సింగరేణిలో ఎన్నికలకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Dec 26 , 2023 | 01:02 AM
సింగరేణి సంస్థలో ఈనెల 27న ఏడవసారి జరుగుతున్న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధమైంది.
- 11 డివిజన్లలో 84 పోలింగ్ కేంద్రాలు
- 13 కార్మిక సంఘాలు - 39,773 మంది ఓటర్లు
- ముగిసిన ఎన్నికల ప్రచార ఘట్టం
గోదావరిఖని, డిసెంబరు 25: సింగరేణి సంస్థలో ఈనెల 27న ఏడవసారి జరుగుతున్న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. కేంద్ర కార్మికశాఖ ఆధ్వర్యంలో రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. సింగరేణిలోని 11 డివిజన్లలో కార్మికులు ఓటు వేసేందుకు అనుకూలంగా ఉండే విధంగా 84 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 13కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి. ఎన్‌సీడబ్ల్యూఏకు చెందిన 39,773మంది కార్మికులు, ఉద్యోగులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. కార్పొరేటర్ ఏరియాలో నాలుగు పోలింగ్ కేంద్రాలు, సింగరేణి భవన్ హైదరాబాద్‌లో ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కొత్తగూడెం(రుద్రంపుర) ఏరియాలో ఆరు పోలింగ్ కేంద్రాలు, ఇల్లందు ఏరియాలో మూడు పోలింగ్ కేంద్రాలు, మణుగూరు ఏరియాలో ఏడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆర్‌జీ-1లో 11 పోలింగ్ కేంద్రాలు, ఆర్‌జీ-2లో ఆరు, ఆర్‌జీ-3(అడ్రియాల లాంగ్ ప్రాజెక్టు కలిపి)లో ఆరు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. భూపాలపల్లి ఏరియాలో తొమ్మిది పోలింగ్ కేంద్రాలు, బెల్లంపల్లిలో ఐదు, మందమర్రిలో 11, శ్రీరాంపూర్‌లో 15పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలను సాధారణ ఎన్నికల పద్ధతిలోనే నిర్వహిస్తున్నారు. పోలింగ్ సిబ్బందిని, కౌంటింగ్ సిబ్బందిని కోల్‌బెల్ట్ ప్రాంతాలకు ఆరు జిల్లాల కలెక్టర్లు ప్రతిపాదించిన రెవెన్యూ, ఇతర ప్రభుత్వ శాఖల నుంచి నియమిస్తున్నారు. సింగరేణి ఎన్నికలకు నియమించబడిన పోలింగ్ సిబ్బందికి ఈనెల 23న రామగుండం, మందమర్రి, భూపాలపల్లి, కొత్తగూడెం రీజియన్ ప్రాంతాల్లో శిక్షణ తరగతులు కూడా జరిగాయి. ఈ శిక్షణ తరగతులను ఆర్‌డీవోలు, కార్మికశాఖ రీజినల్ కమిషనర్ స్థాయి అధికారులు పర్యవేక్షించారు. ఈ ఎన్నికల పర్యవేక్షణకు ఆయా జిల్లాల కలెక్టర్లు నియమించిన ఆర్‌డీవో స్థాయి అధికారులు, తహసీల్దార్లు, పోలీస్ సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నారు. సింగరేణి యాజమాన్యం ఎన్నికలకు సంబంధించిన అన్ని విభాగాల అధికారులను, సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ అన్ని ఏరియాల్లో ఏర్పాట్లను పూర్తిచేసింది. 27న బుధవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రతి ఓటరు విధిగా తమ గుర్తింపు కార్డును తీసుకురావాల్సి ఉంటుంది. సింగరేణిలో ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు జరిగాయి.
ఫ నాలుగు రోజుల్లోనే ముగిసిన ప్రచారం..
సింగరేణిలో ఎన్నికల ప్రచార ఘట్టం సోమవారం సాయంత్రంతో ముగిసిపోయింది. 13సంఘాలు పోటీ పడుతున్నప్పటికీ ఒకటి రెండు సంఘాలు మినహా మిగతా కార్మిక సంఘాలు ప్రచారంలో కూడా పెద్దగా దృష్టి కేంద్రీకరించలేదు. ఎన్నికలు 27న జరుగుతాయో లేదోననే అనుమానంతో కార్మిక సంఘాలు ఈ ఎన్నికలపై అస్పష్టంగా ఉండిపోయాయి. ఈనెల 21న కోర్టు తుదిగా ఎన్నికలు నిర్వహించాలని తీర్పునివ్వడంతో కార్మిక సంఘాలు ప్రచారానికి సన్నద్ధమయ్యాయి. కానీ నాలుగు రోజుల్లోనే ఎన్నికల ప్రచార సమయం ముగిసిపోయింది. మంగళవారమంతా కార్మికులను ప్రలోభాలకు గురిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం వరకు సింగరేణి ఎన్నికలపై రాజకీయ పార్టీల ఒత్తిడి అంతగా కనిపించలేదు. కానీ ఐఎన్‌టీయూసీని గెలిపించేందుకు ఈ మధ్యనే ఎమ్మెల్యేలుగా గెలిచిన కోల్‌బెల్ట్ ప్రాంతం కాంగ్రెస్ శాసన సభ్యులు కార్యాచరణకు దిగారు. సింగరేణి ప్రాంత మంత్రులు కూడా ఐఎన్‌టీయూసీని గెలిపించే ప్రయత్నాలు, ప్రచారాలు నిర్వహించారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ చేతులెత్తేయడంతో ఆ సంఘానికి సంబంధించిన అగ్రనాయకులు ముగ్గురు రాజీనామాలు చేయడంతో ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీకి భారీ ప్రయోజనం కలిగింది. టీబీజీకేఎస్‌కు చెందిన క్యాడరంతా ఈ యూనియన్లలో ఎక్కువగా చేరికలు జరిగాయి. దీంతో సింగరేణి ఎన్నికల ముఖచిత్రంపై ఈ రెండు సంఘాలే ఇప్పుడు పెద్దగా కనిపిస్తున్నాయి.