నిరుద్యోగుల్లో నిరాశ
ABN , First Publish Date - 2023-03-19T00:44:59+05:30 IST
స్వరాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తు న్న నిరుద్యోగులకు నిరాశ మిగిలింది. నిరుద్యోగుల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అక్టోబరులో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ జారీ చేసి అక్టోబరులో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది.

- శ్రమించినా దక్కని ఫలితం
- గ్రూప్ 1 అర్హత సాధించిన వారిలో ఆవేదన
- జిల్లాలో పరీక్ష రాసిన 3,520 మంది అభ్యర్థులు
- పోటీ పరీక్షల అభ్యర్థుల్లో ఆందోళనలు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
స్వరాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తు న్న నిరుద్యోగులకు నిరాశ మిగిలింది. నిరుద్యోగుల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అక్టోబరులో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ జారీ చేసి అక్టోబరులో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. వీటితోపాటు ఇతర శాఖల నోటిఫికేషన్లు వస్తుండడంతో ఉద్యోగాలు సాధిస్తామనే నమ్మకంతో కోచింగ్ సెంటర్లలో గ్రంఽథాలయాల్లో స్వయంగా పుస్తకాలతో నిరుద్యోగ యువత కుస్తీ పడుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రూప్-1 పరీక్ష కోసం 4,266 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 3,520 మంది పరీక్షలకు హాజరయ్యారు. 82.51 శాతంగా హాజరు నమోదైంది. ఇందులో 25 శాతానికి పైగా క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై అయిన వారిలో పరీక్ష రద్దుతో ఒక్కసారిగా నిరాశ చెందారు. ఇదిలా ఉండగా గ్రూప్ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులకు పరీక్షా పత్రాల లీకేజీ ఆందోళన కలిగిస్తోంది. 2014 తరువాత 11 ఏళ్లకు 2022లో గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పకడ్బందీగా పరీక్షలు జరుగుతాయని ఆశించిన నిరుద్యోగులకు రద్దుతో నిరాశ ఎదురైంది. దీంతో మళ్లీ పరీక్ష రాయాలా? అంటూ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే గ్రూప్ - 2, 3, 4, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు సైతం గ్రూప్-1 పరీక్షలు సిద్ధం కావాల్సిందేనా? అని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పేపర్ లీకేజీతో గ్రూప్-1 రద్దు కావడంతో మళ్లీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఫీజు చెల్లించుకుండానే అవకాశాన్ని కల్పించనున్నారు.
పేపర్ లీకేజీపై ఆందోళనలు
గ్రూప్ -1 పరీక్ష పేపర్ లీకేజీ, పరీక్ష రద్దుపై రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ, విద్యార్థి సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. కలెక్టరేట్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తంగళ్లపల్లిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట లీకేజీపై ఫ్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు.
ఆశలపై నీళ్లు
- పందిర్ల శ్రీనివాస్‌గౌడ్, గ్రూప్-1 అభ్యర్థి, గొల్లపల్లి, ఎల్లారెడ్డిపేట
మాది ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి. ఎంకామ్, బీఎడ్ పూర్తి చేశా. ప్రభుత్వం పదేళ్ల తర్వాత గ్రూప్-1 ఉద్యోగానికి ప్రకటన జారీ చేయడంతో ప్రైవేటు ఉద్యోగం మానేసి పరీక్షకు సిద్ధమయ్యాను. ఆరు నెలల పాటు రోజుకు 12 గంటలుపాటు చదివాను. ఆర్థిక ఇబ్బందులను తట్టుకొని ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా కష్టపడ్డాను. ఇంటర్వ్యూ లేకుండా నిర్వహిస్తున్నారంటే పైరవీలకు అవకాశం ఉండదని నిజమైన అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని అనుకున్నా. పరీక్ష పత్రాలు లీకవడంతో ఉద్యోగం వస్తుందనే మా ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది.
ఉద్యోగం కలగానే మిగిలి పోతుంది
- ఆంజనేయులు, అభ్యర్థి, ఎల్లారెడ్డిపేట
పీజీ పూర్తి చేశాను. ప్రభుత్వం ఎప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తుందోనని ఎదురు చూశాను. ఇటీవల టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1, డీఏవో ఉద్యోగ ప్రకటనలను జారీ చేయడంతో పనులు మానుకొని ఆరు నెలల పాటు కష్టపడి చదివాను. ప్రశ్నపత్రాలు లీకవడంతో శ్రమంతా వృఽథా అయ్యింది. ఉద్యోగం కలగానే మిగిలిపోయేట్టుంది. వయసు దాటిపోతుండడంతో భవిష్యత్‌లో తమకు పరీక్ష రాసే అవకాశం లేకుండాపోతుంది.
ఇబ్బందులు అధిగమించి పరీక్ష రాశాం
- మామిడి రాజు, ఇల్లంతకుంట, ప్రిలిమ్స్ క్వాలిఫై అభ్యర్థి
అనేక ఇబ్బందులు అధిగమించి పరీక్ష రాసి గ్రూప్ -1ప్రిలీమ్స్ క్వాలీ ఫై అయ్యాం. ప్రశ్నపత్రాల లీకేజీతో పరీక్షను రద్దు చేయడం బాధ కలిగిస్తోంది. కుటుంబానికి దూరంగా ఉండి పడిన కష్టానికి గుర్తింపు లేకుండా పోయింది. మరోసారి పరీక్షకు సిద్ధం కావాలంటే ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతాయి. ప్రభుత్వం ఉన్నతస్థాయి పరీక్షలు నిర్వహించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రశ్నపత్రాలను లీక్‌చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.