కుక్కదాడిలో గాయపడ్డ విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి

ABN , First Publish Date - 2023-03-18T23:28:14+05:30 IST

కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన మహేశ్వరి (13) అనే విద్యార్థిని కుక్కల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందింది.

కుక్కదాడిలో గాయపడ్డ విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి
మహేశ్వరి (ఫైల్‌)

మానకొండూర్‌, మార్చి 18: కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన మహేశ్వరి (13) అనే విద్యార్థిని కుక్కల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందింది. పోచంపల్లి గ్రామానికి చెందిన కోమల్ల రజిత, చిరంజీవి దంపతుల కుమార్తె మహేశ్వరి గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఫిబ్రవరి 8న ఇంటి వద్ద చదువుకుంటున్న సమయంలో ఓ కుక్క మహేశ్వరిపై దాడి చేసింది. తల్లిదండ్రులు వెల్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించారు. రెండు రోజుల తర్వాత మహేశ్వరికి జ్వరం రావడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాదులోని ఓ పైవ్రేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. మహేశ్వరి చికిత్స కోసం 10 లక్షల రూపాయలు ఖర్చయ్యాయని, 40 రోజులు చికిత్స చేయించినా తమ బిడ్డ ప్రాణం దక్కలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఫ వీధి కుక్క దాడిలో బాలుడికి గాయాలు

కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ఎగ్లాస్‌పూర్‌ గ్రామంలో వీధి కుక్క దాడిలో శనివారం నేరెళ్ల విఘ్నేష్‌ (4) అనే బాలుడికి గాయాలయ్యాయి. శనివారం విష్నేష్‌ ఇంటి ముందు ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్క దాడి చేసింది. బాలుడు కేకలు వేయడంతో తల్లిదండ్రులు గమనించి కుక్కను చెదరగొట్టడంతో ప్రమాదం తప్పింది. వెంటనే బాలుడిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు.

Updated Date - 2023-03-18T23:28:14+05:30 IST