Share News

అభివృద్ధి పనులపై దృష్టి సారించాలి

ABN , Publish Date - Dec 18 , 2023 | 11:48 PM

అభివృద్ధి పనులపై దృష్టి సారించాలి అని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ పేర్కొన్నారు.

అభివృద్ధి పనులపై దృష్టి సారించాలి

కోల్‌సిటీ, డిసెంబరు 18: అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ పేర్కొన్నారు. సోమవారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్‌ బంగి అనీల్‌ కుమార్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. రామగుండాన్ని పదేళ్లుగా పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, అభివృద్ధి పడకేసిందన్నారు. రామగుండం నగరపాలక సంస్థలో ప్రజలకు కనీస సౌకర్యాలు కూడాతీర్చలేని దుస్థితి ఉందని, పారిశుధ్యం పూర్తిగా విఫలమైందన్నారు. అధికారులు ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడాల ని, అభివృద్ధి పనులపై దృష్టి సారించాలన్నారు. అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. నిధులు ఉండి మొదలుకాని పనులపై పరిశీలన జరుపాలని, వెంట నే పనులు మొదలు పెట్టాలన్నారు. లక్ష్మీనగర్‌లోని షాపింగ్‌ కాంప్లెక్స్‌ను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. రామగుండాన్ని వాణిజ్య కేంద్రంగా, పర్యాటక, ఎడ్యుకేష న్‌ సెంటర్‌, మెడికల్‌ హబ్‌గా రూపొందించడమే తన లక్ష్యమన్నారు. డీఎంఎఫ్‌టీ, 14,15 ఆర్థిక సంఘం, పట్టణ ప్రగతి, ఎస్‌సీ, ఎస్‌టీ సబ్‌ప్లాన్‌ పనుల పురోగతిపై నివేదిక సమర్పించాలన్నారు. వాణిజ్య కేంద్రం లక్ష్మీనారాయణ అసంపూర్తిగా ఉన్నపనులను పూర్తి చేయడంలో ప్రాధాన్యమివ్వాలన్నారు. వ్యాపార కేంద్రాల్లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌లైన్లను తొలగించి భూగర్భం నుంచి విద్యుత్‌లైన్లు వేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రామగుండం అభివృద్ధి కి నిధుల అవసరాల గురించి తనకు సమగ్ర నివేదిక ఇవ్వా లని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, జిల్లా మంత్రిశ్రీధర్‌బాబుల సహకారంతో నిధులను తీసుకువస్తానన్నారు. త్వరలో జరుగనున్న సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వ హించాలని ఆదేశించారు. రామగుండం మేయర్‌ విపక్షానికి చెందినవారైనా, ప్రథమ పౌరుడిగా ఆయనకు పూర్తిస్వేచ్ఛనిస్తామని, అభివృద్ధిపై కలిసి పనిచేస్తామన్నారు. ఈ సమావేశంలో కమిషనర్‌ నాగేశ్వర్‌, ఎస్‌ఈ చెన్నారావు, ఎగ్జామినర్‌ షేక్‌ ఖాజా, ఈఈ సుచరణ్‌, డీఈ జమీల్‌, వివిధ శాఖలకు చెందిన అధికారులు అనితసింగ్‌, విన్సెంట్‌రావు, జాఫర్‌, జావిద్‌, కార్పొరేటర్లు మహంకాళి స్వామి, బొంతల రాజేష్‌, కొలిపాక సుజాత పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 11:48 PM