ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజుల దోపిడీ
ABN , First Publish Date - 2023-10-06T00:59:36+05:30 IST
జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామానికి చెందిన ఎ మల్లేశం అనే వ్యక్తికి ఇటీవల తీవ్ర జ్వరం వచ్చింది.
జగిత్యాల, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామానికి చెందిన ఎ మల్లేశం అనే వ్యక్తికి ఇటీవల తీవ్ర జ్వరం వచ్చింది. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ ధర్మపురి రోడ్డు అశోక్ నగర్‌లో ప్రైవేటు నర్సింగ్ హోం నిర్వహిస్తున్న ఓ వైద్యుడిని సంప్రదించాడు. ప్రైవేటు ఆసుపత్రిలోని ల్యాబ్‌లో ప్లేట్ లెట్స్, ఇతర పరీక్షలను వైద్యులు చేయించారు. డెంగీ పరీక్ష చేయకుండానే ప్రిస్కిప్షన్‌లో డెంగీ పాజిటివ్‌గా తేలినట్లు నమోదు చేశారు. దీంతో అనుమానం వచ్చిన సదరు రోగి మరో ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకోగా టైఫాయిడ్‌గా గుర్తించా రు. నిజానికి ఎలిసా టెస్ట్ మిషన్ ద్వారా మాత్రమే డెంగీ నిర్ధారణ చేయాల్సి ఉన్నప్పటికీ ఎక్కడా పాటించడం లేదు. డెంగీ అంటూ భయాందోళనకు గురిచేస్తూ రూ. వేలల్లో మందులు రాయడం, ఫీజులు గుంజడం వంటివి జరపడంతో సదరు రోగి లబోదిబోమంటున్నాడు.
- రాయికల్ మండలం శ్రీరాంనగర్ గ్రామానికి చెందిన జె అనూష అను మహిళ ఇటీవల జగిత్యాల పట్టణంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో డెలివరీకి చేరింది. రక్తం తక్కువగా ఉందంటూ, బిడ్డ అడ్డం తిరిగిందంటూ, డెలివరీ కష్టంగా మారిందంటూ తదితర కారణాలతో మహిళను భయాందోళనకు గురిచేశారు. ఎట్టకేలకు శస్త్ర చికిత్స చేయడంతో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కాగా ల్యాబ్ పరీక్షలు, మందులు, మత్తు డాక్టర్ ఫీజు, ఇతరములు అంటూ ఆసుపత్రి నిర్వాహకులు సుమారు రూ. 35 వేల వరకు గుంజారు. డిశ్చార్జ్ రోజున రూ. 50 వేలు ఆసుపత్రి బిల్ చెల్లించాలంటూ చీటీ అందించారు. కేవలం డెలివరీకి అని చేరితే సుమారు రూ. 85 వేలకు పైగా వ్యయం కావడంతో సంబందిత నిరుపేద మహిళ గొల్లు మంటోంది.
ఇలా ప్రైవేట్ ఆస్పత్రుల్లో సామాన్య ప్రజలు దోపిడీకి గురువుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 300 వరకు ప్రైవేటు ఆసుపత్రులు, మెడికల్ దుకాణాలు, పదుల సంఖ్యలో ల్యాబ్‌లున్నాయి. ఇందులో చాలా ఆసుపత్రులు నిబంధనలు పాటించడం లేదన్న విమర్శలున్నాయి.
- నిబంధనలు పాటించని ల్యాబ్‌లు..
ప్రైవేటు ఆసుపత్రులకు అనుబంధంగా ల్యాబ్‌లు, మెడికల్ షాప్‌లు నిర్వహిస్తున్నారు. అయితే సంబంధిత ల్యాబ్‌ల్లో అర్హత గల ల్యాబ్ టెక్నిషియన్, పాథలజిస్టును, మెడికల్ దుకాణాల్లో అర్హత గల ఫార్మసిస్టులు ఉండడం లేదు. అనర్హత గల వ్యక్తులే ల్యాబ్ పరీక్షలు చేస్తుండడం, మెడికల్ దుకణాల్లో మందులు ఇస్తుండడం వంటివి జరుగుతున్నాయి. ల్యాబ్‌లు, మెడికల్ దుకాణాల్లో విచ్చలవిడిగా ఫీజులు, డబ్బులు గుంజుతున్నారు. తమకు అధిక ఆదాయాన్ని అందించే కొన్ని కంపెనీలకు చెందిన మందులను మాత్రమే ఆసుపత్రి అటాచ్ మెడికల్‌లో విక్రయిస్తున్నారన్న విమర్శలున్నాయి. వైద్యులు సైతం సంబంధిత కంపెనీలకు చెందిన మందులను మాత్రమే చీటిలపై రాస్తున్నారు. ల్యాబ్ పరీక్షల్లో సైతం ఇష్టారీతిగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కాగా డెంగీ జ్వరం ఎలిసాటెస్ట్ ద్వారానే నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇలాంటి పరీక్షలు లేవు. అయినప్పటికీ కొందరు ప్రైవేటు ల్యాబ్ నిర్వాహకులు ఇతర పరీక్షలు చేసి డెంగీ పాజిటివ్ అంటూ నిర్ధారిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
- మంత్రి హరీశ్ హెచ్చరించినా మారని తీరు..
జగిత్యాలలో 2023 జూలై 15వ తేదిన పర్యటించిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పట్టణంలోని మాతా శిశు కేంద్రాన్ని ఆకస్మింగా తనిఖీ చేశారు. తనఖీ సమయంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో పాటు పలువురు వైద్యులు విధుల్లో లేకపోవడం, కనీసం సెలవులు పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు వైద్యులను మందలించడం వంటివి జరిపారు. ఆసుపత్రిలో వైద్యులు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు విధుల్లో ఉండాలని, తనిఖీ సమయంలో విధుల్లో లేని వైద్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, సూపరింటెండెంట్‌లను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని రకాల వైద్య పరికరాలను, వైద్య సదుపాయాలను సమకూర్చిన నేపథ్యంలో వైద్యులు సమయానికి విధుల్లో ఉండి ప్రజలకు సేవలను అందించాలని ఆదేశించారు. అత్యవసర సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోతే పేషంట్లు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తోందని, అలాంటి పరిస్థితులు రాకుండా వైద్యులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అయినప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రిల్లో పనిచేస్తున్న కొందరు వైద్యుల పనితీరులో మార్పు రాకపోవడంపై ప్రజలు అసంతృప్తికి గురవుతున్నారు. జిల్లాలోని జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, ధర్మపురి, రాయికల్ వంటి ప్రాంతాల్లో గల వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు, ఇతర ప్రాంతాల్లో గల పీహెచ్‌సీలు, ఇతర ఆసుపత్రుల్లో పనిచేసే కొందరు వైద్యులు, వైద్యాధికారులు నిర్లక్ష్యం వీడడం లేదన్న ఆరోపణలున్నా యి. వీరి పనితీరు కారణంగా క్రమశిక్షణతో బాధ్యతలు నిర్వహిస్తున్న ఇతర వైద్యులు సైతం ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది.
- పల్లెల్లో ఆర్‌ఎంపీలదే హవా..
జిల్లాలోని పలు పల్లెల్లో ఆర్‌ఎంపీలదే హవా కొనసాగుతోంది. పల్లె ప్రాంతాల్లో జ్వర పీడితులు ఎక్కువగా ఉంటుండడంతో ముందుగా స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. ఆర్‌ఎంపీ, పీఎంపీలు రెండు, మూడు రోజుల పాటు చికిత్స అందిస్తుండగా జ్వరాలు తగ్గని పరిస్థితుల్లో పట్టణాలు, నగరాల్లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్నారు. జిల్లాలోని పట్టణాల్లో గల ప్రైవేటు ఆసుపత్రులల్లో సైతం రోగుల తాకిడి పెరిగింది. రోగుల అవసరాలను ఆసరా చేసుకుంటున్న ప్రైవేటు యాజమాన్యాలు రూ. వేలల్లో ఫీజులు గుంజుతున్నాయి. ఇందులో కొంత మొత్తాన్ని రెఫర్ చేసిన ఆర్‌ఎంపీ, పీఎంపీలకు ప్రైవేటు ఆసుపత్రులు కమిషన్ల రూపంలో చెల్లిస్తున్నాయి. దీంతో రోగుల జేబులు గుల్లా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం జిల్లాలో పర్యటించనున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను పరిష్కరిస్తారన్న ఆశతో నిరుపేద ప్రజలు ఉన్నారు.