దేశవ్యాప్తంగా ‘దళితబంధు’ అమలు చేయాలి

ABN , First Publish Date - 2023-03-30T23:39:17+05:30 IST

తెలంగాణాలో దళితుల సాధికారత కోసం అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని దళిత్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (డిక్కి) జాతీయ అధ్యక్షుడు నర్రా రవికుమార్‌ అన్నారు.

దేశవ్యాప్తంగా ‘దళితబంధు’ అమలు చేయాలి
న్యూఢిల్లీలో మెమోంటోను స్వీకరిస్తున్న కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

కరీంనగర్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): తెలంగాణాలో దళితుల సాధికారత కోసం అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని దళిత్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (డిక్కి) జాతీయ అధ్యక్షుడు నర్రా రవికుమార్‌ అన్నారు. గురువారం న్యూఢిల్లీలో దళిత్‌ ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (డిక్కి) నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ జీ20 ఇండియా ప్రెసిడెన్సి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌లో ఇటీవల డిక్కీ సభ్యుల బృందంతో కలిసి పర్యటించి దళితబంధు అమలు తీరును పరిశీలించామని చెప్పారు. ఈ పథకం లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలను ఇవ్వడంతో వారు వివిధ యూనిట్లను ఏర్పాటు చేసుకుని వ్యాపారవేత్తలుగా రాణిస్తున్నారని అన్నారు. ఈ పథకం అమలుచేస్తున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు, కరీంనగర్‌ కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ను డిక్కి పక్షాన అభినందిస్తున్నామన్నారు. సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైన కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ మాట్లాడుతూ హుజురాబాద్‌ నియోజకవర్గంలో చేపట్టిన దళిత బంధు పథకం అమలు, సాధించిన లక్ష్యాలను వివరించారు. దళితబంధు పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందిన దళితుల సక్సెస్‌ స్టోరీలను పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా చూపించారు. సమాజంలో ఉన్నత విలువలతో కూడిన వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్న దళితుల లబ్ధిదారుల వివరాలు, వారు సాధించిన పురోగతిని తెలిపారు. డిక్కి ఫౌండర్‌ చైర్మన్‌ మిలింద్‌ కాంబ్లీ దళితబంధు పథకం అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సదస్సులో ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ నాగార్జున్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-30T23:39:17+05:30 IST