‘కంటి వెలుగు’కు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2023-01-18T00:26:34+05:30 IST

అంధత్వ రహిత తెలంగాణ దిశగా ప్రభుత్వం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి సర్వం సిద్ధం చేసింది. బుధవారం ఖమ్మంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.

 ‘కంటి వెలుగు’కు సర్వం సిద్ధం
డ్రైరన్‌లో వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

- పరిశీలించిన కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

- జిల్లాకు చేరిన 24 వేల 40 రీడింగ్‌ గ్లాసులు

- నేడు ఖమ్మంలో లాంఛనంగా ప్రారంభం

- రేపటి నుంచి జిల్లాలో శిబిరాలు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

అంధత్వ రహిత తెలంగాణ దిశగా ప్రభుత్వం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి సర్వం సిద్ధం చేసింది. బుధవారం ఖమ్మంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. గురువారం నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మంగళవారం డ్రైరన్‌ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 255 గ్రామ పంచాయతీలు, సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో 21 గ్రామాలు, సిరిసిల్ల మున్సిపాలిటీలో 3 వార్డులు, వేములవాడ మున్సిపాలిటీలో రెండు వార్డుల్లో కంటి వెలుగు ఏర్పాట్లపై డ్రైరన్‌ నిర్వహించారు. కోనరావుపేటలో కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, చందుర్తిలో అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుమన్‌మోహన్‌రావు, ఏర్పాట్లను పరిశీలించారు. మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్లు, కమిషనర్‌లు పర్యవేక్షించారు. కంటి వెలుగు శిబిరాలకు సంబంధించి సర్వ సిద్ధం చేసుకున్నారు. కంటి పరీక్షలకు వచ్చేవారికి ఆహ్వాన పత్రాలు అందించడంతోపాటు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

జిల్లాలో 26 బృందాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసే దిశగా ఏర్పాట్లు పూర్తి చేశారు. వంద రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమంలో 26 బృందాలు పని చేయనున్నాయి. మెడికల్‌ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో అప్తోమెట్రిస్ట్‌, హెల్త్‌ సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ఆశా కార్యకర్తలతో కలిపి పది మందిని బృందంగా ఏర్పాటు చేశారు. కంటి వెలుగులో పాల్గొనే బృందాలకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు శిబిరాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. కంటి వెలుగు కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌, కలెక్టర్‌, ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సీలు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ అధికారులు కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. 18న ముఖ్యమంత్రి ఖమ్మంలో కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తే 19న ఉదయం 9 గంటలకు ప్రజాప్రతినిధులు, అధికారులు జిల్లాలో శిబిరాలను ప్రారంభించనున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన కంటి వెలుగు కిట్‌లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌ ఆరోగ్య కేంద్రాలకు పంపించారు. కిట్లలో టార్చ్‌లైట్‌, టేపు, విజన్‌ చార్ట్‌లు, ట్రయల్‌ లెన్స్‌ల సెట్‌, ఆటో రిప్రాక్టో మీటర్‌, అద్దాలు, కంటి డ్రాప్స్‌, ఆయింట్‌మెంట్‌లు, మూడు రకాల ట్యాబ్లెట్లు అవసరమైన వారికి అందిచే రీడింగ్‌ గ్లాస్‌లు ఉన్నాయి.

జిల్లాలో 4.47 లక్షల మందికి పరీక్షల లక్ష్యం

జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో 4.47 లక్షల మందికి కంటి పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేశారు. 26 శిబిరాల్లో 5 టేబుళ్ల ద్వారా నిర్వహణ జరగనుంది. శస్త్ర చికిత్సకు అవసరమైన వారిని గుర్తించి సిఫార్సు చేస్తారు. రీడింగ్‌ గ్లాసులు, మందులు అవసరమైన వారికి వెంటనే అందించి పంపిస్తారు. దగ్గరి, దూరపు చూపు వారికి 15 రోజుల్లోనే అద్దాలు నేరుగా అందే ఏర్పాట్లు చేశారు. పరీక్షించిన రోజు ఆన్‌లైన్‌లో అద్దాలు తయారు చేసే కేంద్రానికి పంపిస్తారు. పరీక్షకు వచ్చేవారు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డుతోపాటు మోబైల్‌ నంబరు తప్పనిసరిగా తీసుకు రావాలి. ఇప్పటికే జిల్లాకు దగ్గరి చూపు, రీడింగ్‌ గ్లాసులు 24,040 చేరుకున్నాయి. వీటిని అవసరమైన వారికి అందించనున్నారు.

జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు

- కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. 26 బృందాలు పని చేయనున్నాయి. 255 గ్రామ పంచాయతీలు, రెండు మున్సిపాలిటీలో 67 వార్డుల్లో శిబిరాలు కొనసాగనున్నాయి. ఇందుకోసం 21 గ్రామాలు, 5 వార్డులో డ్రై రన్‌ నిర్వహించాం. కంటి వెలుగు శిబిరాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలి.

Updated Date - 2023-01-18T00:26:56+05:30 IST