Share News

ఐదేళ్లుగా ఆ గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన

ABN , Publish Date - Dec 30 , 2023 | 12:49 AM

గత ప్రభుత్వ తప్పిదం వల్ల పెద్దపల్లి జిల్లాలోని ఆ నాలుగు గ్రామాల్లో ఐదేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది. పాలక వర్గాల గడువు ముగియ వస్తుండడంతో ఈసారైనా ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

ఐదేళ్లుగా ఆ గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన
అంతర్గాం మండలం కుందనపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం

- గత ప్రభుత్వ తప్పిదం.. అక్కడి ప్రజలకు శాపం

- మున్సిపల్‌ కార్పొరేషన్‌లో విలీనం చేసి తొలగింపు

- ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా మారిన రిజర్వేషన్లు

- చట్ట సవరణ చేసి ఎన్నికలు నిర్వహించాలి

పెద్దపల్లి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ తప్పిదం వల్ల పెద్దపల్లి జిల్లాలోని ఆ నాలుగు గ్రామాల్లో ఐదేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది. పాలక వర్గాల గడువు ముగియ వస్తుండడంతో ఈసారైనా ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఆ గ్రామాలకు ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల అభివృద్ధి పరంగా వెనుకబడి ఉన్నాయి. 2018లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పంచాయతీరాజ్‌ చట్టాన్ని తీసుకవచ్చింది. అందులో భాగంగా ప్రతి లంబాడి తండాను పంచాయతీ చేయాలని, 500 మంది జనాభా ఉన్న అన్ని గ్రామాలను పంచాయతీలుగా చేయాలని ప్రభుత్వం పేర్కొంది. అలాగే కొత్త మున్సిపాలిటీలను కూడా ఏర్పాటు చేయడంతో పాటు అప్పటికే ఉన్న పాత మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో కొన్ని గ్రామాలను విలీనం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అంతర్గాం మండలంలోని కుందనపల్లి, లింగాపూర్‌, రామగిరి మండలం వెంకట్రావుపల్లి, రామగుండం మండలం ఎల్కలపల్లి పంచాయతీ పరిధిలోని 2 వార్డులను విలీనం చేశారు. కుందనపల్లి, లింగాపూర్‌, వెంకట్రావుపల్లి గ్రామాల ప్రజలు తమ గ్రామాలను కార్పొరేషన్‌లో విలీనం చేయవద్దని, ఉపాధిహామీ పనులు దక్కవని, పన్నుల భారం పడుతుందని ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత 2019 జనవరిలో ఎన్నికలు నిర్వహించారు. విలీన గ్రామాలు పోను మిగిలిన పంచాయతీలకు 2019 జనవరిలో మూడు విడతలుగా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది. ఈ ఎన్నికలు అయిన తర్వాత ఆయా గ్రామాల ప్రజలు తమ ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేయడంతో రామగుండం కార్పొరేషన్‌లో విలీనం చేసిన కుందనపల్లి, లింగాపూర్‌, వెంకట్రావుపల్లి, ఎల్కలపల్లి గేట్‌ పరిధిలోని రెండు వార్డులను తొలగించి 2020లో కార్పొరేషన్‌ ఎన్నికలను నిర్వహించారు. ఈ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించారు. పక్క గ్రామాల పంచాయతీల కార్యదర్శులకు అదనపు బాధ్యతలను అప్పగించి ఎంపీవోలను ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఈ పంచాయతీలకు మధ్యంతరంగా ఎన్నికలు నిర్వహించేందుకు రిజర్వేషన్లు అడ్డంకిగా మారాయి. నూతన పంచాయతీరాజ్‌ చట్టంలో సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాల రిజర్వేషన్లను పదేళ్లకోసారి రొటేషన్‌ పద్ధతిలో మార్చాలని పేర్కొన్నారు. గతంలో ఐదేళ్లకోసారి రొటేషన్‌ విధానం ఉండేది. 2022 ఫిబ్రవరిలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ఖర్చులు సమర్పించక డిస్‌క్వాలిఫై అయిన వార్డు సభ్యుల స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా కుందనపల్లి, లింగాపూర్‌, వెంకట్రావుపల్లి పంచాయతీలతో పాటు ఎల్కలపల్లి గేట్‌ పరిధిలోని 2 వార్డులను విభజించి దానిని ఒక పంచాయతీగా గుర్తించారు. ఉప ఎన్నికల్లో భాగంగా ఈ నాలుగు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. సర్పంచ్‌, వార్డు స్థానాలకు ఏ విధంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలనే విషయమై న్యాయపరమైన చిక్కులు ఏర్పడవచ్చని భావించిన ప్రభుత్వం వాటి జోలికి పోలేదు. అసలు ఖాళీ అయిన వార్డు స్థానాలకు కూడా ఉప ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో ఐదేళ్లుగా ఆ గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తున్నది. కేవలం 15వ ఆర్థిక సంఘం నిధులు, ఎస్‌ఎఫ్‌సీ నిధులతోనే పంచాయతీ నిర్వహణతోపాటు చిన్నచిన్న అభివృద్ధి పనులు చేశారు. పంచాయతీ పాలక వర్గాలు ఉంటే గ్రామ అభివృద్ధి కోసం ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులను, ప్రభుత్వాన్ని కలిసి ప్రత్యేకించి నిధులు మంజూరు చేయించుకునే అవకాశాలు ఉంటాయి. గ్రామంపై కూడా అజమాయిషీ పెరిగి పచ్చదనం, పారిశుధ్య నిర్వహణకు కూడా ఇబ్బందులు ఉండేవి కాదు. కానీ ఆ పంచాయతీలు అంతగా అభివృద్ధికి నోచుకోలేదు. వచ్చే నెలాఖరుతో పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం ముగియవస్తున్నది. పదేళ్లు ఉన్న సర్పంచ్‌, వార్డు సభ్యుల రిజర్వేషన్ల చట్ట సవరణ చేసి తమ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ఆయా గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Updated Date - Dec 30 , 2023 | 12:49 AM