త్వరలో పోషక బియ్యం పంపిణీ

ABN , First Publish Date - 2023-03-31T00:48:28+05:30 IST

తెలుపు రేషన్‌ కార్డుదారులకు పోషకాలు మిళితం చేసిన బలవర్థక బియ్యం (ఫోర్టిఫైడ్‌ రైస్‌)అందించ డానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

త్వరలో పోషక బియ్యం పంపిణీ

జగిత్యాల, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): తెలుపు రేషన్‌ కార్డుదారులకు పోషకాలు మిళితం చేసిన బలవర్థక బియ్యం (ఫోర్టిఫైడ్‌ రైస్‌)అందించ డానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనికుమార్‌ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. విడతల వారిగా పలు జిల్లాల్లో ఫోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీ చేయనున్నారు. గత 18 నెలలుగా జయశంకర్‌ భూపాలపల్లి, అదిలాబాద్‌, అసిఫాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం నాలుగు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఫోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఏప్రిల్‌, మే నెలల్లో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ బియ్యం పంపిణీ చేయాలని సంకల్పించారు. జగిత్యాల జిల్లాలో మే నెల కోటా కింద ఫోర్టిఫైడ్‌ బియ్యం సరఫరాకు సివిల్‌ సప్లయి శాఖ అధికా రులు ఏర్పాట్లు చేస్తున్నారు.

జిల్లాలో రేషన్‌ కార్డుదారులు

జిల్లాలో ఆహార భద్రత కార్డులు 3,07,619 ఉండగా వీటిలో 8,85,698 మంది సభ్యులున్నారు. వీరికి 5,604.679 క్వింటాళ్ల బియ్యం ప్రతి నెల రేషన్‌ దుకాణాల ద్వారా పౌరసరఫరా శాఖ అందిస్తుంది. జిల్లాలో 2,93,042 ఆహార భద్రత కార్డులు, 14,431 అంత్యోదయ కార్డులు, 146 అన్నపూర్ణ కార్డులున్నాయి. ఆహార భద్రత కార్డు దారులకు ఒక్కరికి 6 కిలోల చొప్పున, అంత్యోదయ కార్డుదారుకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డు దారుకు 10 కిలోల బియ్యం పంపిణీ చేయనున్నారు. మే నెల 5వ తేదీ నుంచి చౌకధరల దుకాణాల ద్వారా ఫోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఫోర్టిఫైడ్‌ బియ్యం అంటే :

ఫోర్టిఫైడ్‌ బియ్యం అంటే పోషకాలతో కూడినది. ఈ బియ్యంలో మూడు అంత్యంతావశ్యక సూక్ష్మ పోషకాలైన ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి-12లు నిర్ధారిత మోతాదులో కలపి ఉంటాయి. ఇవి చూడ డానికి మామూలు బియ్యం మాదిరిగానే ఉంటాయి. మామూలు బియ్యం మాదిరిగానే కడిగి వండుకోవాల్సి ఉంటుంది. పోషక బియ్యం ఎనీమియా (రక్తహీనత), సూక్ష్మ పోషకతత్వాల లోపాల నుంచి కాపాడే అవకాశాలు న్నాయి. దీనికోసం రైస్‌ మిల్లుల్లో బ్లెండెడ్‌ యంత్రాలను సమకూర్చుకున్నారు.

అక్రమ దందాకు అడ్డుకట్ట పడేనా?

గతంలో చౌకధరల దుకాణం నుంచి బియ్యం పొందిన లబ్ధిదారుల్లో చాలా మంది వాటిని వ్యాపారులకు విక్రయించే వారు. కొన్ని చోట్ల లబ్ధిదా రు వేలి ముద్ర నమోదు చేసి రాగానే డీలర్లు బయటికి తరలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరికొన్ని చోట్ల రేషన్‌ దుకాణాల వద్దనే వ్యాపారులు అడ్డాలు ఏర్పాటు చేసుకొని క్వింటాళ్ల కొద్ది బియ్యాన్ని అక్రమంగా తరలించేవారు. ఇందుకు సదరు రేషన్‌ డీలరు దుకాణం దారునికి కొంత గుడ్‌విల్‌ కింద నగదు ముట్టజెపుతారన్న ప్రచారం ఉంది. జిల్లాలో కొంత మంది మిల్లర్లకు, మధ్యవర్తులకు బియ్యం అక్రమ రవాణా ప్రధాన దందాగా మారింది. పలుమార్లు పట్టుబడినా, కేసులు నమోదు అయినా అక్రమ వ్యాపారాన్ని వదలడం లేదు. ఎప్పటికప్పుడు పౌరస రఫరాల శాఖ కింద స్థాయి అధికారులు, రెవెన్యూ, పోలీసు అధికారులతో ఒప్పందం చేసుకొని దందా సాగిస్తున్నారు. ఈ క్రమంలో పోషకాలు మిళితమైన ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని లబ్ధిదారులు పూర్తి స్థాయిలో వినియోగించేకుంటే వారి కుటుంబాలకు పూర్తి స్థాయి పోషకాలతో కూడిన ఆహారం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యంతో పాటు అక్రమ దందాకు అడ్డుకట్ట వేయవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పంపిణీ

- చందన్‌ కుమార్‌, జిల్లా పౌరసరఫరా శాఖ అధికారి

జిల్లాలో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఫోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీ చేస్తాము. ఇప్పటికే ఇందుకు అవసరమైన అవగాహణ, ప్రచార కార్యక్రమాలను నిర్వహించాం. పలు రేషన్‌ దుకాణాల వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నాం. ఏప్రిల్‌లో సాధారణ బియ్యం పంపిణీ చేస్తాము. దాదాపుగా మే నెల నుంచి ఫోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీ నిర్వహించే అవకాశాలున్నాయి.

Updated Date - 2023-03-31T00:48:28+05:30 IST