రాములోరి కల్యాణానికి సర్వసిద్ధం

ABN , First Publish Date - 2023-03-28T00:37:47+05:30 IST

ఇల్లందకుంట మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో ఈ నెల 28నుంచి ఏప్రిల్‌ 9వరకు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

రాములోరి కల్యాణానికి సర్వసిద్ధం
ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం

- ఈ నెల 28నుంచి 9వరకు బ్రహ్మోత్సవాలు

ఇల్లందకుంట, మార్చి 27: ఇల్లందకుంట మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో ఈ నెల 28నుంచి ఏప్రిల్‌ 9వరకు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 30న జరుగునున్న స్వామి కల్యాణోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను మంత్రి గంగుల కమలాకర్‌,సమర్పించనున్నారు. ఇప్పటికే అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లపై పలుమార్లు సమీక్ష నిర్వహించారు. ఈసారి ఉత్సవాలకు లక్షన్నర మంది భక్తులు హాజరవుతారని అంచనా వేసి ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా వైద్య సదుపాయం అందించేందుకు 108, 104వాహనాలను అందుబాటులో ఉంచుతున్నారు. పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఆలయ పరిసరాల్లో 18 సీసీ కెమెరాలు అమర్చారు.

ఆలయ చరిత్ర

ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయ చరిత్ర రామాయణంతో ముడిపడి ఉన్నట్లు పూర్వికులు చెబుతుంటారు. త్రేతా యుగంలో సీతారాములు, లక్ష్మణుడు అరణ్యవాసం చేస్తూ ఇల్లందకుంట ప్రాంతానికి వచ్చి సేదతీరుతున్న సమయంలో ఆయన తండ్రి దశరథుడు మృతి చెందిన విషయం తెలిసింది. దీంతో రాముడు ఈ ప్రాంతంలోని ఇల్లంద వృక్షానికి సంబంధించిన ఇల్లంద పలుకలతో తన తండ్రికి శ్రాద్ధకర్మలు జరిపించారని ఇక్కడి పెద్దలు చెబుతుంటారు. రాముడు ఇల్లంద పలుకలతో శ్రాద్ధకర్మలు జరిపించడంతో ఈ ప్రాంతానికి ఇల్లందకుంట అని పేరు వచ్చింది. ఇల్లందకుంట ఆలయంలో రాముడిని పుట్టు దేవుడిగా అభివర్ణిస్తారు. ఏ ఆలయంలోనైనా దేవుడి ఉత్సవమూర్తులను ప్రతిష్ఠిస్తారు. ఈ ఆలయంలో రాములవారు వెలిశారని ప్రతీతి. ఉత్సవమూర్తులకు పుట్టు మచ్చలు ఉండడం ఇక్కడి ప్రత్యేకత. శ్రీరామ నవమి సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. రాముడే అరణ్యవాసంలో భాగంగా ఇక్కడ 13 రోజులు సేద తీరారు. ఆ సమయంలో పరిసర గ్రామాల్లో సంచరించాడని, అందుకే ఆ గ్రామాలకు లక్ష్మాజీపల్లె, శ్రీరాములపల్లె, సీతంపేట, లక్ష్మన్నపల్లె, రామన్నపల్లె, సిరిసేడు అని పేర్లు వచ్చాయని ఇక్కడి పెద్దలు చెబుతుంటారు.

ప్లాస్టిక్‌ రహిత జాతరకు సహకరించాలి.

- కందుల సుధాకర్‌, ఆలయ ఈవో, ఇల్లందకుంట

సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులు ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించి, క్లాత్‌ కవర్లు వాడాలి. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం.

భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలి

- మంత్రి గంగుల కమలాకర్‌

శ్రీసీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు, జాతర ఏర్పాట్లపై అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేయగా, అర్చకులు శాలువాతో సన్మానించి, ఆశీర్వచనం అందించారు. అనంతరం మంత్రి గంగుల మాట్లాడుతూ ఎండల తీవ్రత దృష్ట భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, తాగునీరు, భోజనం, టాయిలెట్స్‌, శానిటేషన్‌ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. మధ్యాహ్నం 1:30 గంటల లోపు స్వామివారి కల్యాణం పూర్తి చేసి, భక్తులకు అన్నదానం ప్రారంభించాలని సూచించారు. అవసరం మేరకు అదనంగా మంచినీరు సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. జాతర ముగిసే వరకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతిరోజు పర్యవేక్షించాలని ఆదేశించారు. జమ్మికుంట రైస్‌మిలర్ల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా భక్తులకు అన్నదానం చేపడతామని ప్రకటించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు 10 లక్షల రూపాయలు కావాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి మంత్రిని అడగగానే తక్షణమే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశంలో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, సీపీ సుబ్బారాయుడు, జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌, డీసీపీ శ్రీనివాస్‌, ఎంపీపీ సరిగోమ్ముల పావని వెంకటేష్‌, ఆర్డీవో హరిసింగ్‌, ఏసీపీ కోట్ల వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌ కంకణాల శ్రీలత, ఎంపీటీసీ దంసాని విజయ పాల్గొన్నారు.

కలెక్టర్‌, సీపీ ప్రత్యేక పూజలు...

సీతారామచంద్రస్వామి ఆలయంలో కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, సీపీ సుబ్బారాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి ఆశీర్వచనం అందించి, శాలువాతో సన్మానించి, మెమొంటోను అందజేశారు.

బ్రహ్మోత్సవాల వివరాలు

ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.

- 28న స్వామివారి ఉత్సవమూర్తులను గ్రామ దేవాలయం నుంచి ప్రధాన దేవాలయానికి బాహ్యమందిర ప్రవేశం నిర్వహిస్తారు.

- 29న విశ్వక్సేనారాదన పుణ్యహవచనం, రక్షబంధనం, అంకురార్పణ.

- 30న ఉదయం 9 గంటలకు ధ్వజారోహనం, అగ్నిప్రతిష్ట, 10 గంటలకు ఎదుర్కోళ్లు, మధ్యాహ్నం 12 గంటలకు శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవ కార్యక్రమం, రాత్రి 8 గంటల శేషవాహన సేవ.

- 31న పట్టాభిషేక మహోత్సవం, సాయంత్రం 6గంటలకు ప్రభుత్వోత్సవం ప్రారంభం, 7 గంటలకు హంసవాహన సేవ

- ఏప్రిల్‌ 1న రాత్రి 8 గంటలకు గరుడవాహన సేవ

- 2న రాత్రి 8 గంటలకు హన్‌మత్‌ వాహన సేవ

- 3న రాత్రి 8 గంటలకు గజవాహన సేవ

- 4న రాత్రి 8 గంటలకు అశ్వవాహన సేవ (దీపోత్సవం)

- 5న రాత్రి 7 గంటలకు బండ్లు తిరుగుట, సూర్యరథోత్సవం (చిన్న రథం)

- 6న సాయంత్రం 6 గంటలకు స్వామివారి చంద్రరథోత్సవం

- 7న మధ్యాహ్నం 3గంటల వరకు భక్తులకు చంద్రోరథోత్సవంపై స్వామివారి దర్శనం తదుపరి తిరుమాడ వీధుల్లో రథ ఊరేగింపు జరుగును. రాత్రి 7గంటలకు మహాపూర్ణాహుతి, మహాకుంభ సంప్రోక్షణ.

- 8న అష్టోత్తరశత (108) కలశ అభిషేకం, అవబృధ చక్రస్నానం, రాత్రి 7 గంటలకు ద్వాదశారోదన శ్రీపుష్పయాగం (నాఖబలి).

- 9న రాత్రి 7 గంటలకు సప్తవర్ణాలు.. ఏకాంతసేవ, గరుడసేవ

Updated Date - 2023-03-28T00:37:47+05:30 IST