సర్కారు బడుల్లో విద్యార్థులు పెరిగేనా?

ABN , First Publish Date - 2023-06-03T01:00:59+05:30 IST

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యేటా వేసవి సెలవుల అనంతరం బడి-బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మన ఊరు...మన బడి, మన బస్తీ.. మన బడి పథకం కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో మెరుగైన మౌలికవసతులను కల్పించడంతోపాటు ఆకర్షణీయ రంగులతో ఆయా పాఠశాలలను ముస్తాబు చేస్తోంది.

సర్కారు బడుల్లో విద్యార్థులు పెరిగేనా?

కరీంనగర్‌ టౌన్‌, జూన్‌ 2: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యేటా వేసవి సెలవుల అనంతరం బడి-బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మన ఊరు...మన బడి, మన బస్తీ.. మన బడి పథకం కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో మెరుగైన మౌలికవసతులను కల్పించడంతోపాటు ఆకర్షణీయ రంగులతో ఆయా పాఠశాలలను ముస్తాబు చేస్తోంది. ఇంగ్లీష్‌ మీడియంలో విద్యా బోధన చేస్తోంది. ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్స్‌, యూనిఫామ్స్‌ అందిస్తోంది. సన్నబియ్యం భోజనంతోపాటు వారంలో మూడు రోజులు కోడిగుడ్లు, ప్రతిరోజు రాగి జావ, కిచిడి, వెజిటెబుల్‌ బిర్యానీతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసేందుకు మెనూను ఖరారు చేసింది. ఇన్ని చేస్తున్నా ప్రభుత్వం అత్యంత కీలకమైన ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయడం లేదు. దీంతో అరకొరగా ఉన్న ఉపాధ్యాయులతో విద్యార్థులు చదువులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఉన్న ఉపాధ్యాయులు పదోన్నతులు, బదిలీలకు నోచుకోలేదు. కొత్తగా నియామకాలను చేపట్టక పోవడంతో ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, జిల్లా విద్యాధికారుల పోస్టులు ఖాళీగా వెక్కిరిస్తున్నాయి. అదనపు భారంతో విధులు సక్రమంగా నిర్వహించలేక పోతున్నామని, నియామకాలు, పదోన్నతులు, బదిలీ ప్రక్రియ చేపట్టాలంటూ ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.

ఫ విద్యా వలంటీర్ల తొలగింపు

2020-21లో కొవిడ్‌ కారణంగా విద్యా వలంటీర్లను తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం తర్వాత వారిని విధుల్లోకి చేర్చుకోలేదు. గత ఏడాది ఆగస్టు వరకు కూడా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందించలేదు. స్కావెంజర్ల కొరతతో పాఠశాలలు అపరిశుభ్రంగా మారాయి. లేక అపరిశుభ్రత వాతావరణంతో కొత్తగా చేరిన విద్యార్థులు కూడా తిరిగి ప్రైవేట్‌ స్కూళ్లకు వెళ్లారని, మౌలిక వసతులతోపాటు ఈసారైనా యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు సకాలంలో అందించాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ, పదోన్నతులు, బదిలీలు, విద్యా వలంటీర్ల నియామకాలపై ఆలోచించక పోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విముఖత వ్యక్తంచేస్తున్నారు. దీనితో ఆశించిన ప్రయోజనం చేకూరడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. నైపుణ్యం కలిగిన సబ్జెక్టు టీచర్లను, ప్రధానోపాధ్యాయులను, మండల, జిల్లా విద్యాశాఖ అధికారుల నియామకం చేపట్టక పోవడంతో ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల నియామకాలపై దృష్టిసారించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కొంతైనా మెరుగుపడే అవకాశాలుంటాయని ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు, విద్యాభిమానులు సూచిస్తున్నారు.

ఫ ‘మన ఊరు.. మన బడి’తో ఆధునిక హంగులు

‘మన ఊరు...మన బడి... మన బస్తీ... మన బడి’ పథకంలో ఎంపికైన పాఠశాలల్లో ఆధునిక హంగులను కల్పిస్తున్నారు. జిల్లాలోని 230 పాఠశాలలను ఆధునీకరించేందుకు ఎంపిక చేసి పనులను ప్రారంభించింది. ఇప్పటి వరకు సగానికిపైగా ఈ స్కూల్స్‌లో ఈ పథకం కింద అదనపు తరగతి గదులు, ప్రహారీగోడ, విద్యుద్దీకరణ, కిచెన్‌ షెడ్లు, మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు, ఆకర్షణీయమైన పేయింటింగ్స్‌ వంటివి చేపడుతున్నారు.

ఫ నేటి నుంచి బడి-బాట:

జూన్‌ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు బడి బాట కార్యక్రమాన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో నిర్వహించాలని విద్యాశాఖ ఉపాధ్యాయులను ఆదేశించింది. ఈ సందర్భంగా విద్యార్థులను చేర్పించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, ప్రభుత్వం నుంచి అందిస్తున్న సహకారం, ప్రయోజనాలను వివరిస్తూ కరపత్రాలను రూపొందించారు.

Updated Date - 2023-06-03T01:00:59+05:30 IST