వేప చెట్లకు ‘డై బ్యాక్’ వ్యాధి
ABN , First Publish Date - 2023-04-01T00:39:02+05:30 IST
ఎన్నో ఔషధ గుణాలు కలిగి, ఎండవేడి నుంచి స్వచ్ఛమైన చల్లని గాలిని అందించే వేప చెట్లు వైరస్ బారిన పడి ఎండిపోతున్నాయి. డై బ్యాక్ అనే వ్యాధి వల్ల జిల్లాలో పెద్దఎత్తున వేపచెట్లు ఎండిపోతున్నాయి.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ఎన్నో ఔషధ గుణాలు కలిగి, ఎండవేడి నుంచి స్వచ్ఛమైన చల్లని గాలిని అందించే వేప చెట్లు వైరస్ బారిన పడి ఎండిపోతున్నాయి. డై బ్యాక్ అనే వ్యాధి వల్ల జిల్లాలో పెద్దఎత్తున వేపచెట్లు ఎండిపోతున్నాయి. ఇటీవల ఉగాది పండుగకు వేప పూత దొరకకపోవడం గమనార్హం. వైరస్ సోకి వేపచెట్లు ఎండిపోతున్నా కూడా ప్రభుత్వపరంగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నెలరోజుల నుంచి వేప చెట్లకు వైరస్ క్రమంగా గాలి ద్వారా వ్యాప్తిచెందుతున్నది. దీంతో జిల్లాలో సగానికి పైగా వేప చెట్లు వైరస్ బారినపడ్డాయి. జనవరి, ఫిబ్రవరిలో ఆకులు రాలిన తర్వాత, మార్చిలో ఆకులు చిగురించిన తర్వాత నుంచే వైరస్ తీవ్రత పెరిగింది. సాధారణంగా ఈ సమయానికి వేప చెట్లు పచ్చని ఆకులతో నిండుగా ఉండి మంచి నీడను ఇస్తాయి. నాలుగేళ్ల క్రితం రాష్ట్రంలోని గద్వాల, వనపర్తి జిల్లాల్లో వేప చెట్లకు ఈ వైరస్ సోకడాన్ని చూశాం. ఇప్పుడు జిల్లాలో చాలావరకు విస్తరించింది. వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్న ప్రకారం.. ఫామాప్సిస్ అజాడిరక్టా అనే ఒక రకమైన ఫంగస్(శిలీంద్రం) వల్ల ‘డై బ్యాక్’ అనే వ్యాధి సంక్రమిస్తుంది. ఈ జబ్బు సోకిన చెట్టు ఆకులు, చిగుళ్లు, కొమ్మల నుంచి ఎండిపోయినట్లుగా ముదురు ఇటుక రంగులో ఉంటూ కిందకు పాకుతుంది. ఇది శిలీంద్రం వల్లే వస్తుందని పేర్కొన్నారు. మస్కిటో డీ బగ్ అనే ఒక రకమైన కీటకం కాటువేసిన చోట, శిలీంద్రం వ్యాపిస్తున్నట్లుగా కనబడుతుంది. ఇంకొన్ని శిలీంద్రాలు కూడా వ్యాపిస్తున్నప్పటికీ, ఫామాప్సిస్ అజాడిరక్టానే కీలకం అని విశ్లేషిస్తున్నారు. ఇది ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు గాలి ద్వారా వ్యాపిస్తున్నది. శిలీంద్ర రేణువులు గాలి ద్వారా వ్యాపిస్తాయి. అలాగే ఒక చెట్టుపై వాలిన కీటకాలు మరో చెట్టుపై వాలినా వస్తున్నది. చెట్టు పెద్దదా, చిన్నదా, వయసుతో సంబంధం లేకుండా వ్యాపిస్తున్నదని నిపుణులు పేర్కొన్నారు. ఈ వ్యాధి వల్ల వేపపూత తగ్గడంతోపాటు కాయ తగ్గుతుందని, ఒక్కోసారి చనిపోయే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది.
ఫ తొలుత ఉత్తరాఖండ్‌లో..
ఈ వ్యాధిని తొలుత 1980లో దేశంలోని ఉత్తరాఖండ్‌లో గుర్తించారు. ఇది అప్పట్లో వర్షాకాలంలో ప్రారంభమై ఆగస్టులో పెరిగి అక్టోబర్, నవంబర్‌లో బాగా ఎక్కువై ఎండలు ప్రారంభం అయ్యాక తగ్గేది. కానీ ప్రస్తుతం జనవరిలో ప్రారంభమై మార్చిలో పతాక స్థాయికి చేరుకోవడం గమనార్హం. అలాగే 2007, 2008లో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, అంనతపురం జిల్లాల్లో, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో బాగా వ్యాపించింది. ఆ తర్వాత 2018, 2019లో వనపర్తి, గద్వాల ప్రాంతాల్లో బాగా వచ్చింది. ఇప్పుడు మళ్లీ విస్తరిస్తోంది. ఈ వ్యాధి ఒకసారి వచ్చిన చెట్టుకు కూడా మళ్లీమళ్లీ సోకే అవకాశం ఉంది. ఈ వ్యాధి సోకిన చెట్లలో ఏడాది, రెండేళ్ల వయసున్న చెట్లు చనిపోయే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటికి వైద్యం చేసి బతికించవచ్చని, పెద్ద చెట్లకు ప్రమాదం కాస్త తక్కువని అంటున్నారు. వేప చెట్టుకు దాదాపు 20నుంచి 25 రకాల జబ్బులు వస్తాయి. కాకపోతే అవి ఎక్కువ ప్రభావం చూపవు. దీంతో వాటిని పెద్దగా పట్టించుకోరు. తాజా శిలీంద్ర వ్యాధి కూడా కేవలం వేప చెట్టుకే వస్తుంది. వ్యాధి సోకిన కొమ్మ విరిచేసిన పుల్లలతో పళ్లు తోముకోవడం వల్ల మనుషులకు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదని చెబుతున్నారు. వైరస్ వల్ల వేప చెట్లు అంతరించిపోయే ప్రమాదం ఉందని వెంటనే ప్రభుత్వం స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
ఫ ఫంగిసైడ్ మందులను పిచికారి చేయాలి
- మనోజ్‌రెడ్డి, వృక్షశాస్త్ర అధ్యాపకుడు, పెద్దపల్లి ప్రభుత్వ కళాశాల
వ్యాధి సోకిన భాగాలపై గోరింటాకు(మైదాకు) పూత పూయడం కానీ, గోరింటాకు నీటిని పిచికారీ చేయడం వల్ల గానీ వైరస్ తగ్గుతుంది. అలాగే మోనోక్రోటోఫాస్, బాబిస్టీన్ అనే ఫంగిసైడ్ క్రిమిసంహారక మందులను పిచికారీ చేయాలి. చిన్న చెట్లు అయితే జబ్బు వచ్చినంత మేర కొమ్మలు కత్తిరించి కాల్చేడం ద్వారా గానీ, జబ్బు వచ్చిన చెట్లకు వీలైనన్నీ నీళ్లు పోయడం ద్వారా గానీ తగ్గించవచ్చు. చెట్టు ఎండిపోయిందని కొట్టేయకూడదని, పెద్ద చెట్లకు పురుగు మందులు పిచికారీ చేసే క్రమంలో ఆ మందు ఇతర చెట్లు, జీవులపై పడి సీతాకోక చిలుకల వంటి కీటకాలు చనిపోయే ప్రమాదం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.