కాంగ్రెస్ పథకాలపై చర్చ
ABN , First Publish Date - 2023-09-20T01:36:37+05:30 IST
ఇటీవల హైదరాబాద్ తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభ ద్వారా సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది.

- గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ
- ముమ్మరంగా ప్రచారం చేస్తున్న పార్టీ నేతలు
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ఇటీవల హైదరాబాద్ తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభ ద్వారా సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. మరో రెండు మాసాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ విజయతీరాలను చేరేందుకు కర్ణాటక ప్లాన్‌ను అమలుచేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండు పర్యాయాలుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న కొన్ని పథకాలకు కొనసాగింపుగా చేర్పులు, మార్పులు చేయగా, కొన్ని పథకాలను ప్రవేశపెడతామని హామీ ఇస్తూ వస్తున్నది. వరంగల్ సభ ద్వారా రైతు డిక్లరేషన్‌ను కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అధికార బీఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయేనని ప్రజల్లో భావన కలిగించేందుకు ఆ పార్టీ చేసిన ప్రయత్నాలు, కృషి ఫలించింది. కర్నాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన విషయం తెలిసిందే. దాని ప్రభావం రాష్ట్రంపై కూడా పడింది. అధికార బీఆర్‌ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయమని బీజేపీ ప్రకటించినప్పటికీ, ఆ పార్టీ కాస్త వెనక్కి తగ్గడంతో ఆ పార్టీలో జోష్ తగ్గింది. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయేనని ప్రజలను మెప్పించగలుగుతున్నారు. పార్టీలో మరింత జోష్ పెంచడంతో పాటు కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు కీలకమైన సీడబ్ల్యూసీ సమావేశాలను ఈనెల 16,17 తేదీల్లో హైదరాబాద్‌లోనే నిర్వహించడం గమనార్హం. అంతేగాకుండా 17న తుక్కుగూడలో ఒక భారీ బహిరంగసభను నిర్వహించి సోనియాగాంధీ ఆరు గ్యారంటీ పథకాలను ప్రకటించారు. ఆ పథకాలపై జిల్లా ప్రజలు చర్చ జరుపుతున్నారు. జిల్లాలో పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాలు ఉండగా, గత ఎన్నికల్లో మంథనిలో కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి శ్రీధర్‌బాబు గెలుపొందగా, పెద్దపల్లి నుంచి బీఆర్‌ఎస్, రామగుండం నుంచి బీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థి గెలుపొందిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో మూడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసందుకు ఆ పార్టీ నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్దపల్లిలో విజయరమణారావు, మంథనిలో శ్రీధర్‌బాబు, రామగుండంలో రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ ఆరు మాసాల నుంచి గ్రామాలు, పట్టణాల్లో ముమ్మరంగా తిరుగుతున్నారు. గడప గడపకు కాంగ్రెస్ పేరిట విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఫ ఆరు గ్యారంటీ పథకాలివే..
కాంగ్రెస్ ప్రకటించిన మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ప్రతినెలా రూ.2500, రూ.500కే సబ్సిడీపై వంట గ్యాస్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని మొదటి గ్యారంటీ పథకంగా ప్రకటించారు. ఓటర్లలో సగం మంది మహిళలే ఉండడంతో ఈ పథకం పట్ల మహిళల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. వంట గ్యాస్ కొనాలంటే సిలిండర్ రూ.1000 పెట్టాల్సి వస్తున్నది. మొన్నటి వరకు 1200 ఖర్చు చేశారు. 500కే గ్యాస్ ఇస్తామని ప్రకటించడం వల్ల 500 రూపాయలు ఆదా కానున్నాయి. నెలకు రూ.2500, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం ప్రతి కుటుంబానికి నెలకు 3వేలకు పైగా ఆదా కానున్నాయి. రెండో గ్యారంటీ పథకం కింద రైతు భరోసా పథకం ద్వారా బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఏడాదికి ఎకరానికి రూ.1000 ఇస్తుండగా, రూ.15 వేలు ఇస్తామని, కౌలు రైతులు, కూలీ రైతులకు 12వేలు ఇస్తామని భరోసా కల్పించారు. అలాగే వరి పంటకు క్వింటాలుకు రూ.500 బోనస్ కూడా ప్రకటించడం ఆలోచింపజేస్తున్నది. మూడవ గ్యారంటీ పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించారు. నాలుగో గ్యారంటీ పథకం కింద ఇళ్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు ఇస్తామని, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని ప్రకటించారు. ఐదవ గ్యారంటీ పథకం ద్వారా యువ వికాసం పథకం కింద విద్యార్థులకు రూ. 5 లక్షల వరకు ఇస్తామని ప్రకటించారు. ఆరవ గ్యారంటీ పథకం చేయూత ద్వారా ప్రస్తుతం బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫింఛన్‌దారులకు నెలకు 4 వేలు ఇస్తామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ. 10 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తామని ప్రకటించారు. ఈ పథకాల గురించి ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్లాన్ చేశారు. ఇప్పటికే శ్రీధర్‌బాబు, విజయరమణారావు, మక్కాన్ సింగ్‌లు ప్రచారం మొదలుపెట్టారు. సోషల్ మీడియా ద్వారా కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఇంటికి కరపత్రాలు అందించాలని, వాల్ పోస్టర్లను ముద్రించి వాడవాడలా అంటించాలని పార్టీ నాయకులు నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలు జిల్లాలోని ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేస్తాయో వేచిచూడాల్సిందే.