ఎన్‌హెచ్-563 విస్తరణకు మోక్షం
ABN , First Publish Date - 2023-07-05T23:41:00+05:30 IST
కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-563) విస్తరణ పనులకు మోక్షం కలిగింది. ఎంపీ బండి సంజయ్ కుమార్ కృషితో ప్రస్తుతం రెండు లైన్లుగా ఉన్న ఈ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించే పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
- ఎంపీ బండి సంజయ్ కృషితో రూ. 2,146 కోట్లతో ఫోర్‌లేన్ పనులకు శ్రీకారం
- 8న ప్రధాని చేతులమీదుగా శంకుస్థాపన
కరీంనగర్, జూలై 5 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-563) విస్తరణ పనులకు మోక్షం కలిగింది. ఎంపీ బండి సంజయ్ కుమార్ కృషితో ప్రస్తుతం రెండు లైన్లుగా ఉన్న ఈ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించే పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 8న వరంగల్‌కు రానున్న నేపథ్యంలో ఆయన చేతులమీదుగా ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారిన ఈ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించడంతో ప్రజల ప్రాణాలకు భద్రత ఏర్పడంతోపాటు వేగంగ గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. కరీంనగర్-వరంగల్ వరకు మొత్తం 68.015 కిలోమీటర్లవరకు నాలుగు లైన్ల విస్తరణ పనులు కొనసాగనున్నాయి. భారతమాల పరియోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం మొత్తం 2,146 కోట్ల అంచనా వ్యయంతో ఈ నాలుగు లైన్లవిస్తరణ పనులు చేపట్టనుంది. దీనికి సంబంధించిన భూ సేకరణ కూడా పూర్తయ్యింది. మొత్తం 325.125 హెక్టార్ల భూమిని సేకరించిన అధికారులు బాధితులకు పరిహారం అందించే ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తికావచ్చింది. కరీంనగర్-వరంగల్ మధ్య మొత్తం 30 గ్రామాలు కవర్ అయ్యేలా ఈ నాలుగు లైన్ల రహదారి విస్తరణ పనులు కొనసాగనున్నాయి. ఈ విస్తరణ పనుల్లో భాగంగా ఐదు బైపాస్ రోడ్లు నిర్మించనున్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీ, సంబంధితశాఖ మంత్రి, ఉన్నతాధికారులను పలుమార్లు కలిసి పనుల మంజూరు కోసం ప్రతిపాదనలు సమర్పించారు. ఈ విషయంలో ఎదురైన సాంకేతిక ఇబ్బందులను అధిగమించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కలిసి భూసేకరణ వేగవంతమయ్యేలా చేశారు. కేంద్రంతో మాట్లాడి నిధులు మంజూరు చేయించారు. నిధులు సహా అన్ని అడ్డంకులు అధిగమించడంతో రహదారి విస్తరణ పనులకు మార్గం సుగమమైంది. కరంనగర్-వరంగల్ ప్రజల చిరకాల వాంఛ నెరవేరనుంది. ప్రధానమంత్రి చేతులమీదుగా కరీంనగర్-వరంగల్ లైన్ విస్తరణ పనులు చేటపట్డం చాలా సంతోంగా ఉందని ఎంపీ బండి సంజయ్‌కుమార్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి, రహదారి విస్తరణ పనులకు సహకరించిన సంబంధిత శాఖ మంత్రి, ఉన్నతాధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.