Share News

అభివృద్ధి, సంక్షేమమే అస్త్రాలుగా..

ABN , First Publish Date - 2023-11-10T00:08:31+05:30 IST

తొమ్మిదేళ్ల పాలనలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, అమలుచేసిన సంక్షేమ పథకాలనే ప్రచారాస్త్రాలుగా చేసుకుని బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు ప్రజల్లోకి వెళుతున్నారు.

అభివృద్ధి, సంక్షేమమే అస్త్రాలుగా..

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

తొమ్మిదేళ్ల పాలనలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, అమలుచేసిన సంక్షేమ పథకాలనే ప్రచారాస్త్రాలుగా చేసుకుని బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు ప్రజల్లోకి వెళుతున్నారు. ఇప్పటివరకు గ్రామాలు, పట్టణాల్లో తమ హయాంలో చేసిన అభివృద్ధి పనుల చిట్టా, వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్లు ఎవరు, ఎవరెవరికి ఏమేరకు లబ్ధి చేకూరిందో వివరాలు తీసి వారిని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి పనులపై హామీలు ఇస్తూ, ప్రభుత్వం చేపట్టనున్న సంక్షేమ పథకాలతో ముద్రించిన మేనిఫెస్టో ప్రతులను ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో పెద్దపల్లి, రామగుండం, మంథని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

పెద్దపల్లిలో..

పెద్దపల్లి నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దాసరి మనోహర్‌రెడ్డి మూడోసారి బరిలోకి దిగారు. ఆయన ఈ తొమ్మిదేళ్లలో చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. పెద్దపల్లి, సుల్తానాబాద్‌లను మున్సిపాలిటీలుగా చేశామని, పెద్దపల్లిని జిల్లా కేంద్రం చేసుకున్నామని, మాతా శిశు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, టీడయాగ్నోస్టిక్‌ కేంద్రాన్ని నెలకొల్పామని, పట్టణంలో డివైడర్లు నిర్మించడంతో పాటు రోడ్లను వెడల్పు చేసుకున్నామని, మానేరుపై చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు జరిగాయని, రాయదండి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా పలు గ్రామాల్లోని భూములకు సాగునీటిని ఇచ్చామని చెబుతున్నారు. సంక్షేమ పథకాల ద్వారా వేలాది మందికి ఆసరా పించన్లు, రైతులకు రైతుబంధు, రైతు బీమా ఇచ్చామని, ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, పలువురికి దళిత బంధు, బీసీలకు ఆర్థిక సహాయం వంటి పథకాల ద్వారా, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా అనేక మందికి ఆర్థిక సహాయాన్ని అందించామని చెబుతున్నారు. గ్రామాలు, పట్టణాలు పర్యటిస్తూ అభివృద్ధి, సంక్షేమం గురించి వివరిస్తూ వస్తున్నారు.

రామగుండంలో..

రామగుండం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన కోరుకంటి చందర్‌ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో రామగుండంను అన్ని విధాలా అభివృద్ధి చేశారని, రామగుండంకు మెడికల్‌ కళాశాల తీసుక వచ్చానని, అర్ధంతరంగా నిలిచి పోయిన రామగుండం ఎత్తిపోతల పనులను పూర్తి చేయిస్తున్నామని, మున్సిపల్‌ కార్పొరేషన్‌కు వందల కోట్ల నిధులు తీసుక వచ్చి పట్టణంలో మౌలిక వసతులు కల్పించుకున్నామని చెబుతున్నారు. ఇండస్ట్రీయల్‌ పార్కు, ఐటీ పార్కును ఏర్పాటు చేస్తున్నామని, తదితర అభివృద్ధి పనులను చేస్తున్నామని వివరిస్తున్నారు. అంతేగాకుండా సంక్షేమ పథకాలను నియోజకవర్గంలో ఎంత మందికి అమలు చేశామో, ఇంటింటికి వెళ్లి ఇచ్చిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల గురించి ఓటర్లకు తెలుపుతున్నారు. ఎన్నో ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్‌ఎస్‌తోనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందనుందని, కళ్ల ముందే కనబడుతున్న అభివృద్ధిని చూడాలని, అమలవుతున్న సంక్షేమ పథకాలను చూడాలని ప్రచారం చేస్తున్నారు.

మంథనిలో..

మంథని నుంచి మూడోసారి పోటీ చేస్తున్న పుట్ట మధూకర్‌ 2014 నుంచి 2018 వరకు ఎమ్మెల్యేగా, ఆ తర్వాత జడ్పీ చైర్మన్‌గా మంథని నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి గురించి వివరిస్తున్నారు. కాంగ్రెస్‌ హయాంలో నిలిచి పోయిన రింగ్‌ రోడ్డును పూర్తి చేశామని, కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టామని, బొక్కల వాగును అభివృద్ధి చేశామని, మానేరు నదిపై చెక్‌ డ్యాముల నిర్మాణాలతో పాటు ఖమ్మంపల్లి, ఓడేడు వద్ద వంతెనల నిర్మాణాలు చేపట్టామని, మారుమూల గ్రామాలకు వెళ్లేందుకు రోడ్లు వేయడంతో పాటు కల్వర్టులు, చిన్న చిన్న వంతెనలు నిర్మించుకుని రవాణా సౌకర్యాన్ని మెరుగు పర్చుకున్నామని ప్రచారం చేస్తున్నారు. సింగరేణి ముంపు గ్రామాల్లోని బాధితులకు ఆర్‌అండ్‌ఆర్‌ వర్తింపజేశామని చెబుతున్నారు. అంతేగాకుండా ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌, రైతుబంధు, డబుల్‌ బెడ్‌ రూముల ఇళ్లు, రైతుబీమా, 24 గంటల విద్యుత్‌, దళితబంధు, కేసీఆర్‌ కిట్‌, అమ్మఒడి, తదితర పథకాల ద్వారా ఎంత మందికి లబ్ధి చేకూర్చామో ప్రచారంలో భాగంగా వారిని కలుస్తున్నారు.

మళ్లీ అధికారంలోకి వస్తే..

బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే ఆసరా పింఛన్లను దశల వారీగా 2016 నుంచి 5016 చేస్తామని, దివ్యాంగులకు 6016 రూపాయలకు, రైతబంధు 10 వేల నుంచి 15 వేలు చేస్తామని, సౌభాగ్యలక్ష్మి పథకం మహిళలకు 3 వేల రూపాయలు ఇస్తామని, కేసీఆర్‌ ఆరోగ్యరక్ష పథకం ద్వారా 15 లక్షల వరకు వైద్యం అందిస్తామని, రూ. 400కే వంట గ్యాస్‌ ఇస్తామని, మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు నిర్మించి ఇస్తామని, అసైన్డ్‌ భూములపై ఆంక్షలు ఎత్తివేస్తామని, అన్నపూర్ణ పథకం సన్న బియ్యం సరఫరా చేస్తామని, రైతుబీమా వలే 5 లక్షల వరకు తెల్ల రేషన్‌కార్డు గల వారికి 5 లక్షల బీమా కల్పిస్తామని బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల గురించి ముగ్గురు అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Updated Date - 2023-11-10T00:08:37+05:30 IST