బీజేపీలో విబేధాలు
ABN , First Publish Date - 2023-03-02T01:01:29+05:30 IST
భారతీయ జనతా పార్టీలో విబేధాలు బయటపడ్డాయి. పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఎదుట పార్టీలోని పలువురు సీనియర్ నాయకులు తమ అసంతృప్తి, ఆవేదనను వెళ్లగక్కారు.
(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్)
భారతీయ జనతా పార్టీలో విబేధాలు బయటపడ్డాయి. పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఎదుట పార్టీలోని పలువురు సీనియర్ నాయకులు తమ అసంతృప్తి, ఆవేదనను వెళ్లగక్కారు. ఒకవైపు జిల్లా కేంద్రంలో పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ఇన్‌చార్జి ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ హాజరైనా తమకెవరికీ ఆహ్వానం లేదని, సాక్షాత్తూ మీరే స్వయంగా జిల్లాలో జరిగే కార్యక్రమానికి హాజరైనా రాష్ట్ర అధ్యక్షుడి వర్గానికి చెందిన ఏ ఒక్కరు కూడా హాజరు కాలేదని లక్ష్మణ్‌తో గోడు వెళ్లబోసుకున్నారు. ఇద్దరు సీనియర్ నాయకులు రెండు వేర్వేరు కార్యక్రమాలకు హాజరు కావడం ఇక్కడికి హాజరైన వారు అక్కడికి, అక్కడ హాజరైన వారు ఇక్కడికి హాజరుకాక పోవడం చర్చనీయాంశంగా మారింది. ఒకే పార్టీలో రెండు గ్రూపులుగా, రెండు కార్యక్రమాలు ఒకే రోజు జరుగడం బీజేపీలో గ్రూపు విబేధాలకు అద్దం పడుతున్నది. రాబోయే ఎన్నికల్లో 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి అధికారంలోకి రావాలి అని జాతీయ నాయకత్వం నొక్కి చెబుతున్నా కరీంనగర్ జిల్లాలో మాత్రం ఉన్న మద్దతును కూడా కోల్పోయే విధంగా పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం పార్టీశ్రేణుల్లో బలంగా వ్యక్తమవుతున్నది. పరిస్థితి ఇలాగే కొనసాగితే జిల్లాలో 13 స్థానాలేమో కానీ ఒక్క స్థానం కూడా దక్కించుకునే పరిస్థితి ఉండదని కార్యకర్తలు నేతల ముందు బాహటంగానే వెల్లడిస్తున్నారు. బుధవారం ఉమ్మడి జిల్లా పరిధిలోని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కమ్మర్‌ఖాన్‌పేటలో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యేందుకు వెళ్తూ మార్గమధ్యలో కరీంనగర్‌లో కొద్దిసేపు ఆగిన రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌కు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు కరీంనగర్‌లోని రెస్ట్‌హౌస్‌లో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్‌మోర్చా జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి పి.సుగుణాకర్‌రావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్‌రావు, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కన్నం అంజయ్య, నగర మాజీ అధ్యక్షుడు తాళ్లపల్లి హరికుమార్‌గౌడ్, ఎస్సీసెల్ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి దుర్గం మారుతి, సీనియర్ నాయకులు బేతి మహేందర్‌రెడ్డి, గంటల రమణారెడ్డి, తాడూరి బ్రహ్మం, పి.సుజాతరెడ్డి, జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ, తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన పార్టీ నేతలతో కొద్దిసేపు చర్చించారు. గతంలో తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కొనుగోలు చేసిన జిల్లా పార్టీ కార్యాలయంలో ఆధునికీకరణ పనులు పూర్తయ్యాయా, పార్టీ కార్యాలయం అక్కడే ఉందా అంటూ జిల్లా నాయకులను లక్ష్మణ్ ప్రశ్నించారు. అప్పుడు కొనుగోలు చేసిన పార్టీ కార్యాలయాన్ని అమ్మివేశారని, కొత్తగా పార్టీ కార్యాలయాన్ని ఈరోజు జ్యోతినగర్‌లో ప్రారంభిస్తున్నారని, దశాబ్దకాలంగా ఎంపీ విద్యాసాగర్‌రావు ఉన్నప్పటి నుంచి పార్టీకోసం పనిచేస్తున్న తమకు కనీస సమాచారం ఇవ్వలేదని పలువురు నేతలు లక్ష్మణ్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే పార్టీ కార్యక్రమాలకు తమను ఆహ్వానించడం లేదని, సీనియర్లకు గుర్తింపు ఇవ్వడం లేదని, జిల్లా పార్టీలో ఒకరిద్దరు సీనియర్లకు మాత్రమే అవకాశమిచ్చారని, పార్టీపై అభిమానంతో పనిచేస్తున్న తమను పట్టించుకోవడం లేదని వాపోయారు. పార్టీలో కొత్తగా చేరిన వారికి కూడా ప్రాధాన్యం అంతంత మాత్రమే ఉంటుందని, ఒక వర్గానికే ప్రాధాన్యతనిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్‌లో మాజీ ఎమ్మెల్యే, జిల్లా ఇంచార్జి ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డితోపాటు పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు. అయితే ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ జిల్లా కేంద్రానికి వస్తున్నట్లు పార్టీవర్గాలకు ముందే సమాచారమిచ్చారని ఓ వర్గం చెబుతుంటే మరో వర్గం వారు ఆయన వస్తున్నట్లు సమాచారం లేదంటూ పార్టీ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనడం గమనార్హం. ఒకే రోజు ఒకే పార్టీ రెండు వేర్వేరు కార్యక్రమాలు జరుగగా అక్కడి వారు ఇక్కడ, ఇక్కడి వారు అక్కడికి వెళ్లకపోవడం పార్టీలోని అంతరగ్గత విబేధాలపై పలువురు చర్చించుకుంటున్నారు. ఒకవైపు అధిష్టానం విబేధాలు వీడి రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పోరాటం చేయాలని చెపుతుండగా, జిల్లాలోని బీజేపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.