‘రేషన్‌’పై బలవర్ధక బియ్యం

ABN , First Publish Date - 2023-04-01T00:44:30+05:30 IST

ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం పలు చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వ్యాధులకు ప్రధాన కారణమవుతున్న పోషకాహార లోపాన్ని తీర్చేందుకు నడుం కట్టింది. ప్రజలు తినే ఆహారంలో పోషకాహార లోపాన్ని సరిచేయందే ఎన్ని వైద్య సౌకర్యాలు కల్పించినా ఫలితం లేదని భావించి పోషకాలతో కూడిన బలవర్ధక బియ్యాన్ని రేషన్‌గా సరఫరా చేయాలని నిర్ణయించింది.

‘రేషన్‌’పై బలవర్ధక బియ్యం

- ఈనెల నుంచి పంపిణీకి సన్నద్ధం

- ఏడాదికి సరిపడా బియ్యం నిల్వలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం పలు చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వ్యాధులకు ప్రధాన కారణమవుతున్న పోషకాహార లోపాన్ని తీర్చేందుకు నడుం కట్టింది. ప్రజలు తినే ఆహారంలో పోషకాహార లోపాన్ని సరిచేయందే ఎన్ని వైద్య సౌకర్యాలు కల్పించినా ఫలితం లేదని భావించి పోషకాలతో కూడిన బలవర్ధక బియ్యాన్ని రేషన్‌గా సరఫరా చేయాలని నిర్ణయించింది. తొలుత రాష్ట్రంలో నాలుగు జిల్లాలను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకొని బలవర్థక బియ్యాన్ని సరఫరా చేసిన ప్రభుత్వం వాటిని 11 జిల్లాలకు విస్తరించాలని నిర్ణయించింది. పైలట్‌ ప్రాజెక్టులకు బలవర్థక బియ్యాన్ని సరఫరా చేయడంలో ముందు వరుసలో ఉన్న కరీంనగర్‌ జిల్లాలో కూడా ప్రస్తుతం ఆ బియ్యాన్ని సరఫరా చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్‌ నెల రేషన్‌ కోటాగా బలవర్ధక బియ్యాన్ని సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఏడు మిల్లుల్లో తయారీ

జిల్లాలో బాయిల్డ్‌, రా రైస్‌ మిల్లులు కలిసి 169 మిల్లులు ఉన్నాయి. వీటిలో ఏడింటిలో పోషకాహార బియ్యాన్ని తయారు చేస్తున్నారు. ఈ ఏడు రైసు మిల్లుల్లో శిక్షణ పొందిన సిబ్బంది సాధారణ బియ్యంలో విటమిన్లను కలుపుతూ బలవర్ధక బియ్యాన్ని శాస్త్రీయ పద్దతిలో రోజుకు 100 టన్నుల చొప్పున తయారు చేస్తున్నారు. ల్యాబ్‌లో వాటిని పరిశీలించి ఏడాదికి సరిపడా బలవర్ధక బియ్యం నిల్వ చేశారు. జిల్లాలోని ఏడు మిల్లుల్లో కోట్ల రూపాయల విలువ చేసే బ్లెండెడ్‌ యంత్రాలను బిగించుకొని పోషకాహారాన్ని తయారు చేస్తున్నాయి. తిమ్మాపూర్‌, చొప్పదండి మండలాల్లోని రైసుమిల్లుల్లో క్వింటాల్‌ బియ్యానికి కిలో పోషకాల బియ్యం కెర్నెల్‌ను కలుపుతున్నారు. ఇందులో ఐరన్‌ 28 మిల్లీ గ్రాములు నుంచి 42.5 మిల్లీగ్రాములు, సోడియం ఐరన్‌ 14 నుంచి 21.25 మిల్లీగ్రాములు, మధ్య ఉంటే ఫొలిక్‌ యాసిడ్‌ 75 మైక్రో గ్రాము నుంచి 125 మైక్రో గ్రాముల వరకు కలుపుతున్నారు. విటమిన్‌ బి12ను 0.75 మైక్రో గ్రాము నుంచి 1.25 మైక్రో గ్రాము వరకు కలపడం ద్వారా విటమిన్లను అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బియ్యంలో విటమిన్‌ ఏ, బీ1, బీ2, బీ3, బీ6, బీ9, బీ12, డి, ఈ విటమిన్లు ఉంటాయి. ఈ పోషకాలతో కూడిన బియ్యాన్ని తీసుకోవడం ద్వారా అనేక రకాల వ్యాధులను అరికట్టడానికి వీలవుతుంది. బియ్యం సంచులను ఫోర్టిఫైడ్‌ రైస్‌గా గుర్తించేందుకు ఆ సంచులపై ఎఫ్‌ గుర్తు వేస్తారు. ఇలా ప్రత్యేకంగా తయారు చేసిన బలవర్ధక బియ్యాన్ని ల్యాబ్‌లో పరీక్షించి పంపిణీ చేస్తారు.

2,78,443 మందికి పంపిణీ

జిల్లాలో 2,78,411 మంది రేషన్‌కార్డు లబ్దిదారులకు 563 రేషన్‌ దుకాణాల ద్వారా ఏప్రిల్‌ నెల నుంచి బలవర్ధక బియ్యం పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం 4,703 టన్నుల బియ్యం సిద్ధం చేశారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న సాధారణ బియ్యం స్థానంలో ఈ పోషక బియ్యాన్ని పంపిణీ చేయడం ద్వారా బియ్యం పక్కదారి పట్టదని, అందరూ వాటిని వినియోగించే అవకాశాలుంటాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. పైలట్‌ ప్రాజెక్టుల్లో రేషన్‌గా ప్రజలకు బలవరక బియ్యాన్ని సరఫరా చేసిన ప్రభుత్వం ఆ తర్వాత ఐసీడీఎస్‌ కేంద్రాలకు, పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన పథకం అమలుకు, హాస్టళ్లకు కూడా బలవర్ధక బియ్యాన్ని సరఫరా చేసింది. ఈ నెల నుంచి కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాలతోపాటు మంచిర్యాల, నిర్మల్‌, హన్మకొండ, ఖమ్మం, వికారాబాద్‌ జిల్లాలకు కూడా ఆయా జిల్లాల పౌరసరఫరాల శాఖలు బలవర్ధక బియ్యాన్ని రేషన్‌గా పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేశారు.

2024 మార్చి వరకు అన్ని జిల్లాలకు..

- మంత్రి గంగుల కమలాకర్‌

ఏప్రిల్‌ నెల నుంచి 11 జిల్లాల్లో బలవర్ధక బియ్యాన్ని రేషన్‌గా అందిస్తున్న ప్రభుత్వం 2024 మార్చి వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు దీనిని విస్తరింపజేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కోట్ల రూపాయల అదనపు భారం పడుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలోని పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం బలవర్థక బియ్యాన్ని సరఫరా చేసేందుకు నిర్ణయించారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైస్‌ మిల్లుల ద్వారా ఎఫ్‌సీఐకి కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌గా ఇప్పటికే 35 లక్షల మెట్రిక్‌ టన్నుల ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని అందించామని, ప్రజా పంపిణీ అవసరాల కోసం సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ మరో 11 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సేకరించిందని మంత్రి చెప్పారు.

Updated Date - 2023-04-01T00:44:30+05:30 IST