిలో 17మంది ప్రొఫెసర్లు, ఐదుగురు అసి స్టెంట్‌ ప్రొఫెసర్లు, 10మంది రెసిడెంట్‌ డాక్టర్లు, నలుగురు ఆర్‌ఎంఓలు ఉన్నా ఆసుపత్రిని పర్యవేక్షించడం లో లోపాలు తలెత్తుతున్నాయి. అత్యవసర కేసులు, ఆపరేషన్ల నిర్వహణ చేయాల్సిన ప్రొఫెసర్లు పత్తా లేకుండా పోయారు. ఆయా విభాగాలకు అధిపతులుగా ఉన్న ప్రొఫెసర్లు ఒక్క రోజు కూడా సీట్లో కూర్చొని రోగులను పర్యవేక్షించిన దాఖలాలు లేవు. ముఖ్య అధికారి ఉన్నప్పుడే హడావిడి చేసి ఆన్‌లైన్‌లో హాజరు నమోదు చేసుకుని వెళ్లిపోతున్నారు. అత్యవసర కేసు లు, ఆపరేషన్లు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంత మంది ప్రొఫెసర్లు విధులకు హాజరు కాకుండా డేటా ఎంట్రీ ద్వారా హాజరు నమోదు చేసుకుంటున్నారు.

జూనియర్‌ డాక్టర్లే దిక్కు..

ఆసుపత్రిలో జనరల్‌ ఆపరేషన్లు, ఆర్థో కేసులను జూనియర్‌ డాక్టర్లే చేస్తున్నారు. వాస్తవానికి ప్రొఫెసర్ల పర్యవేక్షణలో ఆపరేషన్లు చేయాల్సి ఉండగా, వారు రాకపోవడంతో జూనియర్‌ డాక్టర్లే ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. మూడు నెలల క్రితం అన్నపూర్ణ కాలనీకి చెందిన ఒక వృద్ధురాలి కాలు విరగడంతో ఆమెను ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకెళ్లి సగం ఆపరేషన్‌ అయి న తరువాత కాలు ఎముక సరిగ్గా అతక్కుపోవడంతో ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి బయటకు తీసుకువచ్చా రు. మరుసటి రోజు ప్రొఫెసర్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఇలా చాలా మందికి ఆపరేషన్లు నిర్వహించకపోవడంతో ప్రైవేట్‌ ఆసుపత్రిలో శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్నారు.

ముఖ్య అధికారి వచ్చినప్పుడే..

రామగుండం మెడికల్‌ కళాశాల ముఖ్య అధికారి పక్షం రోజులు హైదరాబాద్‌లోనే గడుపుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. డీఎంఈ కార్యాలయంలో పనులు ఉన్నాయంటూ వెళ్లడంతో ఇక్కడ మెడికల్‌ కళాశాలను గాలికి వదిలేశారు. ముఖ్య అధికారి వస్తున్నప్పుడే ప్రొఫెసర్లు వచ్చి నాలుగు సమీక్ష సమావేశాలను జరిపి ఆ ఫోటోలను డీఎంఈ కార్యాలయం పంపించుకుంటున్నారు. ముఖ్య అధికారి సహకారంతోనే ప్రొఫెసర్లు హాజరు వేయించుకుంటున్నారని, ఓ డాటా ఎంట్రీ ద్వారా హాజరు వేయించుకుంటూ వ్యవహారాన్ని చక్కదిక్కుంటున్నారే ఆరోపణలున్నాయి. జనరల్‌ ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌ పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఆసుపత్రిలోని పలు విభాగాలను చక్కదిద్దాల్సిన సూపరింటెండెంట్‌ వ్యవహారాలన్నీ పట్టించుకోకపోవడంతో ముఖ్య అధికారే బాధ్యత తీసుకున్నట్టు తెలుస్తున్నది.

ఆసుపత్రిలో లభించని సేవలు..

- సిగిరి రాము, వీహెచ్‌ఆర్‌ ఫౌండేషన్‌ సభ్యుడు

ప్రభుత్వాస్పత్రిలో రోగులకు సరైన సేవలు లభిం చడం లేవని, ఆదివారం, సెలవు దినాలు వస్తే వైద్యులు ఉండడం లేదు. మధ్యాహ్నం వరకే ఓపీ చూస్తూ వైద్యులు వెళ్లిపోతున్నారు. దీంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్చురీ వద్ద ఫ్రీజర్లు పని చేయడం లేదు. కనీసం లైట్లు కూడా వెలగడం లేదు. మృతుల బంధువులే మృతదేహాలకు కాపలా ఉండాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. ఎంత మంది వైద్యులకు ఫోన్లుచేసినా స్పందన లేదు. ప్రభుత్వాసుపత్రిలో పని చేస్తున్న సిబ్బంది కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-03-31T00:59:12+05:30 IST