విభిన్న రూపాయ.. వినాయకాయ
ABN , First Publish Date - 2023-09-20T01:34:26+05:30 IST
విఘ్నాలు తొలగించే వినాయకుడు ఊరూరా కొలువుదీరాడు. సోమవారం వినాయక చవితి సందర్భంగా వెలిసిన మండపాల్లో వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చాడు.

- జిల్లా వ్యాప్తంగా కొలువుదీరిన విఘ్నేశ్వరుడు
- ఊరూరా మండపాలు
- వైభవంగా నవరాత్రి ఉత్సవాలు
-జిల్లా వ్యాప్తంగా 5 వేలకు పైగా విగ్రహాల ప్రతిష్ఠ
రూ. 15 కోట్ల పైనే ఖర్చు
- ప్రజాప్రతినిధులు, అధికారుల పూజలు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
విఘ్నాలు తొలగించే వినాయకుడు ఊరూరా కొలువుదీరాడు. సోమవారం వినాయక చవితి సందర్భంగా వెలిసిన మండపాల్లో వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చాడు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రోజుకో తీరున భక్తుల పూజలు అందుకోనున్నాడు. జిల్లా కేంద్రంతో పాటు వేములవాడ, సిరిసిల్ల, ముస్తాబాద్, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, బోయినపల్లి, చందుర్తి, రుద్రంగి, వేములవాడ రూరల్,వేములవాడ అర్భన్, కోనరావుపేట మండలాల్లోని అన్ని గ్రామాల్లో భక్తి శ్రద్ధల మధ్య వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు. వినాయక ప్రతిమలను ప్రతిష్టించి ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. వినాయక విగ్రహాలు విభిన్న రూపాల్లో ఉండగా ప్రకృతి ప్రేమికులు భారీ మట్టి విగ్రహాలను ఏర్పాటు చేశారు. సంజీవయ్యనగర్ వెళ్లే రోడ్డులో ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకులు ఏర్పాటు చేసిన మిల్లెట్ గణేషుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆస్పత్రి నిర్వాహకులు ప్రతీ రోజు చిరు ధాన్యాలతో ప్రసాదాన్ని తయారు చేసి భక్తులకు అందించే ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలో లేబర్ అడ్డా, బీవైనగర్, అశోక్‌నగర్, అంబేద్కర్‌నగర్, బోయవాడ, విద్యానగర్ చౌరస్తా, గోపాల్‌నగర్, సుభాష్‌నగర్, గాంధీనగర్, సుందరయ్యనగర్, ఆటోనగర్, శాంతినగర్, వెంకంపేట, సర్ధార్‌నగర్, ప్రగతినగర్, మెహెర్‌నగర్, జేపీనగర్, రెడ్డివాడ, సిద్ధార్థనగర్, సంజీవయ్యనగర్, భావనారుషినగర్ తదితర ప్రాంతాల్లో భారీ విగ్రహాలను ప్రతిష్టించారు. జిల్లాలో కొన్ని చోట్ల మూడు రోజుల నుంచే నిమజ్జనం చేయడానికి ప్రత్యేక ఏర్పాటు చేశారు.
ప్రత్యేక సెట్టింగ్‌లతో మండపాలు
జిల్లాలో విభిన్నమైన ఆకారాల్లో ఉన్న విగ్రహాలే కాకుండా భారీ సెట్టింగ్‌లను వేశారు. మండపాలను చూడముచ్చటగా తీర్చిదిద్దారు. రాత్రి వేళల్లో విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా కనిపిస్తున్నాయి. భక్తిపాటలతో హోరెత్తిస్తున్నారు. నవరాత్రుల్లో ఉత్సవాలను చూడడానికి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాలు, ప్రసాదాల ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల ఉత్సవాల చందాలు రాసే వారికి లక్కీ డిప్ ద్వారా బహూమతులను అందజేయనున్నారు.
కోట్లలో ఖర్చు
జిల్లాలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో నిర్వాహకులు ఖర్చు పెడుతున్నతీరు కోట్లలోనే కనిపిస్తోంది. కొన్ని చోట్ల విగ్రహాలు రూ.2 లక్షల వరకు ఉండగా మండపం ఏర్పాటు మరో రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు ఉంది. జిల్లాలో 5 వేల ఉత్సవ విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు అంచనా వేశారు. ఉత్సవాల్లో కనీసం రూ.10 నుంచి రూ.15 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. వినాయక విగ్రహాల వద్ద ఏర్పాటు చేసే లడ్డూ వేలం కూడా భారీగానే సాగనుంది. దాదాపు లక్ష వరకు లడ్డూను వేలంలో పొందిన వారు ఉన్నారు.
గణపతికి అనుమతి
జిల్లాలో వినాయక విగ్రహాలు ప్రతిష్టాపన నుంచి నవరాత్రి ఉత్సవాలు ముగిసేవరకు నిర్వాహకులదే బాధ్యతగా పోలీసుల నుంచి అనుమతి పొందాలి. ప్రతీ మండపాన్ని జియో ట్యాగింగ్ ద్వారా పరిశీలిస్తున్నారు. అనుమతి పొందడానికి ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలో నవరాత్రి ఉత్సవాలు సజావుగా జరిగే విధంగా శాంతి కమిటీల సమావేశాలు నిర్వహించి సూచనలు చేశారు. నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా నిఘా ఉంచారు.
దాండియా సందడి
జిల్లాలోని మండపాల వద్ద వినాయకుడిని భక్తితో కొలుస్తూ మహిళలు దాండియా సందడి చేయనున్నారు. ఇందుకోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.